breaking news
Bharti Arora
-
స్కూల్ ప్రిన్సిపాల్ గా మహిళా ఐపీఎస్
గుర్ గావ్: తాను దర్యాప్తు కేసులో జోక్యం చేసుకోవద్దని ఉన్నతాధికారితో వాదించి వార్తల్లో నిలిచి మహిళా ఐపీఎస్ అధికారి భారతి అరోరా ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించనున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉన్నతాధికారితో గొడవపడినందుకు ఆమెను హర్యానాలోని రాయ్ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ గా ఆమెను బదిలీ చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ గా ఐపీఎస్ అధికారిని నియమించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. రాయ్ స్పోర్ట్స్ స్కూల్ కు ప్రిన్సిపాల్ గా హర్యానా కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిని నియమించాలని క్రీడలు, యువజన విభాగం కోరిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి మనోహర్ లాట్ ఖట్టర్ ఆమోదం మేరకు క్రీడల మంత్రి అనిల్ విజ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపాయి. గుర్ గావ్ పోలీసు కమిషనర్ నవదీప్ విర్క్ పై ఆరోపణలతో అక్టోబర్ లో అరోరా వార్తల్లోకి వచ్చారు. తాను దర్యాప్తు చేస్తున్న హైప్రొఫైల్ రేప్ కేసులో కమిషనర్ జోక్యం చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. దీంతో ఆమెపై బదిలీ వేటు వేశారు. -
బాస్ వేధిస్తున్నారు: మహిళా ఐపీఎస్
గుర్గావ్: పైస్థాయి అధికారి తనను వేధిస్తున్నారంటూ గుర్గావ్ జాయింట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ భారతీ అరోరా ఆరోపించారు. ఓ అత్యాచార కేసు విచారణకు సంబంధించి పోలీస్ కమిషనర్ నవదీప్ సింగ్ తనను వేధిస్తున్నారని, మానసిక క్షోభకు గురిచేస్తున్నారని, అనవసర జోక్యం చేసుకుంటున్నారని అరోరా చెప్పారు. ఈ విషయంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు హర్యానా డీజీపీ యశ్పాల్ సింఘాల్‌కు లేఖ రాసినట్టు చెప్పారు. రేప్ కేసులో సీనియర్ పోలీస్ అధికారి కొడుకు అజయ్ భరద్వాజ్ నిందితుడిగా ఉన్నాడు. అయితే పోలీస్ కమిషనర్ ఉద్దేశ్యపూర్వకంగా అజయ్ కుటుంబాన్ని ఈ కేసులో చేర్చారని అరోరా ఆరోపించారు. తాను ఈ కేసు దర్యాప్తు ప్రారంభించగానే ఈ విషయం తెలుసుకున్నానని, అభ్యంతరం తెలియజేశానని చెప్పారు. అప్పటి నుంచి నవదీప్ సింగ్ తనను వేధిస్తూ, బెదిరిస్తున్నారని ఆరోపించారు. నవదీప్ సింగ్ వల్ల తన కెరీర్‌కు ప్రమాదం ఉందని డీజీపీ రాసిన లేఖలో అరోరా పేర్కొన్నారు. అయితే అరోరా ఆరోపణలను నవదీప్ సింగ్ ఖండించారు. రేప్ కేసులో నిందితుడి సోదరి అరోరాకు తెలుసని, అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని డీజీపీకి పంపిన నివేదికలో పేర్కొన్నారు. గుర్గావ్ మాజీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆర్ పీ భరద్వాజ్ కొడుకయిన అజయ్‌ను గతేడాడి అత్యాచారం కేసులో అరెస్ట్ చేశారు. అజయ్ మాజీ జీవిత భాగస్వామి ఫిర్యాదు మేరకు అతని కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేశారు.