శ్రమజీవుల హక్కులకు భంగం
– అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య సమావేశం
అలంపూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నూతన విధానాలతో శ్రమ జీవుల హక్కులకు భంగం వాటిల్లుతుందని తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బంటు శ్రీనివాస్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంఘటిత రంగాన్ని అసంఘటిత రంగంగా మార్చి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నాయన్నారు. కాంట్రాక్టు విధానాన్ని తీసుకొచ్చి కార్మికులను ఉగ్యోగంలోకి తీసుకోవడాన్ని కాంట్రాక్టర్లకు కట్టెబెట్టిందన్నారు. దీని వలన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం లేకుండా చేసిందన్నారు. ఇదే విధానాలు ప్రభుత్వాలు అనుసరిస్తూ వారికి తక్కువ వేతనాలు ఇస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఉన్న చట్టాలలో 44 చట్టాలను నాలుగు విభాగాలుగా విభజించి వాటిని సవరణలు చేసి కార్మికుల హక్కులను కాలరాయలని చూస్తోందన్నారు. 15 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు సెప్టెంబర్ సమ్మెలో పాల్గొని తమ నిరసన గళం వినిపించారన్నారు. అయినా ప్రభుత్వం తన విధానాలను సమీక్షించుకుని ఉద్యోగ, కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించకపోగా కార్మిక వర్గంపై మరిన్ని దాడులకు తెగబడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసనగా 2016 సెప్టెంబర్ 2వ తేదిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, జర్నలిస్టు సంఘం రాష్ట్ర నాయకులు చిర్రా రవి, డీటీఎఫ్ నాయకులు రామ్మోహన్, శ్రీనివాస్, హరి నరోత్తమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.