breaking news
Betel farmer
-
నిజాం నవాబుకు ఈ ఊరి నుంచే తమలపాకులు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: బీబీపేట.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకువచ్చేది తమలపాకుల తోటలు. నిజాం కాలంలోనే ఇక్కడి పెద్ద చెరువు కింద తమలపాకుల తోటలు ఉండేవి. తాతల కాలం నుంచి తమలపాకులు పండించిన కామారెడ్డి జిల్లా బీబీపేట రైతులు సాగునీటి కష్టాలతో పంట సాగును వదిలేశారు. అయితే తమలపాకులతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేని రైతులు.. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని ఆకులు అమ్ముతూ పూటగడుపుతున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు సరిహద్దుల్లో ఉన్న బీబీపేట గ్రామంలో 2,532 కుటుంబాలు ఉండగా, 11,312 మంది జనాభా ఉంది. ఇక్కడ అత్యధిక కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి.గ్రామ రైతులు నిజాం కాలం నుంచే తమలపాకులను పండించేవారు. దాదాపు ఏడు గ్రామాలకు సాగునీటినందించే బీబీపేట పెద్ద చెరువు కింద తమలపాకుల తోటలు సాగు చేసేవారు. ఇక్కడ పండించిన తమలపాకుల్లో ఘాటు ఎక్కువగా ఉండేదని చెబుతారు. నిజాం నవాబు కుటుంబానికి కూడా ఇక్కడి నుంచి తమలపాకులు వెళ్లేవి. వీటిని నిజాం నవాబు కూడా ఎంతో ఇష్టపడేవారని చెబుతారు. పెద్ద చెరువు కింద దాదాపు 140 ఎకరాల్లో తమలపాకుల తోటలు పెంచేవారు. ఇక్కడ పండించిన తమలపాకులను అప్పట్లో హైదరాబాద్, నాందేడ్, విజయవాడ, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ఉమ్మడిగా తోటల పెంపకం తమలపాకుల తోటలను రైతులు ఉమ్మడిగా పెంచేవారు. ఒక ఎకరం భూమిలో పది నుంచి పదిహేను మంది రైతులు కలిసి పంట సాగు చేసేవారు. తోట పెంచడమే కాదు ఆకులను తెంపడం, వాటిని రవాణా చేయడం, అమ్మడం వంటి పనులు చేయడానికి ఎక్కువ మంది అవసరం ఉంటుండడంతో రైతులు ఉమ్మడిగా పంట పండించేవారు. తద్వారా ఏ ఇబ్బంది లేకుండా ఉండేది. కొందరు రైతులైతే కూలీల అవసరం లేకుండానే వారి కుటుంబ సభ్యులే కలిసి పంట సాగు నుంచి తెంపడం, అమ్మడం దాకా వాళ్లే చేసుకునేవారు. వందలాది మంది రైతులు పంటల సాగులో పనిచేసేవారు. తమలపాకు తోటల ద్వారా గ్రామంలో కూలీలకు కూడా ఎంతో ఉపాధి లభించేది. తమలపాకు తోటలతో ఆ కుటుంబాలన్నీ ఉన్నతంగా బతికేవి. అయితే 1995 ప్రాంతంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో చెరువు నిండకపోవడంతో రైతులు తమలపాకుల తోటల సాగుకు దూరమయ్యారు. దశాబ్దాల పాటు తమలపాకుల తోటలతో బతికిన రైతులు, నీళ్లు లేక పంట భూములను పడావుగా వదిలేయాల్సి వచ్చింది. దిగుమతి చేసుకుని అమ్ముకుంటున్న రైతులుతమలపాకుల తోటలతోనే జీవనం సాగించిన ఎన్నో కుటుంబాలు తోటలు పెంచడం మానేసినప్పటికీ వ్యాపారాన్ని మానలేకపోయాయి. దీంతో ఆయా కుటుంబాలవారు ఇతర ప్రాంతాల నుంచి తమలపాకులను తెప్పించుకుని విక్రయిస్తున్నారు. కామారెడ్డి, దోమకొండ, సిరిసిల్ల, మాచారెడ్డి, గంభీరావుపేట, రామాయంపేట తదితర ప్రాంతాలకు బీబీపేట (Bibipet) రైతులు వెళ్లి తమలపాకులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. చదవండి: మూడు సంస్థానాలు, 46 జాగీర్లుఒకప్పుడు తమలపాకులు పండించి, ఎగుమతి చేసిన రైతులు ఇప్పుడు దిగుమతి చేసుకుని అమ్ముకునే దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ తమలపాకులు పండినపుడు హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట తదితర ప్రాంతాలకు వెళ్లి అమ్మేవారు. నాందేడ్ ప్రాంతం నుంచి వ్యాపారులు వచ్చి తమలపాకులను కొనుగోలు చేసుకుని తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందులై రైతులు తమలపాకులను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. తమలపాకులతోనే జీవనం నా వయసు 83 ఏండ్లు. మా తాతల కాలం నుంచి తమలపాకుల తోటలు ఉండేవి. నేను 30 ఏళ్లపాటు పెంచిన. ఆకుతోటమీదనే బతికినం. ఆకులను తలమడ్ల రైల్వే స్టేషన్ దాకా ఎడ్ల బండ్లమీద తీసుకుపోయి అక్కడి నుంచి రైలులో పట్నం తీసుకుపోయి అమ్ముతుంటిమి. కొందరు పంట మీద వడ్లు పెట్టేటోళ్లు. మా ఊరికి ఎక్కడెక్కడి నుంచో బ్యారగాళ్లు అచ్చి ఆకులు కొనుక్కుని పోయేటోళ్లు. బీబీపేట అంటేనే తమలపాకుల తోటలు గుర్తు చేసేటోళ్లు. మా ఊరికి ఎంతో పేరుండేది. నీళ్ల కరువుతోని తోటలు బందుజేసినం. ఇగ తోటల ముచ్చటనే లేకుండాపోయింది. ఇప్పుడు మా మనుమడు హైదరాబాద్ (Hyderabad) నుంచి తమలపాలకులు తీసుకువచ్చి ఇస్తే బస్టాండ్ దగ్గర కూర్చుని అమ్ముతున్న. – కుర్ల నారాయణ, బీబీపేట -
మిగతా పంటలతో పోలిస్తే తమలపాకు సాగు కష్టం
-
కలిసిరాని తమలపాకుల పంట..!
-
తమలపాకుల సాగుతో.. గుంటూరు రైతు లాభాల పంట
-
ఇలా చేస్తే తమలపాకు రైతులకు లాభాల పంటే...!
-
తమలపాకు.. పోక సాగు చేస్తున్న కోనసీమ రైతులు
సాక్షి, అమలాపురం: కోనసీమలో పండే కొబ్బరి.. కోకో... చేపలు... రొయ్యలకే కాదు. ఇక్కడ పండే తమలపాకు, పోక (వక్క)కు సైతం దేశంలో మంచి డిమాండ్ ఉంది. తమలపాకు, పోకకు ఉత్తర... దక్షిణ భారత దేశంలోని పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఒకప్పటి తమలపాకు సాగు విస్తీర్ణం తగ్గినా... అడపాదడపా ధరలు తగ్గుతున్నా కూడా ఇక్కడ తమలపాకు పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది.. పోక సైతం ఉత్తర, దక్షిణ భారతాలకు ఎగుమతి అవుతుండడం గమనార్హం. ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్న ఈ రెండు పంటల విలువ నెలకు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా. ఉత్తరాదికి కోనసీమ తమలపాకు పి.గన్నవరం, రావులపాలెం, అయినవిల్లి లంక గ్రామాల్లో తమలపాకు సాగు జరుగుతోంది. సాగు విస్తీర్ణం తగ్గినా ఇక్కడ 218.24 ఎకరాల్లో పంట పండుతోంది. గన్నవరం లంకలను ఆనుకుని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే చాకలిపాలెం, కనకాయిలంక, దొడ్డిపట్ల వంటి ప్రాంతాల్లో పండే తమలపాకు సైతం ఈ జిల్లా నుంచే ఎగుమతవుతోంది. మహారాష్ట్రలోని ముంబై, పూనే, నాగపూర్, అమరావతి, బుషావళీ, యావత్మాల్కు వెళుతోంది. అక్కడి నుంచి గుజరాత్‌లోని సూరత్, వడోదర, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్‌లోని కాండ్వా, ఇండోర్లతోపాటు ఛత్తీస్‌గఢ్‌లకు మన తమలపాకును ఎగుమతి చేస్తారు. పొన్నూరు, కళ్లీ, పావడ రకాలు చేస్తున్నారు. గతంలో ఇక్కడ నుంచి రోజుకు సగటున రెండు లారీల చొప్పున ఎగుమతి కాగా, ఇప్పుడు పశ్చిమ నుంచి వచ్చే ఆకుతో కలిపి రోజుకు ఒక లారీ ఎగుమతి జరుగుతోంది. బుట్టకట్టుబడి కళాత్మకం ఇతర రాష్ట్రాలకు తమలపాకు ఎగుమతి చేసేందుకు వెదురుబుట్టలలో వట్టిగడ్డి వేసి తడిపిన 150 తమలపాకును ఒక మోద (పంతం) చొప్పున కట్టుబడి కడతారు. ఇది ఎంతో కళాత్మకంగా ఉంటుంది. బుట్టకు వచ్చి 20 మోదలు (3వేల) ఆకులుంటాయి. అన్ సీజన్ కావడంతో బుట్ట ధర రూ.600 వరకు ఉంది. ఈ ఏడాది సీజన్లో రూ.1,200 వరకు పలికింది. స్థానికంగా ఎగుమతి చేసే తమలపాకును పెద్దబుట్టలో 100 మోదలు (15 వేల ఆకులు)లు ఉంచి ఎగుమతి చేస్తారు. కేరళకు కోనసీమ వక్క కోనసీమలో అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, కొత్తపేటతోపాటు ద్వారపూడి మండలాల్లో సుమారు 386 ఎకరాలలో పోక సాగు జరుగుతోంది. కొబ్బరి తోటల్లో గట్ల మీద విరివిరిగా కూడా సాగవుతోంది. దేశవాళీ రకం మల్నాడు (కర్ణాటక రకం), హైబ్రీడ్‌లో మంగళ, సుమంగళను సాగుచేస్తున్నారు. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సాకు పోక అధికంగా ఎగుమతి అవుతోంది. పోక విస్తృతంగా పండే కేరళలో దిగుబడి తగ్గడంతో ఇక్కడ నుంచి ఆ రాష్ట్రానికి ఎగుమతి అవుతుండడం విశేషం. ప్రస్తుతం దీని ధర కేజీ రూ.400 వరకు ఉంది. ఎర్రచెక్కలు (పూజా సుపారీ) తయారీ ప్రత్యేకం. పోక చెక్కలను మరిగేనీటిలో కవిరి, సున్నంతో కలిపి ఉడకబెడతారు. ఇలా చేయడం వల్ల పోక చెక్కలకు ఎరుపు రంగు వస్తోంది. ఎర్రచెక్కల కేజీ ధర రూ.450 నుంచి 500 వరకు ఉంటుంది. కిళ్లీలకు అధికం కోనసీమ నుంచి వెళుతున్న తమలపాకు, వక్కలను కిళ్లీల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. గోదావరి నీటి మాహత్మ్యమో ఏమో కాని కోనసీమలో పండే తమలపాకు రుచి బాగుంటుందని ఉత్తరాది వ్యాపారులు దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. వీటితో తయారు చేసే కిళ్లీలకు డిమాండ్ ఎక్కువ. ఉత్తర, దక్షణాదిలలో జరిగే శుభ కార్యక్రమాలలో సైతం వీటి వినియోగం ఎక్కువ. పంట తగ్గినా డిమాండ్ ఉంది మన ప్రాంతంలో పండే తమలపాకుకు మహారాష్ట్రలో మంచి డిమాండ్ ఉంది. అక్కడ నుంచే మిగిలిన రాష్ట్రాలకు వెళుతోంది. మన దగ్గర లేకపోతేనే మిగిలిన ప్రాంతాల్లో కొంటారు. ఇప్పుడు సీజన్ కాకపోవడం వల్ల ధర తగ్గింది. పెట్టుబడులు పెరగడం వల్ల తమలపాకు సాగు కష్టాలతో కూడుకున్నదిగా మారిపోయింది. – మయిగాపుల రాంబాబు, గోపాలపురం, రావులపాలెం మండలం స్థానికంగా కూడా డిమాండ్ తమలపాకుకు ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా స్థానికంగా కూడా డిమాండ్ ఉంది. ఇక్కడ వ్యాపారులకు పంపాల్సి వస్తే 100 మోదలు పంపుతాము. స్థానికంగా కూడా కిళ్లీలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యక్రమాలకు తమలపాకును అధికంగా వినియోగిస్తారు. – గోవిందరాజులు, గోపాలపురం, రావులపాలెం మండలం పూజా సుపారీ ప్రత్యేకం కాయల నుంచి పోక చెక్కలను తయారు చేయడం శ్రమతో కూడుకున్నదే. వక్కలను వేరు చేసి ఎండబెట్టడం, వచ్చిన దానిని గ్రేడ్ చేసి ప్యాకింగ్ చేయడం మేమే చేస్తాం. ఒక విధంగా ఇది శ్రమతో కూడుకున్నదే. పూజా సుపారీని మాత్రం ప్రత్యేకంగా తయారు చేస్తాం. అందుకే దీనికి ఎక్కువ ధర ఉంటుంది. – కడలి దుర్గాభవాని, తయారీదారు, బండారులంక, అమలాపురం మండలం -
పండని జీవితం.
కలిసిరాని తమలపాకుల పంట ఏటేటా తగ్గుతున్నసాగు విస్తీర్ణం హుద్‌హుద్‌తో తీరని కష్టం రూ.15కోట్లకు పైగా రైతులకు నష్టం తమలపాకు రైతు బతుకు పండలేదు. హుద్‌హుద్ కక్కిన విషంతో జీవనం ఆర్థికంగా దుర్భరమైంది. పెట్టుబడి వాయువేగానికి కొట్టుకుపోయింది. అంది వచ్చిన పంటతో అప్పులు తీర్చేద్దామని ఆశించిన రైతు చేతికి చిల్లిగవ్వ దక్కని దుస్థితి. జిల్లాలో ఏ తమలపాకు రైతును కదిపినా కన్నీటి వెతలే. మారిన బతుకు చిత్రం చూస్తే కడుపు తరుక్కుపోతుంది. విశాఖపట్నం : హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు, పూనే, చెన్నై ప్రాంతాలకు నిత్యం జరిగే తమలపాకుల ఎగుమతులు నిలిచిపోయాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట కేంద్రంగా రోజూ ఐదు నుంచి పది లారీల తమలపాకులు ఎగుమతయ్యేవి. ప్రస్తుతం ఒక్క లారీకూడా ఎగుమతయ్యే పరిస్థితి లేకుండా పోయింది. కోస్తాలోని విశాఖజిల్లాలో 1750ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 350 ఎకరాల్లో తమలపాకు (దేశవాళీ రకం) సాగవుతోంది. నీలం తుఫాన్ దెబ్బకు 2012లో రెండు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా హుద్‌హుద్ ధాటికి విశాఖ జిల్లాలో 1350 ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. మిగిలి ఎకరాల్లో కూడా పంట నాసిరకంగా మారడంతో పెట్టుబడి కూడా రాని దుస్థితి. ఈ తుఫాన్‌తో పాటు గోదావరికి పోటెత్తిన వరదల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో సగం పంట ధ్వంసమైంది. దీంతో దిగుబడులు ఊహించని రీతిలో పడిపోయాయి. ఎకరాకు లక్షన్నర వరకు ఖర్చు చేస్తుండగా.. 30 వేలనుంచి 40వేల పంతాలు(మోదులు) (పంతాకు రూ.150 ఆకుల చొప్పున) దిగు బడి ఉంటుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తమలపాకుల సీజన్. ఈ సీజన్లో రావులపాలెం, తుని, పాయకరావుపేట, యలమంచిలి, అడ్డురోడ్డుల నుంచి రోజూ 15కు పైగా లారీలతో పాటు పెద్ద సంఖ్యలో బస్సులు, ఇతర వాహనాల్లో సుమారు రూ.70లక్షల విలువైన తమలపాకులు ఎగుమతయ్యేవి. ప్రస్తుతం అతికష్టం మీద తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి ఒకటి రెండు లోడులు మాత్రమే రాష్ర్టంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ సీజన్లో ఒక్క విశాఖ జిల్లా నుంచి రోజూ రూ.50లక్షలకు పైగా ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క లారీ కూడా ఎగుమతి కాని పరిస్థితి. ఒక్క డిసెంబర్లోనే దిగుబడులు పతనమైపోవడంతో ఎగుమతుల్లేక రూ.15కోట్లకు పైగా రైతులకు నష్టం వాటిల్లినట్టు అంచనా . కేవలం మూడేళ్ల వ్యవధిలోనే రెండుసార్లు తుఫాన్ల దెబ్బకు చేతికంది వచ్చిన పంట సర్వనాశనమై పోవడంతో రైతులు కోలుకోలేక పోతున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఈ పంటసాగుకు రైతులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. హుద్‌హుద్‌కు దెబ్బతిన్న పంటల జాబితాలో తమలపాకులకు చోటుదక్కకపోవడంతో పరిహారం కూడా అందే అవకాశం లేకుండా పోయింది. పెట్టిన పెట్టుబడి దక్కక పాలుపోని స్థితిలో రైతులున్నారు. బహిరంగ మార్కెట్లో కిళ్లీలకు ఉపయోగించే ఈ దేశవాళీరకం తమల పాకుల దిగుబడి లేకపోవడంతో వాటికి గిరాకీపెరిగింది. పెట్టుబడులు దక్కడం లేదు నాది పాయకరావుపేట మండలం సత్యవరం. ఎకరాకు లక్షన్నర వంతున పెట్టుబడితో రెండు ఎకరాల్లో తమలపాకుల పంట చేపట్టాను. హుద్‌హుద్ ధాటికి అంతా పాడైపోయింది. ఏటా ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతూనే ఉన్నాయి. కనీసం పెట్టుబడి కూడా దక్కడం లేదు. ప్రస్తుతం మిగిలిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేకపోవడంతో కోత చేపట్టినా కూలీ ఖర్చు దక్కదు. 2012 నీలం తుఫాన్ సాయం నేటికీ అంద లేదు. ఇప్పుడు హుద్‌హుద్ నష్టాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోలేదు -టి.గంగారావు, తమలపాకురైతు