Begampet airport
-
రాష్ట్రాన్ని ఏవియేషన్ హబ్‌గా మారుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
సనత్‌నగర్ (హైదరాబాద్): తెలంగాణను ఏవియేషన్ హబ్‌గా మారుస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. గురువారం బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన వింగ్స్ ఇండియా–2024ను ఆయన సందర్శించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన ఆయన హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమానాలు నడపాలని కోరారు. అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఎయిర్ షో, గ్లోబల్ ఏవియేషన్ సమిట్‌ను నిర్వహించే అవకాశాన్ని హైదరాబాద్‌కు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఏవియేషన్, ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి సానుకూల వాతావరణం హైదరాబాద్‌లో ఉందన్నారు. ప్రపంచంలో నాణ్యమైన జీవనానికి అనువైన నగరాలకు ర్యాంకింగ్స్ ఇచ్చే మెర్సర్ సంస్థ నివేదిక ప్రకారం హైదరాబాద్ భారతదేశంలోనే అత్యంత నివసించదగిన నగరంగా ఎంపికైందని చెప్పారు. అమృత్కాల్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని పాత విమానాశ్రయాలను పునరుద్ధరించడం, కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుపై దృష్టిసారించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను అనుసంధానించడానికి హెలిపోర్ట్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా అడక్కల్ మండలం గుడిబండ గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు గ్రామం, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. తొలి దశలో ఇప్పటికే వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఈ ఆరు విమానాశ్రయాల సాంకేతిక సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, ఇది ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ డ్యామ్‌లో వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీనికి ఏఏఐ ప్రీ–ఫీజిబిలిటీ నివేదిక కూడా ఇచ్చిందన్నారు. ఇదే కాకుండా మరికొన్నిచోట్ల కూడా వాటర్ ఏరోడ్రోమ్లను ఏర్పాటుచేసే ఆలోచన ఉందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ సముదాయాల వద్ద శాశ్వత హెలిప్యాడ్ సౌకర్యాలు ఉన్నాయని, ఇలాంటి సౌకర్యాలున్న మొదటి రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. రాష్ట్రానికి ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ పరిశ్రమలు అత్యంత ప్రాధాన్య రంగాలుగా ఉన్నాయన్నారు. తయారీ సేవలు, ఇంజనీరింగ్, శిక్షణతోపాటు అనుబంధ సంస్థలకు అతిథ్యం ఇవ్వడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ అనేక ఏరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేసినట్లు కోమటిరెడ్డి వివరించారు. లోహ విహంగాల సందడి ఒళ్లు గగుర్పొడిచే వైమానిక విన్యాసాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికైంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా–2024 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లు రన్‌వేపై కొలువుదీరాయి. వీటిని తిలకించేందుకు బిజినెస్ విజిటర్స్తోపాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు ఆసక్తి కనబర్చారు. బోయింగ్ 777, ఎయిర్ ఇండియాతోపాటు ఆకాశ ఎయిర్ 737–8లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
మరికాసేపట్లో బేగంపేటకు మహేష్ పార్థివ దేహం
సాక్షి, హైదరాబాద్: ఉగ్రమూకల కాల్పుల్లో అమరుడైన షహీద్ మహేష్ పార్థివ దేహం మరికాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకొనుంది. మహేష్ పార్థివ దేహాన్ని స్వస్థలమైన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లికి తరలిచించేందుకు మంగళవారం ఆర్మీ అధికారులు ప్రత్యేక అంబులెన్స్ సిద్దం చేశారు. ఈ సందర్భంగా మహేష్ సోదరుడు మల్లేష్, మామయ్య జీటీ నాయుడు మీడియాతో మాట్లాడారు. మహేష్ మృతి వారి కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తోందన్నారు. అనునిత్యం దేశ సేవకై పరితపించే మహేష్ భరతమాత కోసం ప్రాణత్యాగం చేసినందుకు గర్వపడుతున్నామన్నారు. ప్రతీ ఒక్క యువకుడు కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని చెబుతూ యువకులకు ఆదర్శంగా నిలిచేవాడని పేర్కొన్నారు. (చదవండి: ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం) ఏడాది క్రితమే మహేష్ వివాహం జరిగిందని అంతలోనే మహేష్ మృతి తమ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జమ్మూ కశ్మీర్లో మచిల్ సెక్టార్లో ఆదివారం రోజున ఉగ్రవాదులు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లోవీరమరణం పొందిన ముగ్గురిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహేష్(25) కూడా మరణించాడు. మహేష మృతి వార్త తెలియగానే మహేష్ కటుంబ సభ్యులు, భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
బేగంపేట చేరుకున్న ప్రధాని మోదీ
-
రివ్వుమంటూ రిహార్సల్స్...
హైదరాబాద్: ఈ నెల 16 నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయంలో జరిగే ఏవియేషన్ ఎగ్జిబిషన్లో భాగంగా లోహ విహంగాలు గగనంలో రిహార్సల్స్ చేశాయి. నాలుగు విమానాలు వాయువేగంతో నింగి వైపు దూసుకుపోయి విభిన్న ఆకృతులను ఆవిష్కరించి అద్భుత విన్యాసాలకు తెరలేపాయి. ఏవియేషన్ షోకు ముందే బేగంపేట్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతవాసులు ఈ విన్యాసాలను తిలకించి ఆనందపారవశ్యులయ్యారు. కాగా ఏవియేషన్ నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాలకు చెందిన సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే మంగళవారం రాత్రి, బుధవారం మధ్యాహ్నం వరకు వివిధ కంపెనీల విమానాలు కూడా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నాయి. -
16 నుంచి ఏవియేషన్ ఎగ్జిబిషన్
ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్ హాజరు కానున్న దేశ,విదేశీ అతిథులు సాక్షి, హైదరాబాద్: నగరం మరో అంతర్జాతీయ వేడుకకు ఆతిథ్యమివ్వనుంది. ప్రతిష్టాత్మకమైన 5వ ఇండియా ఏవియేషన్ ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్‌లను బేగంపేట్ విమానాశ్రయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరగుతున్నాయి. కేంద్రం, పౌర విమానయాన శాఖ, ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఫిక్కీ సౌజన్యంతో ఈ నెల 16న ప్రదర్శన ప్రారంభమవుతుంది. ‘‘ఇండియన్ సివిల్ ఏవియేషన్ సెక్టార్: పొటెన్షియల్ యాజ్ గ్లోబల్ మ్యాన్యుఫాక్చరింగ్ అండ్ ఎంఆర్ఓ హబ్’’ ఇతివృత్తంగా ప్రదర్శన జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదర్శన ప్రారంభిస్తారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, కార్యదర్శి ఆర్.ఎన్.చౌబే, ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ తదితరులు హాజరవుతారు. దేశ విదేశాల అతిథులు... ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ప్రదర్శనకు పోలెండ్ మంత్రి ఆన్డ్రెజ్ ఆడంసిక్, మలేషియా రవాణా మంత్రి దాతో లియో టియాంగ్లై, జర్మనీ ఫెడరల్ మినిస్టర్ అలెగ్జాండర్, అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ సుసాన్ కుర్లాండ్, చెక్ రిపబ్లిక్ డిప్యూటీ మంత్రి జిరి కోలిబా తదితర అతిథులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఏవియేషన్ మార్కెట్లోకి వాయువేగంతో... ప్రపంచంలో ఏవియేషన్ మార్కెట్లో 2020 నాటికి అమెరికా, చైనా దేశాల తరువాత భారత్‌దే పైచేయి కానుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏవియేషన్ మార్కెట్లో భారత్‌ది తొమ్మిదో స్థానం. దేశం నుంచి 85 అంతర్జాతీయ విమానయాన సర్వీసులు 40 దేశాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. కాగా 2020 నాటికి దేశంలో విమాన ప్రయాణికులు ప్రస్తుతం ఉన్న 159.3 మిలియన్ల నుంచి 450 మిలియన్లకు చేరుకోనున్నట్లు అంచనా. రాబోయే 20 ఏళ్లలో 200 లోకాస్ట్ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పౌర విమానయాన శాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ శ్రీవాత్సవ ఒక ప్రకటనలో తెలిపారు. 200 సంస్థల భాగస్వామ్యం... ఏవియేషన్ షోలో 12 దేశాలకు చెందిన సుమారు 200 ప్రముఖ సంస్థలు భాగస్వాములవుతున్నట్లు అనిల్ శ్రీవాత్సవ తెలిపారు. ‘ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ తయారీలో అగ్రగామి సీఎఫ్ఎం, యూటీసీ, జీఈ ఏవియేషన్, రోల్స్‌రాయిస్, ప్రాట్ అండ్ విట్నీ వంటి సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారు. చిన్నపాటి బిజినెస్ జెట్లతో పాటు 29 రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లు కొలువుదీరుతాయి. ఎయిర్ ఇండియాకు చెందిన బీ777, హెచ్ఏఎల్కు చెందిన డోర్నియర్, థ్రస్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన టీఏసీ-003, పవన్హంస్కు చెందిన ఎంఐ-172, కతార్ ఎయిర్వేస్కు చెందిన ఏ 350, ఎయిర్ ఏసియా, లెగసీ, ఫీణోమ్, ఎంబ్రేరర్, ఎమిరేట్స్, ఫాల్కన్, కింగ్ ఎయిర్, గ్రాండ్ కారావాన్ వంటి ఎయిర్‌క్రాఫ్ట్‌లు కనువిందు చేస్తాయి. 20 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 200 స్టాల్స్, 14 చాలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల 17న దేశ పౌరవిమానయాన రంగంపై ప్రత్యేక సెమినార్ ఉంటుంది. ఈ నెల 17న దేశ పౌరవిమానయాన రంగంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించనున్నారు. ఇందులో ఈ రంగం అభివృద్ధి, నూతన విధానాలు, బిజినెస్ అంశాలపై దేశవిదేశాల నిపుణులు ప్రసంగిస్తారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రితో ఇంటరాక్టివ్ సెషన్ కూడా నిర్వహిస్తున్నాం’ అని అనిల్ చెప్పారు. ఆగిన హెలీ టూరిజం పర్యాటక శాఖ సహకారంతో ఇండ్‌వెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెలీ టూరిజం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నెల 16 నుంచి 20 వరకు జరగనున్న ఏవియేషన్ ఎగ్జిబిషన్ నేపథ్యంలో కొన్ని అనుమతులు రాలేదు. దీంతో ఈ నెల 11 నుంచి ఆగిన ‘జాలీ రైడ్’ను 21న పునరుద్ధరిస్తామని నిర్వాహకులు తెలిపారు. చివరి రెండు రోజులూ సాధారణ సందర్శకులకు... ఈ నెల 16, 17, 18 తేదీల్లో బిజినెస్ విజిటర్లను మాత్రమే ప్రదర్శనకు అనుమతిస్తారు. చివరి రెండు రోజులు... 19, 20 తేదీల్లో (ఉదయం 10 నుంచి 1 గంట; మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) సాధారణ పౌరులు సందర్శించవచ్చు. ప్రదర్శన తిలకించాలనుకొనేవారు ‘బుక్‌మైషో.కామ్’ వెబ్సైట్లో రూ.300 చెల్లించి టిక్కెట్లు బుక్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. బిజినెస్ విజిటర్లు రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ కార్గో ఏరియాలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. -
ఢిల్లీ బయల్దేరిన ప్రణబ్ ముఖర్జీ
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ పర్యటనను ముగించుకుని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. శనివారం సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు, చంద్రబాబు నాయుడు వీడ్కోలు పలికారు. నగరంలో నల్సార్ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, కేసీఆర్ కూడా పాల్గొన్నారు. -
చంద్రబాబు, కెసిఆర్ చేతులు కలిపిన గవర్నర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర రావు కరచాలనం చేసుకున్నారు. వారి ఇద్దరి చేతులను గవర్నర్ నరసింహన్ కలిపి పట్టుకున్నారు. ముఖ్యమంత్రుల హోదాలో ఇద్దరూ కలవడం ఇదే మొదటిసారికావడం విశేషం. ఈ మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం పలికేందుకు వారు ఇద్దరూ బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. రాష్ట్రపతి రాక సందర్బంగా ఇద్దరూ ఈ రోజు తప్పనిసరిగా కలవవలసిన అవసరం ఏర్పడింది. పాత మిత్రులైన ఇద్దరూ చాలా కాలం తరువాత కలిశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసిన సందర్భంగా గవర్నర్ నరసింహన్‌తోపాటు ముగ్గురూ ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. చంద్రబాబు నాయుడు కెసిఆర్ భుజం తట్టి నవ్వుతూ మాట్లాడారు. గవర్నర్ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించినా కెసిఆర్ ఆ రోజు రాలేదు. అందువల్ల ఆరోజు వీరు కలవలేకపోయారు. నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక్కడకు వచ్చారు. ఆయనకు గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌లను కలపడంలో గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం చేకూర్చడానికి వెంకయ్య నాయుడు ఇక్కడకు వచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఆయన కలిశారు. ఆ తరువాత వీరిద్దరూ ఇలా కలవడం శుభసూచకంగా భావిస్తున్నారు. -
బేగంపేటలో రాష్ట్రపతికి ఘన స్వాగతం
హైదరాబాద్: హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఇక్కడకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. నగరంలో జరిగే నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొంటారు. విమానాశ్రయంలో చంద్రబాబు, కేసీఆర్ పరస్పరం పలకరించుకున్నారు.