breaking news
Basket ball event
-
వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ ఆకట్టుకుంది: సెహ్వాగ్
హైదరాబాద్: తన జీవితంలో మొదటిసారిగా చూస్తున్న వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ క్రీడ తననెంతో ఆకట్టుకుందని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. యూసుఫ్‌గూడ కేవీబీఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆలిండియా వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. గురువారం జరిగిన పురుషుల ఫైనల్లో తమిళనాడుపై మహారాష్ట్ర జట్టు గెలుపొంది విజేతగా నిలిచింది. పంజాబ్ జట్టుకు మూడో స్థానం దక్కింది. మహిళల విభాగంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక జట్లు వరుసగా తొలి మూడు స్థానాలను సాధించాయి. ఫైనల్ అనంతరం సెహ్వాగ్ మాట్లాడుతూ సరైన ప్రోత్సాహం అందిస్తే దివ్యాంగులు అద్భుతాలు చేస్తారని అన్నారు. దివ్యాంగులను ప్రతీ ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. విజేతలకు ట్రోఫీలు అందజేసారు. ఈ కార్యక్రమంలో వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షురాలు మాధవీలత, కళ్యాణి రాజారామన్, శాట్స్ ఎండీ దినకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
సత్తాచాటిన హెచ్‌పీఎస్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రీజినల్ స్పోర్ట్స్ మీట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్, బేగంపేట్) జట్లు సత్తా చాటాయి. బాస్కెట్‌బాల్ ఈవెంట్లో జూనియర్, సీనియర్ బాలుర విభాగాల్లో హెచ్‌పీఎస్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. సీనియర్ బాలుర సెమీస్‌లో హెచ్‌పీఎస్... హెరిటేజ్ వ్యాలీ స్కూల్‌తో, గీతాంజలి స్కూల్... అభ్యాస స్కూల్‌తో తలపడతాయి. జూనియర్ బాలుర సెమీస్‌లో సెయింట్ జోసెఫ్ (హబ్సిగూడ)తో హెచ్‌పీఎస్, జాన్సన్ గ్రామర్ స్కూల్‌తో ఫ్యూచర్ కిడ్స్ పోటీ పడతాయి. శుక్రవారం జరిగిన సీనియర్ బాలుర పోటీల్లో శ్రీనిధి స్కూల్ 39-15తో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి)పై, గీతాంజలి స్కూల్ 35-21తో హెరిటేజ్ వ్యాలీపై, హెచ్‌పీఎస్ 51-21తో అభ్యాస స్కూల్‌పై విజయం సాధించాయి. జూనియర్ బాలుర పోటీల్లో సెయింట్ జోసెఫ్ (హబ్సిగూడ) 29-26తో శ్రీనిధి స్కూల్‌పై చెమటోడ్చి నెగ్గగా, జాన్సన్ గ్రామర్ స్కూల్ 14-13తో గీతాంజలి స్కూల్‌ను ఓడించింది. సీనియర్ బాలికల పోటీల్లో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి) 14-12తో సెయింట్ జార్జ్స్ స్కూల్‌పై, సెయింట్ ఆన్స్ 6-0తో షేర్వుడ్ స్కూల్‌పై, ఎన్ఏఎస్ఆర్ స్కూల్ 12-2తో గీతాంజలిపై గెలుపొందాయి. జూనియర్ బాలికల విభాగంలో హెచ్‌పీఎస్ 15-3తో సెయింట్ జోసెఫ్ (మలక్‌పేట్)పై, ఫ్యూచర్ కిడ్స్ 14-0తో శ్రీ అరబిందోపై, సెయింట్ ఆన్స్ 20-2తో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి)పై గెలిచాయి.