barber ramulu
-
నన్నే అన్నా అంటావా?
కరీంనగర్: హెయిర్ సెలూన్‌కు కటింగ్‌కోసం వెళ్లిన ఓ ఎస్సై అందులో పనిచేసే వ్యక్తిపై తన జులుం ప్రదర్శించాడు. ‘షాపు ఇప్పుడే తెరిచాను కొద్దిసేపు ఆగండి అన్నా’ అన్న పాపానికి పిడిగుద్దులు గుద్ది, దుర్భాషలాడాడు. ఈ ఘటన కరీంనగర్‌లోని ఖాన్పుర ప్రాంతంలో శనివారం చోటు చేసుకుంది. నగరంలోని త్రీటౌన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించే చైతన్య చందర్ ఉదయం ఖాన్పుర ప్రాంతంలో ఉండే ఓ సెలూన్‌కు వెళ్లాడు. తనకు కటింగ్ చేయాలని నాయీబ్రాహ్మణుడు పడాల రాములును కోరా డు. ‘ఇప్పుడే షాపు తెరిచాను. కొద్దిసేపు ఆగండి అన్నా’ అని రాములు సమాధానం చెప్పటంతో ‘నన్ను అన్నా అంటావా? కాసేపు ఆగమంటావా’? అంటూ దూషిస్తూ చేయిచేసుకున్నా డు. సెలూన్లో ఉన్న సీసీకెమెరాల్లో ఘటన దృశ్యాలు రికార్డయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అప్రమత్తమైన త్రీ టౌన్ సీఐ తిరుమల్ వెంటనే టౌన్ ఏసీపీ వెంకటస్వామికి సమాచారమిచ్చారు. విచారణ అనంతరం సీపీకి నివేదిక అందించారు. ఈ ఘటనలో ఎస్సై చైతన్య చందర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. రాములుపై దాడి చేసిన త్రీటౌన్ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని నాయీబ్రాహ్మణుల జిల్లా అధ్యక్షుడు నీలం మొండయ్య డిమాండ్ చేశారు. -
వైఎస్సార్ యాదిలో..
అవి వైఎస్ పాదయాత్ర చేస్తున్న రోజులు.. సిరిసిల్ల ప్రాంతంలో పర్యటిస్తున్నారు.. 2003 ఏప్రిల్ 24న ఎగువ మానేరు ప్రాజెక్టును సందర్శించాక పాదయాత్ర ద్వారా నామాపూర్ గ్రామానికి చేరుకున్నారు.. ఓ రైస్‌మిల్లులో బసచేశారు. అప్పటికే పెరిగిన క్షవరంతో ఉన్న వైఎస్.. క్షురకుడి కోసం వాకబు చేశారు. నామాపూర్‌లోనే ఉన్న మంగలి రాములు.. వైఎస్సార్‌కు క్షవరం చేసేందుకు వెళ్లాడు. ఆయనతో కాసేపు సరదాగా మాట్లాడిన వైఎస్.. ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగారు. ‘‘సర్.. అంతా కరువు, కాటకాలతో అల్లాడుతున్నారు. చేతిలో పనిలేదు. మీకు బాధలు చెప్పుకునేందుకు ఎందరో ఎదురుచూస్తున్నరు’’ అని రాములు అనడంతో.. ‘సరే’ అంటూ వైఎస్ చిరునవ్వు నవ్వారు. నాటి జ్ఞాపకాలను రాములు యాది చేసుకున్నాడు. ‘‘పాదయాత్రలో వైఎస్‌కు క్షవరం చేయడం నా అదృష్టం. వైఎస్ సీఎం అయ్యాక ఒక్కసారైనా కలవాలనుకున్న. కానీ వీలు కాలేదు. రెండోసారి సీఎం అయ్యాక కలిసేందుకు నిర్ణయించుకున్న. కానీ విధి ఆ దేవున్ని తీసుకెళ్లింది’’ అంటూ రాములు దిగాలుగా చెప్పాడు.


