breaking news
balk suman
-
గుబులు రేపుతున్న గులాబీ రేకులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి నేటికి నెలరోజులు. అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి అసమ్మతి కుంపటి పెట్టిన ఆయా నియోజకవర్గాల నాయకులు పట్టు వీడడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో మినహా మిగతా చోట్ల అభ్యర్థుల పట్ల అసంతృప్తి పెల్లుబుకింది. చెన్నూర్‌లో సిట్టింగ్ అభ్యర్థి నల్లాల ఓదెలును మార్చడంతో అసమ్మతి తలెత్తగా, మిగతా చోట్ల సిట్టింగ్ స్థానాల విషయంలో అసంతృప్తి చెలరేగింది. అసంతృప్తి వాదులను చల్లబరిచేందుకు ఓవైపు మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తున్నప్పటికీ, రోజుకో కొత్త సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది. స్థానిక మండల, నియోజకవర్గ నాయకుల అసమ్మతి రాగం వెనుక పెద్ద నాయకులే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో గుబులు రేపుతున్న అసమ్మతి నేతలతో అభ్యర్థులకు తంటాలు తప్పేలా లేవని పరిశీలకులు భావిస్తున్నారు. సుమన్‌కు షాకిచ్చిన ‘బ్రదర్స్’ చెన్నూర్ టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌ను మార్చి మాజీ మంత్రి జి.వినోద్‌కు సీటివ్వాలని ఆయన సోదరుడు మాజీ ఎంపీ వివేక్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన ఆయన అనుచరులు మంత్రి కేటీఆర్‌ను శుక్రవారం కోరారు. ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిసిన వివేక్, వినోద్, చెన్నూర్ నుంచి వెళ్లిన వందలాది మంది అనుచరులు బాల్క సుమన్ స్థానంలో వినోద్‌కు సీటివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే దానికి కేటీఆర్ సుముఖత వ్యక్తం చేయలేదు. తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వినోద్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం జరుగుతుందని, ఎమ్మెల్యే టికెట్టు మార్చలేమని స్పష్టం చేశారు. ఇది సుమన్‌కు కొత్త షాక్. ఓదెలు ఎపిసోడ్ నుంచి తేరుకోక ముందే... చెన్నూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు నిరాకరించి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు సీటిచ్చిన విషయం విదితమే. దీంతో ఓదెలు తీవ్ర అసంతృప్తికి గురవడం, స్వీయ గృహనిర్బంధం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనంతరం జైపూర్ మండలం ఇందరాంలో ఓదెలు అనుచరుడు గట్టయ్య పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓదెలును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌కు పిలిపించి మాట్లాడి భవిష్యత్తుపై హామీ ఇవ్వడంతో చల్లబడ్డారు. శుక్రవారం మందమర్రి, చెన్నూర్‌లలో ఓదెలుతో కలిసి సుమన్ ప్రచారం సాగించారు. ఓదెలు అండదండలు పుష్కలంగా ఉంటాయని భావిస్తున్న తరుణంలో వివేక్ బ్రదర్స్ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో చేసిన హంగామా మింగుడుపడని అంశమే. జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ మూల రాజిరెడ్డి ప్రస్తుతం వివే క్ సోదరులకు అండగా నిలిచినట్లు సమాచారం. బోథ్, ముథోల్‌లలో నివురు గప్పిన నిప్పులా... బోథ్‌లో రాథోడ్ బాపూరావు స్థానంలో తనకు టికెట్టు ఇవ్వాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇప్పటికే పలుమార్లు అధిష్టానం పెద్దలను కలిశారు. అయినా ఎటువంటి హామీ రాలేదు. దీంతో ప్రస్తుతానికి నగేష్ అనుయాయులు మౌనంగానే ఉన్నారు. అయితే బీఫారంలు జారీ చేసే సమయంలోనైనా అభ్యర్థిని మారుస్తారనే ధీమాతో ఉన్నారు. గురువారం తలమడుగు మండలంలో పూజలు చేసేందుకు దేవాలయానికి వచ్చిన బాపూరావుకు స్థానికుల నుంచి నిరసన సెగ తగలడం గమనార్హం. ప్రచార పర్వంలో ఎలా ఉంటుందో తెలియదు. ఈలోపు నోటిఫికేష్ వచ్చి బీఫారంలు ఇచ్చే సమయంలో మార్పులు తప్పవని అంచనాతో ఎంపీ మద్దతుదారులు ఉన్నారు. ముథోల్‌లో విఠల్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలచారి వర్గీయులు చాపకింద నీరులా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా విఠల్‌రెడ్డిని మార్చాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం, చారి నిర్వేదంతో భైంసాలో మకాం వేయడం రాబోయే పరిణామాలను సూచిస్తున్నాయి. మిగతా స్థానాల్లో... బెల్లంపల్లిలో ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగరేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవితో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వం వచ్చిన తరువాత తగిన గుర్తింపు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చినా, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య మార్చాలనే పట్టుపడుతున్నారు. బెల్లంపల్లి టికెట్టు ఆశించి భంగపడ్డ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం చెన్నూర్‌లో బాల్క సుమన్ వెంట ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన అనుచరులు మాత్రం బెల్లంపల్లిలోనే ఉండి చిన్నయ్యకు వ్యతిరేకంగా లోపాయికారి కార్యక్రమాలు చేస్తున్నారని సమాచారం. మంచిర్యాలలో అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావును వ్యతిరేకించిన ఎంపీపీ బేర సత్యనారాయణ బీఎస్పీలో చేరి అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించారు. ఇక్కడ కొందరు ముఖ్య నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అంతర్గత కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. నిర్మల్‌లో గురుశిష్యుల స్నేహరాగం ఎందాకా..? గత ఎన్నికల్లో తనపై విజయం సాధించిన అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డికి పార్టీ టికెట్టు ఇచ్చారని కినుకతో ఉన్న శ్రీహరిరావు ఇటీవల మంత్రి కేటీఆర్ చొరవతో స్నేహగీతం ఆలపించారు. గతంలో గురుశిష్యులుగా కలిసి పనిచేసిన వీరు ప్రస్తుతం ఒకరింటికి ఒకరు వెళ్లి తామొక్కటే అనే సంకేతాలను పంపించే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తనను పట్టించుకోలేదనే అసంతృప్తితో ఉన్న శ్రీహరిరావు ఎంతమేరకు సహకరిస్తారనే భయం మాత్రం మంత్రి ఐకే రెడ్డి వర్గీయుల్లో ఉంది. -
మెత్తబడ్డ ఓదెలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికల కోసం టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఉమ్మడి జిల్లాలో రాజకీయం ఎప్పటికప్పుడు రంగులు మారుతోంది. పది మంది తాజా మాజీ ఎమ్మెల్యేల్లో తొమ్మిది మందికి సీట్లిచ్చిన పార్టీ అధ్యక్షుడు చెన్నూర్‌లో మాత్రమే నల్లాల ఓదెలును మార్చారు. ఇక్కడ నుంచి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు అవకాశం కల్పించడంతో వారం రోజుల పాటు సాగిన హైడ్రామాకు వినాయక చవితి రోజు ముగింపు లభించింది. ముఖ్య మంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన తరువాత ఓదెలు తన మనసు మార్చుకున్నట్లు ప్రకటించారు. రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీతో చెన్నూర్‌లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని ఓదెలు చెప్పారు. అయితే ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలి యని పరిస్థితి. ఈ నేపథ్యంలో చెన్నూర్ రాజకీయం రసకందాయంలో పడింది. బోథ్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్ బీఫారం పంపిణీ నాటికి తనకే అవకాశం వస్తుందన్న ధీమాతో ఉన్నారు. అయితే పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లు చేయకుండా తనదైన శైలిలో మంత్రాంగం నడుపుతున్నారు. ఖానా పూర్లో మాత్రం రమేష్ రాథోడ్ ఇప్పటికే రెబల్ అవతారం ఎత్తారు. ఇండిపెండెంట్‌గానైనా పోటీ ఖాయమని తేల్చేశారు. ఆయన కోసం కాంగ్రెస్ కూడా ఎదురుచూస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో అసంతృప్తి టీకప్పులో తుపాను వంటిదేనని అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయం రసంకందాయంలో పడింది. బోథ్‌లో టికెట్టుపై ఆశతో నగేష్ ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బోథ్ సీటుపై ఇప్పటికీ ఆశతోనే ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకే సీటు లభించింది. అయితే ఎంపీ అయినప్పటికీ శాసనసభకే పోటీ చేయాలనే ఆలోచనతో బోథ్‌లో పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న నగేష్ పార్టీ టికెట్ రాకపోవడంతో జీర్ణించుకోలేకపోయారు. ఆయనకు ఈనెల 3వ తేదీన స్వయంగా పార్టీలోని ఓ కీలక నాయకుడు సీటుపై హామీ ఇవ్వగా, ఆరో తేదీన ప్రకటించిన జాబితాలో మాత్రం ఆయన పేరు లేదు. ఈ విషయమై ఇప్పటికే నగేష్ ముఖ్యమంత్రిని రెండుసార్లు కలిసినట్లు సమాచారం. శుక్రవారం ఇచ్చోడలో పార్టీ నాయకులతో సమావేశమైన నగేష్ సీటు విషయంలో ఇప్పటికీ ఆశాభావంతోనే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. సర్వేలను ప్రభావితం చేయడం, కొందరు నాయకులు తన పట్ల తప్పుగా అధిష్టానానికి నివేదికలు ఇవ్వడం వల్లనే బోథ్ అభ్యర్థిత్వం విషయంలో పరిగణలోకి తీసుకోలేదని ఆయన చెపుతున్నారు. తప్పనిసరిగా తనకు బోథ్ బీఫారం వస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. ఖానాపూర్‌లో రెబల్ స్టార్‌గా రాథోడ్ ఖానాపూర్‌లో రేఖా నాయక్‌ను మార్చి తనకు సీటివ్వాల్సిందేనని ఇప్పటికే రాథోడ్ రమేష్ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. సీటివ్వకపోతే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఖానాపూర్‌లో పోటీ చేయడం, గెలవడం ఇప్పటికే ఖరారైందని ఆయన చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో గందరగోళం నెలకొంది. ఒకవేళ టికెట్లు మార్చే పరిస్థితి ఎదురైనా... టీఆర్ఎస్ మీద బాహాటంగా విమర్శలు చేసిన రాథోడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఏమాత్రం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు సంపాదించే విషయంలో కూడా పునరాలోచిస్తున్నట్లు సమాచారం. చెన్నూర్‌లో కలిసి కాపురం సాధ్యమా..? చెన్నూర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా ఓదెలు స్థానంలో బాల్క సుమన్‌కు సీట్విడంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. సామాజిక సమీకరణాల్లో కూడా రెండు భిన్న వర్గాలకు చెందిన వారు కావడంతో సమస్య తీవ్రమైంది. ఇందారంలో ఓదెలుకు మద్దతుగా పెట్రోలు బాటిల్‌తో హల్చల్ చేసి, చివరికి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రేగుంట గట్టయ్య కూడా సామాజికంగా ఓదెలు వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. ఓదెలు అంశాన్ని ఓ వర్గం రాష్ట్ర స్థాయి అంశంగా మార్చేందుకు ప్రయత్నించింది కూడా. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీతో ఓదెలు తన అసంతృప్తిని అటకెక్కించినట్లు కనిపించినా... మనస్ఫూర్తిగా పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేయడం అనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఓదెలుతో ఫోన్లో మాట్లాడేందుకు ‘సాక్షి ప్రతినిధి’ ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. -
'కోమటిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: జైపాల్ రెడ్డిని విమర్శించే స్ధాయి ఎంపీ సుమన్ కు లేదని టీపీసీసీ ఉపాధ్యాక్షుడు మల్లు రవి తెలిపారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్ ను ఒప్పించింది కేసీఆర్ కాదని, జైపాల్ రెడ్డి అని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్ పై కోమటి రెడ్డి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడటం సరిగా లేదన్నారు. పార్టీలో ఎంతటి నేతలైనా క్రమశిక్షణకు కట్టుబడాల్సిందేనన్నారు.