breaking news
bakkamanthulagudem
-
బక్కమంతులగూడెంలో అంత్యక్రియలు
మఠంపల్లి: తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మృతి చెందిన మెదక్‌జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కుక్కునూరు ఎస్ఐ ఉస్తేల రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో బుధవారం నిర్వహించారు. అంతకుముందు మృతదేహాన్ని సూర్యాపేట డీఎస్పీ సునీతామోహన్, సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ రమేష్, జిల్లా పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బెల్లంకొండ రాంచంద్రంగౌడ్, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, కొండపాక జెడ్పీటీసీ మంజుల, ఎంపీపీ పద్మానరేందర్, రాష్ట్ర ఐడీసీ మాజీ డైరెక్టర్ సాములశివారెడ్డిలు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సాధారణ రైతు కుటుంబం నుంచి సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఉస్తేల అంతిరెడ్డి లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు ఉస్తేల సోమిరెడ్డి ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పని చేస్తుండగా, రెండవ కుమారుడు ఉస్తేల లచ్చిరెడ్డి తహసీల్దార్‌గా పనిచే స్తూ తెలంగాణ రాష్ట్ర తహసీల్దార్లసంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. మూడో కుమారుడు మృతుడు ఉస్తేల రామకృష్ణారెడ్డి కుక్కనూరు ఎస్ఐగా పని చేస్తూ భార్య ధనలక్ష్మి, ఇద్దరు కుమారులతో అక్కడే పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు. మా తమ్ముడి ఆత్మహత్యకు అధికారుల వేధింపులే కారణం తమ తమ్ముడు ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు అధికారుల వేధింపులే కారణమని అతని సోదరులు ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి, తహసీల్దార్లసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉస్తేల లచ్చిరెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడి డీఎస్పీ, సీఐల మానసిక ఒత్తిడే కారణమన్నారు. ఇటీవల గజ్వేల్‌కు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో డిపార్ట్మెంట్ సిబ్బందికి పెట్టిన భోజనాల ఖర్చులు రూ.4 లక్షలు చెల్లించాలని మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. మట్టపల్లిలో కృష్ణాపుష్కరాలకు వచ్చేందుకు అనుమతి కూడా ఇవ్వకపోవడంతో కేవలం భార్య పిల్లలనే పంపించాడన్నారు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను శిక్షించాలని మెదక్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిని కోరామన్నారు. ఏఎస్పీతో పూర్తిస్థాయి విచారణ చేస్తామని , న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. -
విద్యుత్ సబ్‌స్టేషన్‌కు స్థలం కేటాయించాలని రాస్తారోకో
బక్కమంతులగూడెం (మఠంపల్లి): మండలంలోని బక్కమంతులగూడెంకు ప్రభుత్వం మంజూరు చేసిన సబ్‌స్టేషన్‌కు స్థలం కేటాయించాలని కోరుతూ సర్పంచ్, ఎంపీటీసీ, రైతులు శనివారం మట్టపల్లి–హుజూర్నగర్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుంభం బొర్రయ్య, ఎంపీటీసీ మామిడి సోవమ్మ శ్రీనివాసులు మాట్లాడుతూ 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం కేటాయించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఆరు మాసాల క్రితమే విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేసిందని, ఇందుకుగాను తమ గ్రామ సమీపంలోని డొంక వద్ద సర్వేనం. 489లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించామన్నారు. ఆ స్థలంలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సబ్‌స్టేషన్ నిర్మాణానికి అనుమతి ఇప్పించేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. కాగా విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆకుల రమేష్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినకపోవడంతో తహసీల్దార్ యాదగిరికి ఫోన్ చేసి సమస్య వివరించారు. దీంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బేత ప్రతాప్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ గంగసాని వెంకటరెడ్డి, బలుపునూరి వెంకటరెడ్డి, వల్లపుదాసు వెంకన్న గౌడ్, పుల్లారెడ్డి, వెంకన్న, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.