breaking news
backpacker
-
వ్యవసాయ కార్మికులకు ఆస్ట్రేలియా ఆహ్వానం
సిడ్నీ: వ్యవసాయ కార్మికుల కొరతతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు అందజేసే వర్కింగ్ హాలీడే వీసా లేదా బ్యాక్‌ప్యాకర్ వీసాల గడువును మూడేళ్ల కాలానికి పొడిగించింది. యువతీయువకులు ఎవరైనా ఉత్తర ఆస్ట్రేలియాలోని వ్యవసాయ క్షేత్రాల్లో 6 నెలల పాటు పనిచేస్తే వారికి మూడేళ్ల పాటు దేశంలో ఉండే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. సాధారణంగా ఏడాది కాలానికి ఈ వీసాను జారీచేస్తారు. ఈ ఏడాది కాలంలో ఆరు నెలల పాటు ఉత్తర ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్ ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తే వీసా గడువును మరో ఏడాది అదనంగా పొడిగించేవారు. తాజాగా ఈ రెండేళ్ల వీసా గడువును మూడేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ చెప్పారు. ఈ నిర్ణయం 2019, జూలై నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఈ వీసాలకు 45 దేశాల పౌరులు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. -
ఉన్మాదితో రోడ్డు ట్రిప్.. యువతి జీవితం బలి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఓ బ్రిటన్‌కు చెందిన యువతిపై దారుణం చోటుచేసుకుంది. 22 ఏళ్ల ఆమెను దాదాపు రెండు నెలలపాటు బందించి చిత్రహింసలకు గురిచేశాడు ఓ ఉన్మాది. లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆమె శరీరంపై కత్తిగాట్లు పెట్టాడు. నిరంతరం చావుదెబ్బలు కొడుతూ ఊపిరి ఆడకుండా చేసి ఉన్మాదం చూపించాడు. మంగళవారం బాధితురాలిని ఆస్ట్రేలియా పోలీసులు ఈ ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడేశారు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన 22 ఏళ్ల యువతి ఆస్ట్రేలియాకు వెళ్లింది. అక్కడే తనకు ఓ యువకుడితో పరిచయం అయింది. ఆ తర్వాత అతడిని నమ్మి రోడ్డు ట్రిప్‌కు ప్లాన్ చేసుకుంది. అలా మొదలుపెట్టిన ప్రయాణమే ఆ యువతి పాలిట శాపంగా మారింది. తిరిగి వెళ్లడాన్ని అడ్డుకున్న ఆ యువకుడు తొలుత ఆమెకు ఇష్టం లేకుండా లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం బంధించి జనవరి 2 నుంచి మార్చి 5వరకు ఆయా ప్రాంతాలకు తిప్పాడు. ఈ క్రమంలో పలుచోట్ల అత్యాచారం పరంపర కొనసాగించాడు. సిగరెట్లతో కాల్చడం, కత్తితో కోయడం, విపరీతంగా కొట్టడంలాంటి వికృతచేష్టలతో ఉన్మాదిలా ప్రవర్తించాడు. ఇలా మార్చి 6న(సోమవారం) కూడా ఆమెను వేరే చోటుకు తీసుకెళుతుండగా దారిలో పోలీసులు ఉన్నది గమనించాడు. తాను వెనుక సీట్లో దాక్కుంటానని, కారును పోనియ్యాలని బాధితురాలిని భయపెట్టాడు. అదృష్టవశాత్తు పోలీసులు చూసి ఆమె ముఖంపై గాయాలు గుర్తించి అనుమానంతో కారులో నుంచి బయటకు లాగేశారు. అనంతరం కారు వెనుకాలే ఉన్న 22 ఏళ్లు పైబడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో ప్రవేశ పెట్టి రిమాండ్‌కు తరలించనున్నారు. ఈ యువకుడిపై దాదాపు పదుల సంఖ్యలో ఈ తరహా కేసులు నమోదుచేశారు. రోడ్ ట్రిప్ వెళ్లేందుకు ఆస్ట్రేలియా చాలా అద్బుతంగా ఉంటుంది. ప్రతి ఏటా ఇక్కడకు ఈ కారణంతోనే దాదాపు ఆరులక్షలమంది పర్యాటకులు వస్తారని అంచనా.