breaking news
back door transfers
-
బ్యాక్‌డోర్ ఎంట్రీ పేరుతో టోకరా : నిందితుడి అరెస్టు
సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని ఓ కంపెనీలో బ్యాక్‌డోర్ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళ వారం అరెస్టు చేశారు.రాచకొండ సీపీ మహేష్ భగవత్ కథనం ప్రకారం... బీటెక్ పూర్తి చేసిన నరేందర్ రెడ్డి ఉద్యోగం కోసం అన్వేషిస్తూ చింతల్‌లోని రాధా కన్సల్టెన్సీ ఎండీ శ్రావణి కోటిపల్లికి తన రెస్యూమ్ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అతడికి కూకట్‌పల్లిలోని ఎకో పౌండ్ సిస్టమ్స్ రిక్రూటింగ్ ఏజెంట్‌ను రాఘవేంద్ర పేరుతో ఫోన్ వచ్చింది. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేసిన అతను ఏకో పౌండ్ సిస్టమ్ లో ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యావంటూ గతేడాది అక్టోబర్ 30న కంపెనీ మెయిల్ ఐడీ నుంచి బాధితుడి మెయిల్‌కు ఆఫర్ లెటర్ పంపాడు. బ్యాక్‌డోర్ ప్రాసెసింగ్ చార్జీల కింద రూ.1,10,00 చెల్లించాలని రాఘ వేంద్ర చెప్పడంతో అతడిచ్చిన రెండు బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమచేశాడు. ఆ తర్వాత నుంచి ఫోన్ చేసినా ఎటువంటి సమాధానం రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన నరేందర్ రెడ్డి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ సైదులు నేతృత్వంలోని బృందం టెక్నికల్ డాటా ఆధారం గా అలియాబాద్‌లో అతడిని అరెస్టు చేసింది. -
ఒక లక్ష..ఒక సిఫార్సు!
సాక్షి, హైదరాబాద్: కోరుకున్న చోటికి బదిలీ కావాలా? సాధారణ బదిలీకి అర్హత లేకున్నా, నిషేధం అమల్లో ఉన్నా సరే!? అందుబాటును బట్టి, అవసరాన్ని బట్టి రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఇవ్వగలిగితే చాలు..!? మీ ప్రాంతంలోని ప్రజాప్రతినిధితోనో, మంత్రితోనో సిఫార్సు చేయించుకోగలిగితే చాలు! మీకు కావలసిన చోటుకు వెళ్లిపోవచ్చు!? రాష్ట్రంలో దొడ్డిదారిన జరుగుతున్న అడ్డగోలు బదిలీల వ్యవహారమిది.. సాక్షాత్తూ సీఎం కార్యాలయంలో ఉపాధ్యాయుల బదిలీలతో మొదలైన ఈ వ్యవహారం.. మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోల బదిలీల వరకూ వస్తోంది. ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమల్లో ఉన్నా, ఆ ప్రతిపాదనలను ఆర్థికశాఖ అధికారులు తిరస్కరిస్తున్నా.. చకచకా ఫైళ్లు సిద్ధమైపోతున్నాయి. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి..! ‘ప్రత్యేక’ ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారమంతా సాక్షాత్తూ అమాత్యుల నివాసాల్లోనే జరుగుతుండడం గమనార్హం. త్వరలో సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. అందినకాడికి దండుకునేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎవరికి వారే రాష్ట్రంలో గత మేలోనే దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టారు. అయితే.. కోరుకున్న చోటు దొరకకపోవడం, బదిలీకి తగిన అర్హత లేకపోవడంతో పాటు.. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా పనిచేసే ఉద్యోగులను తమకు అవసరమైన చోట్ల నియమించుకోవడానికి ప్రయత్నించడం వంటి కారణాలతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ‘దొడ్డిదారి’ బదిలీల కోసం ప్రయత్నిస్తున్నారు. సాధారణ బదిలీలపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో.. కేవలం సీఎం కార్యాలయం నుంచి ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా మాత్రమే ఉద్యోగులను బదిలీ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయులతోపాటు మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోల బదిలీలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. సీఎం పేషీతో పాటు మంత్రుల పేషీలు కూడా ఈ బదిలీల పనిలో నిమగ్నమయ్యాయి. అసలు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన జాబితాలనైతే ఏకంగా మంత్రుల నివాసాల్లోనే రూపొందిస్తున్నారు. బదిలీలు కోరుతున్న ఉపాధ్యాయులను పిలిపించి ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. 50 వేల నుంచి లక్ష వరకు మంత్రుల పేషీల్లోని సిబ్బంది వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది మేలోనే నిషేధాన్ని సడలించి బదిలీలు చేపట్టిన నేపథ్యంలో.. ప్రస్తుతం బదిలీ కోరుతూ వస్తున్న ఫైళ్లను ఆర్థిక శాఖ అధికారులు తిరస్కరిస్తున్నారు. కానీ, ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి ఆమోదంతో బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. తొలుత ఈ తరహాలో ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెరతీశారు. చిత్తూరు జిల్లాకు చెందిన 55 మంది టీచర్ల బదిలీలకు ఆయన ఆమోదం తెలిపారు. దాంతో మంత్రులు కూడా తమ జిల్లాల్లో ఉపాధ్యాయులతో పాటు మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోల బదిలీలపై దృష్టి సారించారు. ఈ బదిలీలకు సంబంధించి ఆయా జిల్లాల్లోని ప్రజాప్రతినిధుల సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇక ఒక జిల్లాకు చెందిన మంత్రి నివాసంలో అయితే సిబ్బంది గత రెండు రోజులుగా వంద మంది టీచర్ల బదిలీలకు సంబంధించిన పనిలోనే ఉన్నారు. ఆ జిల్లాలో ప్రజాప్రతినిధుల సిఫార్సులతో వంద మంది టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. వారి దరఖాస్తులను జాబితా రూపంలో సిద్ధం చేయాలని మంత్రి తన వ్యక్తిగత సహాయకులను ఆదేశించారు. వారు ఆ జిల్లా విద్యాశాఖ అధికారి సహాయంతో బదిలీలు కోరుతున్న ఉపాధ్యాయుల నుంచి రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో ఇతర జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సులతో సుమారు 500 మంది టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇప్పటికే దాదాపు 80 మంది టీచర్ల బదిలీలకు సీఎం ఆమోదం తెలిపారు. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు సరికాదని, అయినా నిషేధం అమల్లో ఉందని ఆర్థిక శాఖ అధికారులు మొత్తుకుంటున్నా... విద్యాశాఖ మంత్రి, ఆర్థిక మంత్రి, సీఎం ఆమోదంతో బదిలీల వ్యవహారం కొనసాగుతూనే ఉంది. కాగా.. గతంలో విద్యా సంవత్సరం మధ్యలో ఇలాంటి సిఫార్సు బదిలీలు ఇంతగా జరిగేవికాదని, విద్యా సంవత్సరం ముగిసిన తరువాత సెలవుల్లోనే కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేసేవారమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కానీ, ఇప్పుడు అడ్డదారిలో బదిలీలు జరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే మంత్రుల సిఫార్సుల మేరకు మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు కూడా బదిలీలకు దరఖాస్తులు చేసుకుంటుండడం గమనార్హం.