breaking news
bachannapet
-
అలా పుట్టిందే చిట్టి చిలకమ్మ పాట
అమ్మమ్మ తన చిట్టి మనవరాలిని బుజ్జగిస్తూ ... ‘చిట్టి చిలకమ్మా / అమ్మ కొట్టిందా..! ’అని చెబుతుంటే మనవరాలు కళ్లు విప్పార్చి వింటున్న అందమైన దృశ్యం మన కళ్ల ముందు నిలుస్తుంది. అమ్మ తన కూతురితో ‘పండు తెచ్చావా.. గూట్లో పెట్టావా.. గుటుక్కున మింగావా..’ అనగానే చిన్నారి కూతురు కిల కిల నవ్వే నవ్వులు తలపునకు వస్తాయి. చిలకమ్మ వచ్చేసింది.. పండు తెచ్చింది అని చిన్నారులంతా సంబరపడిపోయి పాడుకునే ఆ పాట అరవై ఏళ్లుగా తెలుగు ముంగిళ్లలో పిల్లలున్న ప్రతి ఇంట్లో వినపడుతూనే ఉంది. ఈ గేయం ఎనిమిది పదుల బల్ల సరస్వతి నోట పుట్టింది అనగానే ఆశ్చర్యంగా అందరి చూపులూ ఆమె వైపుకు మరలకుండా ఉండవు. ఎనిమిది పదుల వయసున్న బల్ల సరస్వతి స్వస్థలం జనగాం జిల్లా, బచ్చన్నపేట్ మండలం, కట్కూరు గ్రామం. ఈ పాట ఆమె నోట ఎలా పుట్టింది?! ఇదే విషయం అడిగితే ... ఆమె తన ఏడుతరాల ముచ్చటను మన ముందుంచారు.‘‘ఏడు తరాల ముచ్చట్లు చెప్పాలంటే ఒక్కజాములో అయ్యేది కాదు. నెక్కొండ బ్లాక్‌లో గురజాల అనే గ్రామం కింద గుంటూరుపల్లె అని ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరుకు ప్రైమరీ స్కూల్‌కి సింగిల్ టీచర్‌గా 1962లో వెళ్లాను. ఆ స్కూల్ ఒక గుడిసె. అందులోకి 50 మంది పిల్లలు వచ్చేవారు. ఆ పిల్లలకు చదువు చెప్పడానికి ఏ పుస్తకాలూ లేవు. అక్షరాలు దిద్దించడం, అంకెలు చెప్పడం.. ఎంతసేపూ ఇవే చెబితే పిల్లలు వినరు. రోజంతా వారిని ఎంగేజ్ చేయాలంటే ఎట్లా అని ఆలోచించేదాన్ని. నా చిన్ననాటి నుంచి విన్న పాటలు, కథలు చెప్పాలనుకున్నా. మా అమ్మ నా చిన్నతనంలో చెప్పిన గేయాలు, పద్యాలు, కథలు మాత్రమే కాదు అప్పటికప్పుడు నేనే స్వయంగా పాటలు అల్లి పిల్లలకు చెబుతుండేదాన్ని. అన్నీ పిల్లల మెదళ్లకు చేరేవి కావు. ఇంకా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా. ఆ ప్రాంతమంతా చుట్టూ చెట్లు, చేమలు. నేను ఇలా చటుక్కున చెబితే పిల్లలు లటుక్కున అందుకునేలా ఉండాలి. చిన్నారులు తాము రోజూ చూసేవాటి మీద పాట గట్టి చెప్పాలి. అలా అప్పటికప్పుడు చిలుకల మీద అల్లిన పాటే ఇది... అని చెబితే.. పిల్లలు ఆ పదాలను సులువుగా పట్టేసుకున్నారు. ఆ పాట ఆ నోటా ఈ నోటా.. అలా అలా ఎగురుతూ చాలాకాలం కిందటే ఎల్లలు దాటి అమెరికా దాకా పోయింది. ఇప్పటికీ ఎగురుతూనే ఉంది. సముద్రాలు, పర్వతాల గురించి చెబితే వారికి అర్థమయ్యేది కాదు. సరైన దృష్టి పెట్టేవారు కాదు. అందుకని ఏది చెప్పినా గేయాల రూపంలోనే. టీచర్‌గా రావడానికి ముందు మాకు బేసిక్ ట్రైనింగ్ ఇచ్చారు. అది కూడా నాకు ఉపయోగపడింది. వినోదంగా, అర్థమయ్యే విధంగా, ఆసక్తి కలిగే ప్రయత్నాలు అన్నీ చేసేదాన్ని. ఊరూరూ ప్రయాణం..1957లో అప్పటి 7వ తరగతి పాసయ్యాను. 14 ఏళ్ల వయసులో పెళ్లయ్యింది. మా వారు పీయూసీ చదివారు. ఇద్దరం బేసిక్ టీచర్ ట్రైనింగ్ చేశాం. మా ఇద్దరికీ నెల రోజుల తేడాతో టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. నాకు, మావారికి పక్క పక్క ఊళ్లకు పోస్టింగులు. మూడేళ్లు చేశాక మా సొంత ఊరు కట్కూరుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇక్కడ ఐదేళ్లు చేశాక, ఆలిన్పుర్లో రెండేళ్లు, ఆ తర్వాత మా పుట్టిన ఊరు లద్దునూరుకు ఇద్దరికీ ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ 17 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత మళ్లీ కట్కూరుకు.. ఇలా మొత్తం 37 ఏళ్లపాటు టీచర్‌గా చేసి, హెచ్.ఎం.గా రిటైరయ్యాను. ఏడుతరాల తలపోత... ఎనిమిది పదుల జీవితంలో ఎన్నో అనుభవాలు. ఏడుతరాలు చూసిన అనుభవం. నేత కార్మికుల ఇంట పుట్టి పెరిగాను. పెద్ద కుటుంబం. ఐదుగురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు. మా వారి తోడబుట్టినవాళ్లు ఏడుగురు. పెళ్లికి ముందు మా అక్కాబావ హైదరాబాద్‌లో ఉంటే కొన్నాళ్లు అక్కడే ఉండి, హిందీ నేర్చుకున్నా. మా బంధువు, మామ సుద్దాల హన్మంతు. పెళ్లి తర్వాతే డిగ్రీ చేశాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఎంతోమంది జీవితాలు అతి దగ్గరగా ఉండి చూసిన, ఎన్నో వెతలు విన్నా. ఏ కష్టమైనా, ఆనందమైనా అంతా ఒకే కుటుంబంగా కలిసి పంచుకున్నాం. అవన్నీ కలిపి ‘కలెనేత’ అని ఏడుతరాల తలపోతగా ఆత్మకథ రాస్తే.. పిల్లలు దానిని పుసక్తంగా తీసుకువచ్చారు.శిశిర ధ్వనిపుట్టిల్లు, అత్తిల్లు.. పిల్లల పనులు, స్కూల్ పనులు.. ఎక్కడా తీరిక ఉండేది కాదు. సమావేశం అయినా, సంబరం అయినా అప్పటికప్పుడు ఓ గేయం రాయడం, పాడటం, వదిలేయడం.. అలా రోజులు వెళ్లిపోయాయి. ఆ గేయాలను భద్రపరుచుకోవాలి అనే అలోచన అప్పట్లో లేదు. 2001లో మా వారు చనిపోయారు. ఊళ్లో ఒంటరిగా ఉండలేక పిల్లల దగ్గరకు హైదరాబాద్‌కు వచ్చిన. మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అవన్నీ వింటూ.. చూస్తూ చలించిపోయి, నాకు కలిగిన ఆవేశాన్ని, భావాలను రాసుకుంటూ ఉండేదాన్ని.‘ఒట్టు పెట్టి చెపుతున్నా ఒస్తది మన తెలంగాణ.. అదరకురా తమ్ముడా తెలంగాణ మనదేరా..’ అని తెలంగాణ గురించి.. ‘రంగు రంగులు నింపి ఇంద్రధనుస్సును మైమరపిస్తవు / అచ్చులతికి అతికి అతికి, నేత నేసి నేసి, పడగు పేకల కలయిక నీవు, కష్ట సుఖాల వారధి నీవు...’ అని నేతన్నల కష్టాల గురించి.. ‘అవిశ్రాంతంగా పోరు బాటలో పయనిస్తూ, జీవనసమరాన్నీ ఛేదిస్తూ సాగిపోతాను ముందుకు, మున్ముందుకు... ’ అంటూ విశ్రాంత ఉపాధ్యాయుల కోసం.. రాశాను. ఇలాంటివి దాదాపు ఓ యాభై కవితలను కలిపి ‘శిశిరధ్వని’ పుస్తక రూపంగా మీ ముందుకు తీసుకువచ్చాం’’ అంటూ తన గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు ఈ అనుభవాల విజ్ఞానగని. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు: మోహనాచారి(రచయిత్రి 1962లో తన విద్యార్థుల కోసం అల్లిన పాట... ఆమె చేతివ్రాతతో..)కుటుంబ సభ్యులతో బల్ల సరస్వతి -
చాయ్ వారి చావుకొచ్చింది
బచ్చన్నపేట: టీ తాగి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మణ్‌రావు కథనం మేరకు.. గ్రామానికి చెందిన దాసారం మల్లయ్య ఇంటికి హైదరాబాద్‌లో ఉంటున్న తన సోదరుడు భిక్షపతి వచ్చాడు. ఉదయం మల్లయ్య భార్య అంజమ్మ.. భర్త, మరిదికి టీ ఇచ్చింది. అనంతరం తానూ తాగింది. కాసేపటికి ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. వారి కుమారుడు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అంజమ్మ మృతి చెందింది. మల్లయ్య, భిక్షపతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, టీ పొడిలో విషపు గుళికలు ఉన్నట్లుగా గుర్తించామని ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. -
జనగామ : దొంగల బీభత్సం.. ఒకే రోజు 11 ఇళ్లలో చోరి
సాక్షి, జనగామ : జిల్లాలోని బచ్చన్నపేట మండల పరిధిలోని రామచంద్రపురంలో సోమవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్థరాత్రి రామచంద్రపురంలోని 11 ఇళ్లల్లో దొంగతనం చేసి పెద్దమొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
నేను ప్రేమించా.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు
బచ్చన్నపేట: ఇద్దరూ క్లాస్మేట్స్.. కలసి చదువుకున్నారు.. ఆ రకంగా ఏర్పడిన చనువు ప్రేమగా మారింది. ఈ ప్రేమ యువతి పెళ్లి చెడిపోవడానికి కారణమైంది.. దీంతో కక్ష పెంచుకున్న ఆమె సోదరుడు.. చెల్లెలిని ప్రేమించిన యువకుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ కమాన్ వద్ద శుక్రవారం జరిగింది. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన పేర్ని కొమురమ్మ, తిరుపతి దంపతులకు ముగ్గురు కుమారులు. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?) కాగా, కొమురమ్మ దంపతులు ఇద్దరు కుమారులతో కలసి జీవనోపాధి కోసం ముంబై వెళ్లగా.. రెండో కుమారుడు శ్రీధర్‌ను అమ్మమ్మ వద్ద మండలంలోని కొడవటూర్‌లో చదివించారు. ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి, శ్రీధర్ కలసి ఒకే కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. ప్రస్తుతం యువతి హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో నర్సు శిక్షణ చేస్తుండగా, శ్రీధర్ (22) హైదరాబాద్‌లోనే ఓ హోటల్లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. లాక్డౌన్ కావడంతో ఇద్దరూ కొడవటూర్ గ్రామంలోనే ఉంటున్నారు. (బెంగాలీ కుటుంబం.. విషాదాంతం) నేను ప్రేమించాను.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు ఈ ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో వారు శ్రీధర్‌తో పాటు అతడి తాతను మందలించారు. ఇటీవల యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్ ..ఆ యువతిని పెళ్లి చేసుకోబోయే యువకుడికి ఫోన్ చేసి తమ ప్రేమ విషయాన్ని చెప్పాడు. దీంతో పెళ్లి చేసుకోవడానికి ఆ అబ్బాయి నిరాకరించగా యువతి కుటుంబ సభ్యులు శ్రీధర్‌పై కక్ష పెంచుకున్నారు. శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంపై కొడవటూర్ వెళుతున్న అతడిని యువతి సోదరుడు శివకుమార్ బచ్చన్నపేట – చేర్యాల మెయిన్ రోడ్డుపై కమాన్ వద్ద ఆటోతో ఢీకొట్టగా అతను కింద పడ్డాడు. అనంతరం శ్రీధర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
బడికి పోయినా బతికెటోళ్లు
సాక్షి, బచ్చన్నపేట : బడికి వెళ్లి ఉంటే ఆ ఇద్దరు బాలురు బతికి ఉండేవారు.. ఒకే పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి బాలురు ఆడుకోవడానికి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగిన సంఘటన జనగామ జిల్లా మండలం పోచన్నపేట గ్రామంలో చోటుసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. పోచన్నపేటకు చెందిన బేడ బుడిగ జంగాల కాలనీకి చెందిన నూనె ఎల్లమ్మ–మదార్ పెద్దకుమారుడు జక్కరయ్య(7)తో పాటు అదే కాలనీకి చెందిన కడకంచి లక్ష్మీ–సారయ్య దంపతుల పెద్ద కుమారుడు పాలయ్య(7) స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. ఇద్దరు మంచి స్నేహితులు. శనివారం పాఠశాలకు వెళ్లకుండా కాలనీ పక్కనే ఉన్న చెరువు వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. చెరువులో మిషన్‌భగీరథ పనుల్లో భాగంగా జేసీబీతో పెద్ద గుంతలను తీశారు. సమీపంలో ఆడుకుంటున్న పిల్లలిద్దరూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. నీట మునుగుతున్న క్రమంలో పిల్లలను కేకలు వేయడంతో సిద్ధులు అనే స్థానిక వ్యక్తి గమనించి అక్కడకి చేరుకుని పిల్లలను బయటకు తీసేసరికే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. మృతి చెందిన బాలుడు పాలయ్య తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ గువ్వల ఎల్లమ్మ పోషిస్తోంది. ‘అమ్మ నాయిన లేకపోయినా కంటికి రెప్పలా కాపాడుకుంటాన.. బడికి పోయి ఉంటే నా మనవడు బతికెటోడు’.. అంటై ఎల్లమ్మ గుండెలు పగిలేలా రోదిస్తున్న దీరు ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. రెండో శనివారం పాఠశాలలకు సెలవు.. అయితే ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రకటించిన సెలవుల నేపథ్యంలో రెండో శనివారాలు ప్రభుత్వ పాఠశాలలకు పనిదినాలుగా సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు శనివారం స్కూల్ తెరిచే ఉంది. అయితే ఇద్దరు చిన్నారులు వెళ్లలేదు. -
కారుతో ఢీకొట్టి కిడ్నాప్ చేసిన కేసులో వీడిన మిస్టరీ!
సాక్షి, బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట శివారులో ఈనెల 5న దంపతులు బైక్‌పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి భార్యను కిడ్నాప్ చేసిన సంఘటనలో నలుగురు నిందితులను పట్టుకున్నట్లు జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్, నర్మెట సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పారుపెల్లికి చెందిన బండ తిరుపతి– భాగ్యలక్ష్మి దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహమైనది. భాగ్యలక్ష్మికి అన్నదమ్ములు లేక పోవడంతో తిరుపతి ఇళ్లరికం వెళ్లాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న వీరికి ఒక పాప ఉంది. భాగ్యలక్ష్మి తండ్రి ఆర్ఎంపీగా సేవలందిస్తున్నాడు. ఆయన వద్దకు పక్క గ్రామమైన బొందుగులకు చెందిన మరో ఆర్ఎంపీ పుట్ట బాల్‌నర్సయ్య వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో కొంతకాలం నుంచి తిరుపతి భార్యపై అనుమానంతో వేధించసాగాడు. ఈ విషయాన్ని భాగ్యలక్ష్మి బాల్‌నర్సయ్యకు చెప్పడంతో తిరుపతిని ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశారు. పక్కా పథకం ప్రకారం.. భాగ్యలక్ష్మి ప్రియుడు బాల్‌నర్సయ్య మిత్రుడు అమరాజు సిద్ధులు హైదరాబాద్‌లో బీడీఎల్‌లో డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ పథకం గురించి నర్సయ్య సిద్దులుకు మూడు నెలల క్రితం తెలుపగా మహబూబాద్ జిల్లా బయ్యా రం మండలం గంధంపల్లికి చెందిన మల్సూర్, కేసముద్రం మండలానికి చెందిన లక్ష్మీనారాయణతో కలిసి హత్య చేయడానికి ఒప్పుకుంటారు. ఇందుకుగాను రూ.5 లక్షలు సుపారీ మాట్లాడుకోగా బాల్న్సయ్య అడ్వాన్స్‌గా రూ. లక్ష ఇవ్వగా ఆ ముగ్గురు పంచుకున్నారు. ఈ డబ్బుతో హత్యకు అవసరమైన కా>రును సిద్ధులు ఆలేరు పట్టణంలో రూ.17వేలతో కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఈనెల 5న తిరుపతి, భాగ్యలక్ష్మి జనగామ ఆస్పత్రికి వెళ్లి తిరిగి బైక్‌పై వస్తుండగా పోచన్నపేట శివారులో కారులో వచ్చి ఢీకొట్టా రు. ఈ ఘటనలో గాయపడిన తిరుపతిని పొల్లోకి లాక్కెళ్లి జే వైరుతో ఉరిపెట్టారు. ఆ సమయంలో గొర్లకాపర్లు రావడంతో గాయపడిన భాగ్యలక్ష్మిని కారులో తీసుకుని పోచన్నపేటకు వెళ్లారు. అక్కడి నుంచి బాల్‌నర్సయ్య భాగ్యలక్ష్మి జనగామకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అయితే సంఘటన స్థలంలో అపస్మారకస్థితిలోకి వెళ్లిన తిరుపతిని అటుగా వచ్చిన వారు గమనించి 108లో జనగామ ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ మల్లేష్, ఎస్సై రంజిత్‌రావు వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నలుగురు అరెస్టు స్వాధీనం చేసుకున్న వాహనం వద్ద డీసీపీ, ఏసీపీ పోలీసులు; మాట్లాడుతున్న జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి దర్యాప్తులో భాగంగా నర్మెట సీఐ సంతోష్‌కుమార్ ఆదేశాలతో ఎస్సై రంజిత్‌రావు, ప్రొహిబిషన్ ఎస్సై ప్రశాంత్ బొందుగుల గ్రామంలోని ఇంట్లో బాల్నర్సయ్యతో సహా అతడికి సహకరించిన సిద్ధులు, లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశా రు. విచారణ చేపట్టగా హత్యాయత్నం ఘటనలో భాగ్యలక్ష్మి పాత్ర ఉందని తేలడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి మ న్సూర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, రూ.30,430 నగదు, బైక్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హత్యాయత్నం కేసులు రెండు రోజుల్లోనే ఛేదించిన ఎస్సైలు రంజిత్‌రావు, ప్రశాంత్‌లను డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ సంతోష్‌కుమార్ అభినందించారు. -
ఆలయ తలుపుల్ని పగలగోట్టిన ఎలుగుబంటి
బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండ లం కట్కూర్ గ్రామంలో గురువారం రాత్రి ఎలుగుబంటి సంచరిండం గ్రామస్తులను కలవరపెట్టింది. అర్ధరాత్రి గ్రామంలో ఎలుగుబంటిని చూ సి కుక్కలు అరవగా గ్రామస్తులు దానికి గమనించి భయంతో తలుపులు వేసుకున్నారు. గ్రామ నడిబొడ్డునఉన్న హనుమాన్ ఆలయం తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లింది. అదే సమయంలో అటు గా వెళ్తున్న కొందరు ఎలుగుబంటిని చూసి అం దరికీ ఫోన్లో సమాచారం అందించారు. కాగా కుక్క లు తరమడంతో ఎలుగుబంటి గ్రామం నుంచి బయటకు వెళ్లిపోయి ంది. కాగా ఎలు గుబంటు భయంతో పాలవ్యాపారులు వ్యవసాయ కూలీలు, రైతులు ఒంటరిగా బయటకు రాలేదు. రాత్రి వేళ గ్రామం లోని జీపీ కార్యాల యం వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో ఎలుగుబంటి దృశ్యాలు న మోదయ్యాయి. సంబంధిత అధికారులు ఎలుగుబంటిని పట్టుకెళ్లాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
జిల్లా కోసం బలిదానం
జనగామ జిల్లా కాదేమోనని మనస్తాపం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు బచ్చన్నపేటలో విషాదం బచ్చన్నపేట : జనగామ జిల్లా రాదేమోననే బెంగతో ఓ యువకుడు ప్రాణం తీసుకున్నాడు. ప్రభుత్వం జిల్లాల ముసాయిదా ప్రకటించిన నాటి నుంచి మనో వేదనకు గురవుతున్న భవన నిర్మాణ కార్మికుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రం ఇందిరానగర్‌కు చెందిన కొన్నె కిష్టయ్య–ఎల్లమ్మ కుమారుడు బాల్‌రాజు(28) భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తున్నాడు. పని కోసం నిత్యం జనగామకు వస్తూ.. జిల్లా కోసం జరిగే ఉద్యమాలు, ఆందోళనలో చురుకుగా పాల్గొంటున్నాడు. జనగామ జిల్లా కావడం లేదని కొద్ది రోజులుగా మానసిక వేదనకు గురవుతున్నాడు. ప్రభుత్వం సోమవారం ప్రకటించిన జిల్లాల ముసాయిదాలో జనగామ పేరు లేకపోవడంతో పేపర్ చూసుకుంటూ కుమిలిపోయాడు. అన్నా.. జనగామ జిల్లా వస్తదంటవా.. ఆమరణ దీక్ష చేసే నాయకులు చనిపోతే ఎలా.. అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ అడిగేవాడని స్థానికులు చెబుతున్నారు. నిత్యం పని కోసం జనగామకు వచ్చే బాలరాజు మంగళవారం జనగామకు రాలేదు. ఇంటి వద్దనే దిగాలుగా ఉన్నాడు. అతని భార్య రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లింది. మంగళవారం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో బాలరాజు ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు కిష్టయ్య, ఎల్లమ్మలు ఇంటికి రాగా బాలరాజు దూలానికి వేలాడుతూ కనిపించాడు. వారు బోరున విలపిస్తూ ఇరుగుపొరుగు వారిని పిలిచారు. అప్పటికే బాలరాజు మృతిచెందాడు. అన్నం తినరా బిడ్డా..అని ఎంత బతిమిలాడినా పేపరు చదువుతూ దిగాలు చెందాడని తండ్రి విలపించారు. ఒక్క కొడుకని గారాబంగా చూసుకున్నామన్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా..రోజువారి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న బాలరాజు మృతితో వారు దిక్కులేని వారయ్యారు. మృతునికి ఏడాది వయస్సుగల కుమారుడు ఉన్నాడు. కాగా, బాలరాజు ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం అందుకున్న జిల్లా ఉద్యమకారులు, రాజకీయ పార్టీల నాయకులు బచ్చన్నపేటకు వచ్చి సంతాపం ప్రకటించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జనగామ జిల్లా చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కోసం జనగామ పట్ణణంలో ఇప్పటి వరకు ముగ్గురు గుండెపోటుతో మృతిచెందారు. ఇప్పుడు బచ్చన్నపేటలో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
అప్పు మిగిలి.. గుండె పగిలి
* తెలంగాణలో సోమవారం ఒక్కరోజే ఐదుగురు రైతుల ఆత్మహత్య * అప్పులెలా తీర్చాలనే ఆవేదనతో గుండె ఆగి మరో ఇద్దరు మృతి * అన్నదాతలను బలిగొంటున్న పంటనష్టం, విద్యుత్ కోతలు, అప్పులు * ఆధారం కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో రైతుల కుటుంబాలు సాక్షి నెట్వర్క్: ఎన్నో ఆశలతో ఎదురు చూసినా కురవని వర్షాలు.. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని కరెంటు.. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు.. అన్నీ కలిసి రైతులను నిలువునా బలిగొంటున్నాయి.. ఆరుగాలం చేసిన కష్టం కళ్ల ముందే నాశనమవడాన్ని తట్టుకోలేక అన్నదాతలు ప్రాణాలు వదులుతున్నారు.. కుటుం బాన్ని పోషించాల్సినవారు దూరమవుతుండడంతో వారి కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకుంటున్నాయి. వర్షాభావం, విద్యుత్ కోతలు, పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో సోమవారం తెలంగాణలో ఐదుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా.. ఆవేదన కారణంగా గుండె ఆగిపోయి మరో ఇద్దరు రైతులు మృతి చెందారు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన మహిళా రైతు తుప్పతి లక్ష్మి (30) తమ నాలుగెకరాల్లో కొన్నేళ్లుగా పత్తి, వరి, మొక్కజొన్న సాగుచేసింది. పెట్టుబడుల కోసం రూ. 2.5 లక్షలు అప్పు చేసింది. కానీ నాలుగేళ్లుగా పంటల దిగుబడి సరిగా లేక.. అప్పులెలా తీర్చాలనే ఆవేదనతో ఆమె ఆదివారం రాత్రి పురుగుల మందు తాగింది. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన బట్టు ఎల్లం(32) తమ మూడెకరాల్లో వరి వేశాడు. నీటి కోసం మూడు బోర్లు వేయించాడు. కానీ వర్షాభావం, కరెంట్ కోతలతో ఖరీఫ్ పంటంతా ఎండిపోయింది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులెలా తీర్చాలనే ఆందోళనతో సోమవారం ఉదయం తన పొలం వద్దే చెట్టుకు ఉరి వేసుకున్నాడు. దీంతో ఆయన కుటుంబానికి పెద్ద దిక్కులేకుండా పోయింది. ఇక కోహెడ మండలంలోని సముద్రాల గ్రామానికి చెందిన ఎల్ల చంద్రం(45) పత్తి పంట వేసి నష్టపోయాడు. దీంతో కలత చెంది సోమవారం పురుగుల మందు తాగాడు. అతనికి భార్య ఎల్లవ్వ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంకా చిన్న కుమార్తె వివాహం చేయాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బోందిడి గ్రామానికి చెందిన రాథోడ్ నారాయణ (50) ఐదెకరాల్లో సోయా, రెండెకరాల్లో పత్తి వేశాడు. కానీ వర్షాల్లేక దిగుబడి రాకపోవడంతో... ఆవేదన చెంది పురుగుల మందు తాగాడు. ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం ఎల్లాపురం తండాకు చెందిన రైతు తేజావత్ రాంబాబు (30) రెండెకరాల్లో మిర్చి, మూడెకరాల్లో మొక్కజొన్న పంట వేశాడు. పంటలు ఎండిపోవడంతో పాటు బోరు వేయడం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనకు గురయ్యాడు. ఆ ఆందోళనతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు. అప్పులు మింగేశాయి.. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హన్మాజిపేట గ్రామానికి చెందిన యెల్లాల లింగారెడ్డి(65) తమ పది ఎకరాల భూమిలో పత్తి వేశాడు. వర్షాభావం కారణంగా నష్టం రావడంతో.. ఆందోళన చెంది గుండెపోటుకు గురయ్యాడు. ఇక నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామానికి చెందిన నూకపంగు సైదులు(48) తమ నాలుగున్నర ఎకరాల్లో వరి సాగుచేశాడు. వర్షాభావం, తెగుళ్లతో పంట దెబ్బతిని కొద్దిరోజులుగా ఆందోళన చెందుతున్నాడు. ఈ ఆవేదనతోనే గుండెపోటుతో మృతి చెందాడు.