breaking news
Attendance of teachers
-
ఫోన్ యాప్ ద్వారానే టీచర్ల హాజరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ మినహా అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ సెప్టెంబర్ 1 నుంచి ఇంటిగ్రేటెడ్ అటెండెన్స్ మొబైల్ యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యా శాఖ మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. ఫోన్ యాప్ ద్వారా మాత్రమే ఉపాధ్యాయులు హాజరును వేయాలని తెలిపింది. వీరితోపాటు పాఠశాల విద్యా శాఖ నియంత్రణలో ఉన్న అన్ని కార్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది కూడా ఈ యాప్‌లో హాజరు నమోదు చేయాలని వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి ఏ కార్యాలయాల్లోనూ మాన్యువల్ హాజరును నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. వికలాంగుల సంక్షేమ శాఖ నిబంధనల ప్రకారం.. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందని వివరించింది. వారు ప్రత్యేకంగా మాన్యువల్ రిజిస్టర్లలో హాజరు నమోదు చేయాలని పేర్కొంది. కాగా, ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని నెల రోజుల్లో అన్ని విభాగాల్లో అమలు చేయనున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోతే.. ఆండ్రాయిడ్ ఫోన్‌లేని టీచర్లు, ఉద్యోగులు తమ హాజరును హెడ్మాస్టర్ లేదా ఇతర ఉపాధ్యాయుల మొబైల్స్ ద్వారా నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఉపాధ్యాయులు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్లను బుధవారంలోపు పూర్తి చేయాలని తెలిపింది. యాప్ ద్వారా హాజరు నమోదు.. విద్యా శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు, జోన్, జిల్లా కార్యాలయాలు, డైట్స్, ఎంఈవో తదితర కార్యాలయాలకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరు నమోదు కోసం యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునేలా చూడాలని పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, డీఈవోలు, హెడ్మాస్టర్లను ఆదేశించింది. హాజరును క్రమం తప్పకుండా యాప్ ద్వారా నమోదు చేసేలా చూడాలని పేర్కొంది. -
డుమ్మాలు జాన్తానై
గైర్హాజరయ్యే టీచర్లపై సర్కార్ నిఘా - నేటి నుంచీ ఉపాధ్యాయుల హాజరుపై కలెక్టర్ పర్యవేక్షణ - ఉదయం 10 గంటల్లోగా హెచ్ఎంల ద్వారా ఎంఈఓలకు హాజరు వివరాలు - 12 గంటల్లోగా జిల్లా అధికారులకు సమాచారమివ్వనున్న ఎంఈఓలు మెదక్: సర్కార్ స్కూళ్లలోనూ కార్పొరేట్ విద్య అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. అందులో తొలుత పంతుళ్లపై పర్యవేక్షణకు సిద్ధమైంది. అందులో భాగంగానే నేటి నుంచి ప్రతిరోజు పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల అటెండెన్స్‌ను ఏకంగా కలెక్టరే మానిటరింగ్ చేయనున్నారు. ఉదయం పాఠశాల సమయానికి విధులకు హాజరైన...గైర్హాజరైన..ఉపాధ్యాయుల వివరాలను ఏకంగా కలెక్టర్, విద్యాశాఖ అధికారి, ఆర్వీఎం పీఓ లకు సమాచారం అందించాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్న తరుణంలో మెదక్ జిల్లాలో తీసుకున్న ఈ నిర్ణయం...ఇతర జిల్లాలకు ఆదర్శంగా మారే అవకాశం ఉంది. మెదక్ జిల్లాలో 1,974 ప్రాథమిక, 423 ప్రాథమికోన్నత, 502 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 2,899 పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో మొత్తంగా సుమారు 12 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం...ఇటీవలే పాఠశాలల వేళలను కూడా మార్చారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల ఉపాధ్యాయులు సమయానుకూలంగా పాఠశాలకు రావడం లేదన్న ఆరోపణ లున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ అధికారులు పోలింగ్ బూత్‌ల కోసం జిల్లాలో సుమారు 75 పాఠశాలలను పరిశీలించిన సమయంలో, దాదాపు 62 పాఠశాలల్లో ఉపాధ్యాయులు తమ విధుల్లో అలసత్వం వహిస్తున్నట్లు గుర్తించి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లినట్లు సమాచారం. రోజువారీ మానిటరింగ్ ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉదయం 10 గంటలకల్లా సంబంధిత ఎంఈఓలకు ఉపాధ్యాయుల హాజరుపై సమాచారం ఇవ్వాలి. ఎంఈఓలు మధ్యాహ్నం 12 గంటల్లోపు కలెక్టర్‌కు, విద్యాశాఖ అధికారికి, ఆర్వీఎం పీఓకు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇందులో పాఠశాల పేరు, మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య, సెలవుల్లో ఉన్న వారి వివరాలు, విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయుల హోదా, బోధించే సబ్జెక్ట్ తదితర వివరాలు ఉన్నత అధికారులకు తెలియజేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఇక నుంచి పంతుళ్లు విధులకు డుమ్మా కొట్టినా...సమయ పాలన పాటించకపోయినా ఏకంగా కలెక్టరే చర్య తీసుకునే అవకాశం కలిగింది. గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన స్మితా సబర్వాల్ ప్రభుత్వాస్పత్రుల్లో, హాస్టళ్లు, కేజీబివీల్లో స్కైప్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 14 నుంచి ప్రభుత్వ పాఠశాలల పనితీరును పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన విషయం విధితమే. వీటికితోడు ఉపాధ్యాయుల పనితీరుపై రేటింగ్ కూడా నమోదు చే సేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా ఉపాధ్యాయుల హాజరుపై కలెక్టర్ పర్యవేక్షణ ప్రారంభమవుతోంది. మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవడం గమనార్హం.