breaking news
Assembly election Bihar
-
బిహార్ ఎన్నికల దిక్సూచి ఎటువైపు?
దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బిహార్ రాజకీయాలది ఎప్పుడూ ప్రత్యేకతే! రెండు వేల యేళ్లకు పైగా చరిత్ర కలిగిన నాటి పాటలీపుత్ర, నేటి పట్నా రాజధానిగా గల బిహార్... సంకీర్ణ ప్రభుత్వాలకు పుట్టినిల్లు. 1990లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తర్వాత రాష్ట్రంలో 35 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలదే హవా! రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలుండటంతో దేశ వ్యాప్తంగా బిహార్‌పై ఆసక్తి నెలకొంది. అస్థిర ప్రభుత్వాల రాష్ట్రంబిహార్ రాజకీయాల్లో కుల ప్రభావం ఎక్కువ. రూ. 28,485 తలసరి ఆదాయంతో దేశంలోనే పేద రాష్ట్రంగా నిలిచిన బిహార్ అస్థిరమైన ప్రభుత్వాలతో మరింత వెనుకబడింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ) కొద్ది కాలం తర్వాత మహాఘట్ బంధన్‌తో చేతులు కలిపింది. అనంతరం తిరిగి ఎన్డీఏతో జత కట్టింది. తొమ్మిది సార్లు బిహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నితీశ్ కుమార్ పలుమార్లు కూటములు మారడం రాజకీయ అస్థిరతకు నిదర్శనం. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూటముల కూర్పు కూడా ఆసక్తి కలిగిస్తోంది. నితీశ్ నేతృత్వంలో ఎన్డీఏ ఎన్నికలకు సిద్ధమవుతున్నా, కూటమిలోని బీజేపీ ఎత్తుగడలను అంచనా వేయలేము. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న మహాఘట్ బంధన్ కూటమిలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌దే ఆధిపత్యం. ఈ రెండు కూటములకు పోటీగా బరిలోకి దిగుతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బీజేపీ, జేడీ (యూ) సంస్థాగతంగా బలంగా ఉన్నాయి. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉండటంతో పాటు దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ప్రచారం కలిసి వచ్చే అంశం. గత ఎన్నికల్లో 115 స్థానాల్లో పోటీ చేసిన జేడీ(యూ) 43 స్థానాల్లో గెలవగా, 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 74 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో తామే అధిక స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ చెబుతుంటే, 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను చూపుతూ, సమ స్థానాల్లో పోటీ చేయాలని జేడీ(యూ) వాదిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో, జేడీ (యూ) 16 స్థానాల్లో పోటీ చేయగా ఈ రెండు పార్టీలు చెరో 12 చోట్ల గెలిచాయి. ఎన్డీఏ కూటమికి హిందువుల్లోని అగ్రవర్ణాలు, యాదవేతరుల ఓబీసీ వర్గాలు ఓటు బ్యాంకుగా ఉన్నాయి. సీఎం నితీశ్ బిహార్ మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్లు ఇటీవల ప్రకటించడంతో ఎన్డీఏకు మహిళల మద్దతు రెండింతలైంది. దీంతోపాటు రోడ్ల నిర్మాణం, మద్య నిషేధం, సంక్షేమ పథకాలు కూడా ఎన్డీఏకు లబ్ధి చేకూర్చనున్నాయి. నితీశ్ రాష్ట్రంలో నిర్వహించిన కులగణనతో ఓబీసీలు ఎన్డీఏకు సానుకూలంగా ఉన్నారు. పార్టీల బలాబలాలుబలం సంగతి అలా ఉంటే, నిజానికి పాలక ఎన్డీఏ కూటమికి బిహార్‌లో ఆశించినంత సానుకూలత లేదు. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న వేళ ఎన్డీఏ ఓట్లు చీలే ఆస్కారముంది. మరో పార్టీ హిందుస్థాని అవామ్ మోర్చ (హెచ్ఏఎమ్) ఎక్కువ స్థానాలు కోరుతుండటంతో గందరగోళం నెలకొంది. అలాగే 20 ఏళ్లుగా జేడీ (యూ) అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత గుదిబండగా మారనుంది. ప్రభుత్వోద్యోగాల భర్తీ ఆశించిన మేర జరగకపోవడంతో యువత అసంతృప్తిగా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడాన్ని మహాఘట్ బంధన్ సానుకూలంగా మలచుకుంటే ఎన్డీఏకు తిప్పలు తప్పవు. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ ఆశలన్నీ ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పైనే ఉన్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనకు ప్రజాదరణ ఉందని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. నిరుద్యోగం, ఉపాధి కోసం బిహారీ యువత వలసలు, ద్రవ్యోల్బణంతో నిత్యావసర ధరలు పెరగడం, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వంటి అంశాలను యువనేత తేజస్వీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారు. వామపక్ష పార్టీలు కూటమికి అదనపు బలం. మైనారిటీ, ఓబీసీ ఓట్లపై గంపెడాశలు పెట్టుకున్న ఈ కూటమి భవితవ్యం ముస్లిం, యాదవ సామాజిక వర్గాల చేతుల్లోనే ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పాటు వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)ల మధ్య సీట్ల పంపకంలో సయోధ్య పైనే మహాఘట్ బంధన్ విజయావకాశాలు ఆధారపడ్డాయి. 2020 శాసనసభ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ గెలుపు 19 చోట్లకు పరిమితం అవడం వల్లే అధికారానికి దూరమయ్యామనే భావన ఉంది. ఆ ఎన్నికల్లో 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ఈసారి జాగ్రత్త పడుతోంది. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌కు ప్రజాదరణ ఉన్నా, ఆయన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ హయాంలో అవినీతి, శాంతి భద్రతల వైఫల్యంతో ‘జంగల్ రాజ్’గా ముద్రపడటం ఆర్జేడీకి నష్టం చేకూర్చే అంశం. జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహకర్తగా పేరు గడించిన ప్రశాంత్ కిశోర్ బిహార్‌లో రాజకీయ అదృష్టంపై దేశ వ్యాప్త రాజకీయ పండితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జన్ సురాజ్ పార్టీ స్థాపించిన ప్రశాంత్ కిశోర్ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ పార్టీకి పట్టణ ప్రాంతాల్లో, యువతలో ఆదరణ ఉన్నా రాష్ట్ర కుల రాజకీయాలు, పొత్తు జిత్తుల మధ్య ఆయన వ్యూహాలు ఫలించడం అంత తేలిక కాదు. సోషల్ మీడియా వేదికలపై జన్ సురాజ్ బలంగా కనిపిస్తున్నా, సంస్థాగతంగా బలహీనంగా ఉంది. జన్ సురాజ్ గెలుపు కంటే, ఆ పార్టీ చీల్చే ఓట్లు ఎన్డీఏ, మహాఘట్ బంధన్ కూటమి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయడం ఖాయం.‘సర్’ వివాదంఅసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు వ్యూహరచనలు, ప్రణాళికలు రూపొందిస్తుంటే బిహార్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం... బిహార్‌లో 40 లక్షలకుపైగా ఓటర్లపై అనుమానాలున్నాయి. వీటిలో 14 లక్షలకుపైగా మృతుల పేర్లు జాబితాలో ఉన్నాయంటున్నారు. 19 లక్షలకు పైగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. 7 లక్షల మంది ఇతర చోట్ల కూడా ఓటర్లుగా నమోదయ్యారు. 11 లక్షలకు పైగా ఓటర్లకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఓటర్లలో బంగ్లాదేశ్, మయాన్మార్, నేపాల్ దేశస్థులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఏడాది కిందటి లోక్‌సభ ఎన్నికలప్పుడు రాని ఈ అంశాలన్నీ ఇప్పుడే రావడం వివాదాస్పదమవుతోంది. ((నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పార్లమెంట్లో జేడీ(యూ) మద్దతు కీలకమైన నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది.)) ఎన్డీఏ కూటమి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తే ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. తేడావస్తే మాత్రం నితీశ్ వైఖరిలో మార్పు వచ్చినా ఆశ్చర్యం లేదని గత అనుభవాలే చెబుతున్నాయి. ఎన్డీఏకు మెజారిటీ వచ్చినా నితీశ్ విషయంలో బీజేపీ వైఖరి మారితే కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం పడుతుంది. ఈ సమీకరణాల దృష్ట్యా బిహార్ ఎన్నికల రాజకీయ దిక్సూచి ఎటు వైపు మళ్లేనో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.దిలీప్ రెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్ -
నితీష్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు: జేడీయూ
పాట్నా: వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా కీలక వ్యాఖ్యలు చేశారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ నేతృత్వంలోనే జేడీయూ బరిలోకి దిగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం నితిష్ కుమార్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని తన భూజాలపై వేసుకొని నడిపించారని ప్రస్తావించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగనున్నట్లు చెప్పారు. అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు.నితీష్ రాజకీయాల్లో పడిపోతున్నారని అనుకున్న ప్రతీసారి అతను తన అద్భుతమైన పనితనంలో పునరాగమనం చేసి అందరిని ఆశ్యర్యపరుస్తుంటారని తెలిపారు. నితీష్‌పై ప్రజలకు ఇంకా నమ్మకం ఉందని చెప్పేందేకు లోక్‌సభ ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏకంగా 177 స్ధానాల్లో ఎన్డీయేకు స్పష్టమైన ఆధిక్యం లభించిందని గుర్తుచేశారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఇండియా కూటమి నుంచి ఎన్డీయేలోకి మారిన నితిష్ కుమార్ బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లు సాధించి 'కింగ్‌మేకర్'గా అవతరించారు.'బీహార్‌కు ప్రత్యేక హోదాపై సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ, 2004 నుండి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భాగస్వామిగా ఉన్న ప్రతిపక్షం బిహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని ఎప్పుడూ లేవనెత్తలేదు. ప్రత్యేక హోదా గురించి వారు కనీసం ఒక్కసారి కూడా డిమాండ్ చేయలేదు.మేము మాత్రం మొదటినుంచీ ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నాం. ఈ విషయంలో సీఎం నితీష్ కుమార్ నిబద్ధతతో కృషి చేస్తున్నారు. భవిష్యత్‌లో బిహార్‌కు కొద్దిపాటి ఊతం లభించినా తాము కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబడతాం. ప్రత్యేక హోదా విషయంలో అవరోధాలు ఏమైనా ఉంటే ప్రత్యేక ప్యాకేజ్ అయినా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై రాజకీయాలు చేయకూడదు'. ఆయన అన్నారు. -
మోదీవి ఉత్తమాటలే: రాహుల్
బిహార్ ఎన్నికల సభలో ధ్వజం - మహాత్మా గాంధీ పేదల కోసం సూటు, బూటు వదిలేశారు - మోదీ ప్రధానమంత్రి కాగానే రూ. 15 లక్షల సూటు వేసుకున్నారు రామ్‌నగర్ (బిహార్): ప్రధాని నరేంద్రమోదీ ఎంతసేపు మాటలు చెబుతారే తప్పితే చేసి చూపేదేమీ ఉండదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ‘లోక్‌సభ ఎన్నికలకు ముందు... ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని, పంటలకు మద్దతు ధరను 100 శాతం పెంచుతామని, విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కితెచ్చి.. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షల చొప్పున వేస్తామని చెప్పారు. ఇందులో ఒక్కటైనా జరిగిందా? అప్పుడైనా... ఇప్పుడైనా ఆయనవి ఉత్త మాటలే. చేతల్లో చేసేదేమీ ఉండదు’ అని రాహుల్ విమర్శించారు. కేవలం కొంతమంది సూటు-బూటు వేసుకున్న మనుషుల బాగు కోసమే మోదీ పనిచేస్తున్నారన్నారు. ‘సూటు-బూటు బారిస్టర్ అయిన మహాత్మా గాంధీ.. పేదల కోసం వాటిని వదిలివేశారు. కానీ.. తాను టీ విక్రేతనని చెప్పుకునే మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత రూ. 15 లక్షల సూటు తొడుక్కున్నారు’ అని ఎద్దేవా చేశారు. రాహుల్ శనివారం బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని రామ్‌నగర్‌లో బహిరంగసభలో ప్రసంగించారు. మోదీ లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన తరహాలో ఇప్పుడూ ఇస్తున్న బూటకపు హామీలకు మోసపోవద్దని సూచించారు. ‘ఎన్నికల్లో గెలిచిన తర్వాత సూటు, బూటు తొడుక్కునే ఆయన స్నేహితులు ఢిల్లీ, గుజరాత్ల నుంచి కొత్త భూసేకరణ బిల్లు కింద రైతుల భూమి తీసుకోవటానికి బిహార్‌కు వస్తారు.. వారి కోర్కెలను ఎన్డీఏ ప్రభుత్వం తీరుస్తుంది’ అని అన్నారు. ఉపాధి సృష్టి గురించి, పరిశుభ్రత గురించి సూటు, బూటు స్నేహితుల వద్ద గొప్పలు చెప్పుకోకుండా సఫాయి కార్మికుల వద్దకు, నిరుద్యోగ యువత వద్దకు వెళ్లాలన్నారు. ఈ సభలో పాల్గొన్న వారిలో ఎవరూ సూటు, బూటు వేసుకోలేదని చెప్తూ తమ కూటమి పేదల కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నిర్వహించిన ఈ సభకు జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ గైర్హాజరయ్యారు. అంతకుముందు పట్నా విమానాశ్రయంలో రాహుల్‌ను నితీశ్ కలిశారు. ఎయిర్ గన్‌తో వచ్చిన యువకుడు, అరెస్ట్ రాహుల్ సభ వద్దకు ఎయిర్ గన్‌తో వచ్చిన ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి.. అతడి వద్ద నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. రాహుల్ రాకముందే.. ప్రధాన ద్వారం వద్ద ఈ యువకుడిని అదుపులోకి తీసుకున్నామని, అతడిని ఝార్ముహి గ్రామానికి చెందిన తయ్యబ్‌జాన్‌గా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. స్వీయ రక్షణ కోసం ఆ తుపాకీ తెచ్చానని చెప్తున్నాడన్నారు. బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మెల్యే న్యూఢిల్లీ: బిహార్‌లో 2010 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ సతీమణి రబ్రీదేవిని ఓడించిన జేడీయూ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ బీజేపీలో చేరారు. శనివారం ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.