breaking news
Ashram Matriculation School
-
నష్టపరిహారం కోరుతూ ఐశ్వర్య ధనుష్ పిటిషన్
చెన్నై: ఆశ్రమ పాఠశాల వ్యవహారంపై రూ.6 కోట్లు పరువు నష్టం కోరుతూ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ సోమవారం చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే...స్థానిక గిండీ సమీపంలోని రేస్ కోర్స్ రోడ్డులో రజనీకాంత్ ఆశ్రమ పాఠశాలను నడుపుతున్నారు. ఈ పాఠశాల స్థల యజమాని వెంకటేశ్వర్లు అద్దె ఇవ్వలేదని గత 15న పాఠశాలకు తాళం వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఐశ్వర్య హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఆమె దాఖలు చేసిన పిటిషన్లో శ్రీ రాఘవేంద్ర విద్యాసంఘాన్ని 1991లో రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. ఈ సంఘం ద్వారా ఆశ్రమం పేరుతో వేలచ్చేరి, గిండీ, సైదాపేటలో పాఠశాలలు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. వీటిలో గిండీ రెస్కోర్స్ రోడ్డులో పాఠశాలను 2005లో స్థల యజమాని వెంకటేశ్వర్లు వద్ద లీజ్‌కు తీసుకుని పాఠశాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో గత మే వరకూ అద్దె చెల్లించినట్లు తెలిపారు. ఈ స్థితిలో ఈ నెల 15న వెంకటేశ్వర్లు ఆశ్రమంలోకి చొరబడి అద్దె ఇవ్వడం లేదంటూ పాఠశాలను మూసివేశారన్నారు. అద్దె చెల్లించని కారణంగా ఆశ్రమ పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నామని మీడియాకు ప్రచారం చేశారని పేర్కొన్నారు. పాఠశాల లోపలికి హద్దు మీరి ప్రవేశించినందుకు రూ.కోటి, తమ పాఠశాల సంఘం పేరుకు కళంకం కలిగించినందుకు రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని, ఇతరులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలనీ కోరారు.పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి సీవీ.కార్తీకేయన్ మంగళవారం (ఇవాళ) విచారణ జరపనున్నట్లు తెలిపారు. సంబంధిత వార్త...: రజనీకాంత్ కుటుంబానికి ఎదురుదెబ్బ! -
రజనీకాంత్ కుటుంబానికి ఎదురుదెబ్బ!
చెన్నై : దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నైలోని ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూల్ రజనీ సతీమణి లత నేతృత్వంలో నడుస్తున్న విషయం తెలిసిందే. గిండీలోని పాఠశాల భవనానికి పెద్ద మొత్తంలో అద్దె బకాయిలు పడటంతో బుధవారం ఉదయం సీజ్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ స్కూల్లో చదువుతున్న 300మంది విద్యార్థులను వెలచెరిలోని ఐసీఎస్ఈ స్కూల్ (ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూల్ అనుబంధ సంస్థ)కు తరలించారు. కాగా భవనం యజమాని వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రే స్కూల్‌కు తాళం వేసినట్లు తెలుస్తోంది. 2002లో భవనాన్ని అద్దెకు ఇచ్చామని, అయితే సకాలంలో అద్దె చెల్లించకపోవడంతో 2013లోనూ ఖాళీ చేయాలని స్కూల్ మేనేజ్మెంట్ను కోరినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పదికోట్లు చెల్లించాలంటూ బిల్డింగ్ యజమాని కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే అంత మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేమంటూ స్కూల్ యాజమాన్యం తరఫు న్యాయవాది కేవలం రూ.2కోట్లు మాత్రమే చెల్లించినట్లు తెలుస్తుంది. అప్పటి నుంచి మిగతా బకాయిలు చెల్లించెకపోవడమే కాకుండా, లతా రజనీకాంత్ నుంచి కూడా ఎలాంటి సమాధానం రాకపోవడంతో స్కూల్‌కు తాళం వేసినట్లు సమాచారం.