breaking news
APSpecialCategoryStatus
-
'హోదా' కోసం మదీనాలో ప్రత్యేక ప్రార్థనలు
మదీనా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కేటాయించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని సౌదీ అరేబియాలోని ప్రవాసాంధ్రులు మండిపడ్డారు. ఎన్నికల తర్వాత నుంచే 'ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు' అంటూ నినదిస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే అని కొనియాడారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రత్యేకహోదాను ఆంధ్ర రాష్ట్రానికి వెంటనే ప్రకటించాలని కోరుతూ సౌదీ అరేబియాలోని ప్రవాసాంధ్రులు మదీనా మసీదులో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ షేక్ సలీం మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని, ఆయన లక్ష్యం నెరవేరాలని మదీనాలో ప్రార్థనలు చేశామన్నారు. ప్రత్యేకహొదా కోసం ఆనాడు పార్లమెంటులో గొంతు చించుకున్న వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఉండి కూడా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ప్రత్యేకహోదాను ఎందుకు నీరుగారుస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర ప్రజలను మాయ మాటలతో నట్టేట ముంచారన్నారు. సీఎం కుర్చీలో ఉండి భవిష్యత్తు తరాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన చంద్రబాబు కేసులకు భయపడి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు పార్ట్నర్గా ఉండి, ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు దిక్కుతోచని స్థితిలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేద్దామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో నాటకానికి తెరలేపారని పేర్కొన్నారు. ప్రత్యేకహోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని, దీని కోసం అందరం కలిసి పోరాడాలని వైఎస్ఆర్సీపీ ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్యాకేజీ వద్దని, ప్రత్యేక హోదాతోనే ఏపీ సమస్యలకు పరిష్కారం దోరుకుందని, అటూ పార్లమెంట్‌లోనూ, ఇటు అసెంబ్లీలోనూ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. చివరికి ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్న చంద్రబాబు నోటితో హోదా ఇవ్వాల్సిందే అని చెప్పించిన ఘనత వైఎస్ జగన్‌దే అన్నారు. వైఎస్ జగన్ వల్లే ప్రత్యేక హోదా సాధ్యమని సలీం చెప్పారు. ఈ కార్యక్రమంలో షేక్ సలీం, ఇమ్రాన్ జలీల్, షేక్ ఫరీద్, మహమ్మద్ రిజ్వాన్, సాద్ బిన్ సుల్మీ, ఇర్ఫాన్, గఫార్, సయ్యద్ మున్వర్, అల్తాఫ్ హుస్సేన్, ఎండీ సిరాజ్, ఇర్షాన్ తదితరులు పాల్గొన్నారు. -
'హోదా' నిరసనలు ఇలా తెలపండి..
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను సాధించుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తమ నిరసనలు తెలపాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. దీనికి ట్విట్టర్‌ను వేదికగా ఉపయోగించుకోవాలని బుధవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో కేవీపీ పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రత్యేక హోదా పోరాడటాన్ని ఉధృతం చేయాలని తెలిపారు. విభజన హామీలను నెరవేర్చడంలో ప్రధాని నరేంద్రమోదీ అలసత్వంగా వ్యవహరిస్తున్నారని కేవీపీ మండిపడ్డారు. 68వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ట్విట్టర్లో 140 అక్షరాలను ఓ ఆయుధంగా వాడి కేంద్రంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రావల్సిన న్యాయపరమైన హక్కులకు సంబంధించి అంశాలు కేంద్రానికి తెలిసేలా అందరూ ఒకేలా ఈ క్రింది హ్యాష్ ట్యాగ్లు ఇవ్వాలని కోరారు. #WeDemandSpecialCategoryStatusForAP #CompletionOfPolavaramProject #SpecialPackageForBackwardRegions #FundForCapitalCity #DistributionOfAssetsAsPerSchedule9&10 #FulfillingRevenueDeficit #Vizag-ChennailndustrialCorridor #RailwayZoneAtVizag #PortAtDugarajapatnam #SteelPlantAtY.S.RKadapaDist ట్విట్ చేసే వారు పై హ్యాష్ ట్యాగ్‌లతో పాటూ ప్రధాని నరేంద్రమోదీ @narendramodi , పీఎంవో యూనియన్ @PMOIndia, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ @arunjaitley, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు @MVenk aiahNaidu, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు@ncbn కు ట్యాగ్ చేయాలని కోరారు. తెలుగు ప్రజలు 140 అక్షరాల్లో ముగించేలా తమ నిరసన మెసేజ్‌తో పాటూ హ్యాష్ ట్యాగ్‌తో కనీసం ఎవరినైనా ఒకరిని ట్యాగ్ చేయాలని తెలిపారు. రోజుకు కనీసం రెండు నిమిషాలైనా కేటాయించి కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను సాధించే వరకు తమ నిరసనలను ట్విట్టర్ ద్వారా తెలపాలని తెలుగు ప్రజలందరికి కేవీపీ విజ్ఞప్తి చేశారు.