breaking news
Apgredesan bullet
-
పన్నుల శాఖలో డివిజన్లు, సర్కిళ్ల పెంపు ఏదీ?
సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చాక రాష్ట్ర పన్నుల శాఖలో ప్రతిదీ ఓ ప్రహసనంగానే మారిపోతోంది. ఉద్యోగులకు పని విభజన నుంచి డీలర్ల పన్ను మదింపు, ఆడిటింగ్ వరకు అన్ని అంశాల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందన్న అభిప్రాయం శాఖ సిబ్బందిలోనే వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉద్యోగుల పదోన్నతులు, పోస్టింగులు, అప్గ్రెడేషన్ లాంటి ఫైళ్లు నత్తనడకన నడుస్తుండగా.. కీలకమైన శాఖ విస్తరణ ప్రక్రియ అంతకన్నా నెమ్మదిగా కొనసాగుతూ ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగుల్చుతోంది. పెంపు ప్రతిపాదనలకు మోక్షమెప్పుడు? వాస్తవానికి పన్నుల శాఖలో డివిజన్లు, సర్కిళ్ల పెంపు ప్రతిపాదన రెండేళ్ల నుంచే ఉంది. డీలర్లు పెరుగుతున్నా డివిజన్లు, సర్కిళ్లు పెరగడం లేదని.. క్షేత్రస్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు డీలర్లపై పర్యవేక్షణ ఇబ్బంది అవుతోందని, శాఖను సంస్థాగతంగా విస్తృతం చేసుకోవాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 91 సర్కిళ్లు, 12 డివిజన్ల ద్వారా పన్నుల శాఖ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. డివిజన్ల సంఖ్యను 20కి, సర్కిళ్ల సంఖ్యను 175కు పెంచాలని ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయి. కానీ ఉన్నతాధికారులు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) నేపథ్యంలో ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడు నెలలు దాటుతున్నా.. డివిజన్లు, సర్కిళ్ల ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదు. మరోవైపు 33 వేల మంది డీలర్ల బాధ్యతలను నిర్వహిస్తున్న సెంట్రల్ ఎక్సైజ్ శాఖ మాత్రం జీఎస్టీకి అనుగుణంగా తమ వార్డులను 253కి పెంచుకుంది. కానీ ఏకంగా 1.5 లక్షల మంది డీలర్లకు సంబంధించి బాధ్యతలున్న పన్నుల శాఖలో మాత్రం చర్యలు లేకపోవడం గమనార్హం. అప్గ్రెడేషన్ చాలు! పన్నుల శాఖ పరిధిలో ఒక సర్కిల్లో 6 వేల మంది డీలర్లుంటే.. మరో సర్కిల్లో నాలుగైదు వందల మంది కూడా లేని పరిస్థితి ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. దీంతో శాఖను పునర్వ్యవస్థీకరించాలని కోరుతున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణకు కొత్త పోస్టులు కూడా అవసరం లేదని, అదనపు భారం లేకుండానే... కేవలం పోస్టుల అప్గ్రెడేషన్ సరిపోతుందని అంటున్నారు. అయితే పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. అయితే ఇటీవల జాయింట్ కమిషనర్ స్థాయిలో కొత్త ప్రతిపాదన రూపుదిద్దుకుందని.. శంషాబాద్, అబిడ్స్, మాదాపూర్ల పేరుతో మూడు కొత్త డివిజన్లను ఏర్పాటు చేస్తూ, 15–18 సర్కిళ్ల పెంపుతో సరిపెట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్టు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. కనీసం ఇదైనా అమలుకు నోచుకుంటుందో, లేదోనని పన్నుల శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. -
ఎదురుచూపులు
రెండేళ్లుగా ఒక్క పక్కా గృహానికీ అనుమతి లేదు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు 1,09,525 64,789 మంది అర్హులుగా గుర్తింపు ఎన్టీఆర్ అప్గ్రేడేషన్ పథకానికి గ్రహణం మచిలీపట్నం : తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి రెండేళ్లు గడిచాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పక్కా గృహాలు నిర్మిస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మాటలు నమ్మిన పేదలు ఉన్న ఇంటిని కూల్చి పక్కా గృహ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాలో ఇంత వరకు ఒక్క ఇంటికీ అనుమతి ఇవ్వలేదు. జిల్లాలో 15,500 గృహాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా పరిపాలనా పరమైన ఆమోదం ఇవ్వలేదని గృహనిర్మాణశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికి ఆమోదం తెలుపుతుందో తెలియని పరిస్థితి ఉంది. పక్కా గృహాల నిర్మాణానికి ఆమోదం తెలపకుండానే లబ్ధిదారుల ఎంపికలో సవాలక్ష ఆంక్షలను ప్రభుత్వం విధిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 14న అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదలకు సొంతింటి కలను నెరవేరుస్తామని ప్రకటించారు. టీడీపీ అధికారం చేపట్టిన తరువాత జన్మభూమి - మాఊరు కార్యక్రమాలతో పాటు మీ-కోసంలో పక్కాగృహాల నిర్మాణం కోసం 1,09,525 మంది దరఖాస్తు చేశారు. వీటిని తనిఖీ చేసి 64,789 మందిని అర్హులుగా తేల్చారు. మిగిలిన 44,736 మందిని అనర్హులుగా గుర్తించారు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం పేరును ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకంగా మార్పు చేశారు. జిల్లాలోని 12 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 1250 చొప్పున 15వేలు, మచిలీపట్నం రూరల్ మండలానికి 500, మొత్తంగా 15,500 ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. వీటికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. వీటిలో ఐఏవై ద్వారా 4,964, ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం ద్వారా 10,536 గృహాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో ఎస్సీలకు 3,590, ఎస్టీలకు 1,406, ఇతరులకు 10,504 గృహాలను కేటాయిస్తున్నట్లు పేర్కొంది. పక్కాగృహాల నిర్మాణంలో లబ్ధిదారులను ఎంపిక చేయటంలో జన్మభూమి కమిటీ సభ్యులు కీలకపాత్ర పోషించటం విమర్శలపాలవుతోంది. స్పష్టత కరువు రాష్ట్ర ప్రభుత్వం గృహనిర్మాణ వ్యయాన్ని రూ.2.90 లక్షలకు పెంచింది. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా రూ.1.20 లక్షలు, గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా సబ్సిడీగా రూ.60వేలు, బ్యాంకు రుణంగా రూ.1.10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో రూ.2.75 లక్షలుగా ఉన్న ఈ మొత్తాన్ని రూ.2.90 లక్షలకు పెంచింది. బ్యాంకు ద్వారా ఇచ్చే రుణం ఎప్పటికి మంజూరవుతుంది. ఏ నిబంధనల మేరకు మంజూరు చేస్తారనే అంశంపై స్పష్టత లేదు. ఎన్టీఆర్ అప్గ్రేడేషన్ అంతంతే జిల్లాలో 1994 నుంచి 2004 వరకు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన గృహాలకు మరమ్మతులు చేసేందుకు ఎన్టీఆర్ అప్గ్రేడేషన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. జిల్లాకు 9వేల గృహాలకు మరమ్మతులు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. ఇందులో ఎస్సీలు 1539, ఎస్టీలు 480, ఇతరులు 6,981 మందికి అవకాశం కల్పించారు. ఇంటికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. జన్మభూమి కమిటీ సభ్యులు అర్హులను గుర్తించి జాబితాలను తయారు చేయాల్సి ఉంది. ఇప్పటికి 5వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించాలని గృహనిర్మాణ సంస్థ అధికారులు చెబుతున్నారు.