breaking news
Amrita Sher-Gil
-
ఆ కుంచె గొంతులోమళ్లీ అమృతం
ఆమె మరణించి 85 ఏళ్లు అవుతున్నా భారతీయ కళారంగం తలుచుకుని అబ్బురపడుతూనే ఉంది. 28 ఏళ్లకే ఆమె చేతి కుంచెను మృత్యువు లాక్కున్నా ఆమె గీసిన చిత్రాన్ని 62 కోట్లు పెట్టి మరీ కొనుక్కుంటూనే ఉంది. అమృతా షేర్గిల్. భారతీయ అద్భుత చిత్రకారిణి. ఆమె బయోపిక్ త్వరలో రాబోతూ ఉంది. దర్శకురాలు మీరా నాయర్ దీని రూపకర్త. ఒక స్త్రీ మరో స్త్రీ జీవితాన్ని కెమెరా కేన్వాస్పై దించనుంది. వివరాలు....ఈ సినిమా కచ్చితంగా మీరా నాయర్ ఇంతకుముందు సినిమాల కంటే భిన్నమైనది. ఆమె ఇప్పటి వరకూ బయోపిక్స్ తీయలేదు. తీయాలనుకున్నది సామాన్యమైన వ్యక్తి గురించీ కాదు. ‘నేను సినిమాలు తీశానంటే అమృతా షేర్గిల్ గీసిన బొమ్మల ప్రభావం వల్లే. అందుకే ఆమె బయోపిక్ తీయడానికి ధైర్యం చేశా’ అంటారు మీరా నాయర్. అమృతా షేర్గిల్ పేరు భారతీయ చిత్రకళలో మరణం లేనిది. అమె గురించి తెలియడం, తెలియకపోవడం రెండూ కళాభిమానులను బాధించే విషయాలు. తెలిస్తే ‘అరె చిన్న వయసులో మరణించిందా’ అని బాధ. తెలియకపోతే ఇంత గొప్ప మనిషి తెలియకుండా పోయిందా... అనే బాధ. మన దేశంలో స్త్రీలు వంటిల్లు దాటడానికి కూడా భయపడిపోయే రోజుల్లో అమృతా షేర్గిల్ ΄్యారిస్కు వెళ్లి మరీ చిత్రకళ అభ్యసించింది. అక్కడి మహా చిత్రకారులతో భుజాలు రాసుకు తిరిగింది. తిరిగి భారతదేశానికి వచ్చి యూరోపియన్ వాసనలు లేకుండా తన కుంచె మెరుగుదనంతో భారతీయ సౌందర్యాన్ని చూపింది. అందుకే ఆమె కథ విశిష్టమైనది... ఆమె బొమ్మల్లానే. మీరా నాయర్ ఈ పాత్రకు తగిన నటి కోసం, రాయాల్సిన స్క్రిప్ట్ కోసం చాలా పరిశ్రమించింది. అమృత పాత్రకు త్రిప్తి డిమ్రి, తాన్య మణిక్తలా పేర్లు పరిశీలనకు వచ్చినా ‘బ్యాడ్ గర్ల్’ ఫేమ్ అంజలి శివరామన్ లోని భావగాఢత నచ్చి ఆమెను ఎంచుకుంది.దిగ్గజ బృందంతాను ఎవరి గురించి బయోపిక్ తీస్తున్నదో మీరాకు బాగా తెలుసు. భారతీయ ఆధునిక కళకు అమ్మగా, ‘పయొనీర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఆర్ట్’గా పిలువబడే షేర్గిల్ను తెర మీద సాక్షాత్కరించడం... సవాల్. తీశాక అభిమానులు, విమర్శకులు వేయికళ్లతో పరిశీలిస్తారు, పరీక్షిస్తారు. వారి అభిమానం కంటే తన అభిమానమే గొప్పదని నిరూపించుకోవడానికి పరీక్షకు సిద్ధమైంది మీరా నాయర్. అమృతా షేర్గిల్ను అందరూ ‘అమ్రి’ అని ముద్దుగా పిలుస్తారు. మీరా కూడా అలానే పిలుచుకుంటుంది. అదే టైటిల్ ‘అమ్రి’.స్క్రిప్ట్ పనిలో ఫ్రెంచ్ స్క్రీన్ రైటర్ క్లారా రాయర్ సహాయం తీసుకుంది. ప్రియాంక చోప్రాను ముఖ్యపాత్ర వేయమని కోరడమే కాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉండేలా మెప్పించింది. ఎమిలీ వాట్సన్ , జైదీప్ అహ్లావత్, జిమ్ సర్భ్, అంజనా వాసన్ మంచి ఆర్టిస్టులను ఇతర పాత్రలకు తీసుకుంది. ఇండియా, హంగేరీలలో షూటింగ్ చేసింది.మృత్యువు గీసిన చివరి గీతఅమృతా షేర్గిల్ అనూహ్య ధోరణిలో ఎదిగింది. పురుష చిత్రకారులు దేవతల్ని గీస్తున్న రోజుల్లో అమృత గ్రామీణ స్త్రీల వేదనను గీసింది. పెళ్లి, ప్రేమ, సెక్స్– దేన్నీ దాచుకోలేదు. అందువల్ల స్కాండల్స్ వెంటాడినా పట్టించుకోలేదు. అందుకే ఆమెను ఎరిగినవాళ్లు ‘50 ఏళ్లు ముందు పుట్టింది’ అంటారు.‘ఆమె జీవితం ఒక సినిమా కన్నా నాటకీయం. ప్రతి ఫ్రేమ్‌లో పోరాటమే’ అని ఆమె జీవిత చరిత్రకారిణి యశోధర దాల్మియా వ్యాఖ్యానిస్తారు. ఇంత గొప్ప భవిష్యత్తు ఉన్న అమృత డిసెంబర్ 5, 1941న లాహోర్‌లో మరణించడం పెద్ద షాక్. అప్పటికి వయసు కేవలం 28. మరణానికి కారణం డాక్టర్లు ‘పెరిటోనైటిస్’ అన్నారు... అంటే ΄÷ట్టలో ఇన్ఫెక్షన్. చరిత్రకారులేమో ‘ఫెయిల్డ్ అబార్షన్’ అన్నారు. తల్లి మాత్రం ‘నా కూతుర్ని మొగుడే చంపేశాడు’ అని ఏడ్చింది. ఏది నిజమో ఎవరికీ తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే– భారతీయ ఆధునిక కళ ఉచ్ఛస్థితికి చేరుకుంటున్న సమయంలో, ఆ కళకు అమ్మ లాంటి అమృత చేతిలోంచి కుంచె జారిపోయింది.బయో పోయెమ్‘సలామ్ బాంబే’,‘మాన్ సూన్ వెడ్డింగ్’, ‘ది నేమ్‌సేక్’ తీసిన మీరాకు ‘అమ్రి’ పర్సనల్ ఫిల్మ్. ప్రొడ్యూసర్ మైఖేల్ నోజిక్ మాటల్లో చె΄్పాలంటే ‘మీరా నాయర్ దర్శకత్వంతో అంజలి పెర్ఫార్మెన్ ్స అద్భుతంగా ఉండబోతోంది’. అమృతగా అంజలి ఫస్ట్లుక్కే ప్రశంసలు వస్తున్నాయి. అమృతలోని క్రాస్ కల్చరల్ ఐడెంటిటీ, కళాత్మకత, ధిక్కారం ఇవన్నీ మీరా నాయర్ కెమెరాలో ఒదిగితే ‘అమ్రి’ ఒక విజువల్ పోయెమ్ అవుతుంది. 85 ఏళ్ల తర్వాత అమృత మళ్లీ బతుకుతుంది. అమృతా షేర్గిల్ ఎవరు?మీరా నాయర్‌నే కాదు ప్రపంచ కళాభిమానులను ఆకర్షించే అమృతా షేర్‌గిల్‌ది భిన్నమైన జీవితం. హంగేరీ తల్లి, పంజాబీ సిక్కు తండ్రికి 1913లోబుడాపెస్ట్లో జన్మించింది. పారిస్‌లోని ఆర్ట్ స్కూల్ ‘అకాడెమీ దె బోజార్’లో అతి చిన్న వయసులో చదువుకుంది. యూరోపియన్ టెక్నిక్‌తో భారతీయ గ్రామీణ స్త్రీల వేదన, ఒంటరితనం, దైనందిన జీవితాన్ని కాన్వాస్ పైకి తెచ్చింది.‘త్రీ గరల్స్’, ‘బ్రైడ్స్ టాయిలెట్’, ‘విలేజ్ సీన్’... ఈ మూడు చిత్రాలతో భారతీయ కళలో మోడర్నిజానికి తొలి అడుగులు వేసింది. అందుకే ఆమెను ఆమె 1937లో గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ పెయింటింగ్ 2023లో 61.8 కోట్లకు అమ్ముడుపోయిందంటే ఇక ఆలోచించండి ఆమె కళావైశిష్ట్యం.– కె. -
కదిలించిన కుంచె!
ఈ దేశ నేలపై అడుగు పెడితే చాలు... సృజనాత్మక తరంగాలు మనసులో ఎగసిపడతాయి. అవి నా కుంచెకు ప్రాణం పోస్తాయి - అమృతా షేర్ గిల్ నిండా మూడుపదులు బతకనే లేదు. బతికిన ఆ కొద్ది బతుకులోనే రంగుల సుడిగుండాలు సృష్టించింది. కేన్వాస్ మీద తన కుంచెల విన్యాసంతో తూర్పు పడమరలను ఏకం చేసేసింది. తాను బతికిన, తాను చూసిన బతుకులను బొమ్మకట్టింది. ఔను! ఆమె వేసినవన్నీ బతుకుబొమ్మలే! అవన్నీ తన కాలానికి ఆనవాళ్లు. చిత్రకళారంగంలోని తరతరాల పురుషాధిక్యతను అధిగమించి మరీ చాటుకున్న తన ఉనికికి తిరుగులేని నిదర్శనాలు. భారతీయ ఆధునిక చిత్రకళారంగంలో ఆమెది చిరస్మరణీయమైన పేరు అమృతా షేర్గిల్. అమృత తండ్రి ఉమ్రావ్‌సింగ్ షేర్గిల్ మజీతియా పంజాబ్‌కు చెందిన సిక్కు రాచ కుటుంబీకుడు. తల్లి మేరీ ఆంటోనియెట్ గాటెస్మాన్ యూదు మహిళ. వాళ్లు హంగెరీ రాజధాని బుడాపెస్ట్‌లో ఉండగా, 1913 జనవరి 30న అమృత పుట్టింది. ఆమె బాల్యంలోని తొలిదశ అక్కడే గడిచింది. కొంతకాలానికి చెల్లెలు ఇందిర పుట్టిన తర్వాత షేర్గిల్ కుటుంబం 1921లో భారత్‌కు తిరిగి వచ్చి, సిమ్లాలో స్థిరపడింది. అక్కాచెల్లెళ్లిద్దరూ పియానో, వయోలిన్ నేర్చుకునేవారు. సిమ్లాలో కచేరీలు కూడా చేసేవారు. ఎనిమిదేళ్ల బాల్యంలోనే అమృత రంగులపై మక్కువ పెంచుకుంది. తీరిక దొరికినప్పుడల్లా కుంచెకు పనిచెప్పేది. సిమ్లాలో ఉండే ఒక ఇటాలియన్ శిల్పి మేరీకి పరిచయం కావడంతో, కూతురి ఆసక్తిని అతడికి చెప్పింది. అయితే, ఏడాది గడవకుండానే అతడు ఇటలీకి తిరిగి వెళ్లిపోవడంతో మేరీ కూతురు అమృతను తీసుకుని ఇటలీ వెళ్లింది. ఫ్లారెన్స్లోని ఆర్ట్ స్కూల్లో చేర్పించింది. అక్కడ చదువు ముగిశాక తల్లితో కలసి ప్యారిస్ వెళ్లింది. అనతికాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ ఆమె గీసిన ‘యంగ్‌గర్ల్స్’ పెయింటింగ్‌కు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆ పెయింటింగ్ తెచ్చిన గుర్తింపుతో ప్యారిస్‌లోని ‘గ్రాండ్ సెలూన్’కు అసోసియేట్‌గా ఎన్నికైంది. పాశ్చాత్య ప్రపంచంలో వచ్చిన గుర్తింపు అమృతకు సంతృప్తినివ్వలేదు. అక్కడి తళుకుబెళుకులేవీ ఆమెను ఆకర్షించలేదు. తన దేశంలోని బతుకులను తన బొమ్మల్లో చూపగలిగినప్పుడే తన కళకు సార్థకత అనుకుంది. అందుకే, 1934లో భారత్‌కు తిరిగి వచ్చేసింది. దేశమంతా విస్తృతంగా పర్యటించి, ప్రాచీన భారతీయ చిత్రకళా రీతులను నిశితంగా అధ్యయనం చేసింది. మొఘల్, పహాడీ చిత్రకళా రీతులు ఆమెను అమితంగా ఆకట్టుకున్నాయి. భారత్‌కు తిరిగి వచ్చాక అమృత గీసిన చిత్రాలపై వాటి ప్రభావం కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో పర్యటించిన సమయంలో ఆమె మూడు అపురూపమైన చిత్రాలు గీసింది. తన కాలంలోని మహిళల స్థితిగతులు, గ్రామీణ జీవితం ప్రతిబింబించే ఆమె చిత్రాల్లో మహిళల బొమ్మలన్నీ దిగులుగా, భారమైన బతుకులు వెళ్లదీస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఆమె ఎంపిక చేసుకున్న రంగులు సైతం మహిళల మానసిక స్థితికి అద్దం పడతాయి. అమృత కుటుంబానికి బ్రిటిష్‌వారితో సన్నిహిత సంబంధాలుండేవి. ఆమె మాత్రం స్వాతంత్య్ర పోరాటం సాగిస్తున్న కాంగ్రెస్‌కు సానుభూతి పరురాలిగా ఉండేది. సంపన్న వాతావరణంలో పుట్టి పెరిగినా, తన చిత్రాల్లో నిరుపేదల జీవితాలను ప్రతిబింబించేందుకే ఇష్టపడేది. గ్రామీణ పునర్నిర్మాణ ప్రచారం కోసం కాంగ్రెస్ ఆమె చిత్రాలను వాడుకోవడం విశేషం. తగినన్ని మేలిమి చిత్రాలు రూపొందించుకున్న తర్వాత, 1941లో అమృత లాహోర్‌లో తొలిసారిగా సోలో ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఆ ప్రదర్శన తర్వాత ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై, కోమాలోకి జారుకుంది. కోమాలోనే 1941 డిసెంబర్ 6న అర్ధరాత్రి వేళ తుదిశ్వాస విడిచింది. ఆమె చిత్రాలు మాత్రమే భావి తరాలకు మిగిలాయి. తర్వాతి కాలంలో చిత్రకళా రంగంలోకి అడుగుడిన పలువురికి స్ఫూర్తిదాయకంగా మారాయి. మేటి చిత్రకారుడు సయ్యద్ హైదర్ రజా మొదలుకొని అర్పితా సింగ్ వరకు చాలామంది చిత్రకారులు అమృతా స్ఫూర్తితోనే తమ కళకు మెరుగులు దిద్దుకున్నారు. ఆధునిక భారతీయ చిత్రకళా రంగంలో అమృతా షేర్‌గిల్‌ది ఒక చెరగని ముద్ర. తన కాలంలోని మహిళల స్థితిగతులు, గ్రామీణ జీవితం ప్రతిబింబించే ఆమె చిత్రాల్లో మహిళల బొమ్మలన్నీ దిగులుగా, భారమైన బతుకులు వెళ్లదీస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఆమె ఎంపిక చేసుకున్న రంగులు సైతం మహిళల మానసిక స్థితికి అద్దం పడతాయి. - పన్యాల జగన్నాథ దాస్


