కదిలించిన కుంచె! | Amrita Sher-Gil life story | Sakshi
Sakshi News home page

కదిలించిన కుంచె!

Mar 6 2016 1:17 AM | Updated on Sep 3 2017 7:04 PM

కదిలించిన కుంచె!

కదిలించిన కుంచె!

ఈ దేశ నేలపై అడుగు పెడితే చాలు... సృజనాత్మక తరంగాలు మనసులో ఎగసిపడతాయి. అవి నా కుంచెకు ప్రాణం పోస్తాయి

ఈ దేశ నేలపై అడుగు పెడితే చాలు... సృజనాత్మక తరంగాలు మనసులో ఎగసిపడతాయి. అవి నా కుంచెకు ప్రాణం పోస్తాయి
 - అమృతా షేర్ గిల్
 
 నిండా మూడుపదులు బతకనే లేదు. బతికిన ఆ కొద్ది బతుకులోనే రంగుల సుడిగుండాలు సృష్టించింది. కేన్వాస్ మీద తన కుంచెల విన్యాసంతో తూర్పు పడమరలను ఏకం చేసేసింది. తాను బతికిన, తాను చూసిన బతుకులను బొమ్మకట్టింది. ఔను! ఆమె వేసినవన్నీ బతుకుబొమ్మలే! అవన్నీ తన కాలానికి ఆనవాళ్లు. చిత్రకళారంగంలోని తరతరాల పురుషాధిక్యతను అధిగమించి మరీ చాటుకున్న తన ఉనికికి తిరుగులేని నిదర్శనాలు. భారతీయ ఆధునిక చిత్రకళారంగంలో ఆమెది చిరస్మరణీయమైన పేరు అమృతా షేర్‌గిల్.
 
 అమృత తండ్రి ఉమ్రావ్‌సింగ్ షేర్‌గిల్ మజీతియా పంజాబ్‌కు చెందిన సిక్కు రాచ కుటుంబీకుడు. తల్లి మేరీ ఆంటోనియెట్ గాటెస్‌మాన్ యూదు మహిళ. వాళ్లు హంగెరీ రాజధాని బుడాపెస్ట్‌లో ఉండగా, 1913 జనవరి 30న అమృత పుట్టింది. ఆమె బాల్యంలోని తొలిదశ అక్కడే గడిచింది. కొంతకాలానికి చెల్లెలు ఇందిర పుట్టిన తర్వాత షేర్‌గిల్ కుటుంబం 1921లో భారత్‌కు తిరిగి వచ్చి, సిమ్లాలో స్థిరపడింది. అక్కాచెల్లెళ్లిద్దరూ పియానో, వయోలిన్ నేర్చుకునేవారు.  సిమ్లాలో కచేరీలు కూడా చేసేవారు.
 
 ఎనిమిదేళ్ల బాల్యంలోనే అమృత రంగులపై మక్కువ పెంచుకుంది. తీరిక దొరికినప్పుడల్లా కుంచెకు పనిచెప్పేది. సిమ్లాలో ఉండే ఒక ఇటాలియన్ శిల్పి మేరీకి పరిచయం కావడంతో, కూతురి ఆసక్తిని అతడికి చెప్పింది. అయితే, ఏడాది గడవకుండానే అతడు ఇటలీకి తిరిగి వెళ్లిపోవడంతో మేరీ కూతురు అమృతను తీసుకుని ఇటలీ వెళ్లింది. ఫ్లారెన్స్‌లోని ఆర్ట్ స్కూల్‌లో చేర్పించింది. అక్కడ చదువు ముగిశాక తల్లితో కలసి ప్యారిస్ వెళ్లింది. అనతికాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ ఆమె గీసిన ‘యంగ్‌గర్ల్స్’ పెయింటింగ్‌కు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆ పెయింటింగ్ తెచ్చిన గుర్తింపుతో ప్యారిస్‌లోని ‘గ్రాండ్ సెలూన్’కు అసోసియేట్‌గా ఎన్నికైంది.
 
 పాశ్చాత్య ప్రపంచంలో వచ్చిన గుర్తింపు అమృతకు సంతృప్తినివ్వలేదు. అక్కడి తళుకుబెళుకులేవీ ఆమెను ఆకర్షించలేదు. తన దేశంలోని బతుకులను తన బొమ్మల్లో చూపగలిగినప్పుడే తన కళకు సార్థకత అనుకుంది. అందుకే, 1934లో భారత్‌కు తిరిగి వచ్చేసింది. దేశమంతా విస్తృతంగా పర్యటించి, ప్రాచీన భారతీయ చిత్రకళా రీతులను నిశితంగా అధ్యయనం చేసింది. మొఘల్, పహాడీ చిత్రకళా రీతులు ఆమెను అమితంగా ఆకట్టుకున్నాయి. భారత్‌కు తిరిగి వచ్చాక అమృత గీసిన చిత్రాలపై వాటి ప్రభావం కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో పర్యటించిన సమయంలో ఆమె మూడు అపురూపమైన చిత్రాలు గీసింది.
 
 తన కాలంలోని మహిళల స్థితిగతులు, గ్రామీణ జీవితం ప్రతిబింబించే ఆమె చిత్రాల్లో మహిళల బొమ్మలన్నీ దిగులుగా, భారమైన బతుకులు వెళ్లదీస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఆమె ఎంపిక చేసుకున్న రంగులు సైతం మహిళల మానసిక స్థితికి అద్దం పడతాయి. అమృత కుటుంబానికి బ్రిటిష్‌వారితో సన్నిహిత సంబంధాలుండేవి. ఆమె మాత్రం స్వాతంత్య్ర పోరాటం సాగిస్తున్న కాంగ్రెస్‌కు సానుభూతి పరురాలిగా ఉండేది. సంపన్న వాతావరణంలో పుట్టి పెరిగినా, తన చిత్రాల్లో నిరుపేదల జీవితాలను ప్రతిబింబించేందుకే ఇష్టపడేది. గ్రామీణ పునర్నిర్మాణ ప్రచారం కోసం కాంగ్రెస్ ఆమె చిత్రాలను వాడుకోవడం విశేషం.
 
 తగినన్ని మేలిమి చిత్రాలు రూపొందించుకున్న తర్వాత, 1941లో అమృత లాహోర్‌లో తొలిసారిగా సోలో ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఆ ప్రదర్శన తర్వాత ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై, కోమాలోకి జారుకుంది. కోమాలోనే 1941 డిసెంబర్ 6న అర్ధరాత్రి వేళ తుదిశ్వాస విడిచింది. ఆమె చిత్రాలు మాత్రమే భావి తరాలకు మిగిలాయి. తర్వాతి కాలంలో చిత్రకళా రంగంలోకి అడుగుడిన పలువురికి స్ఫూర్తిదాయకంగా మారాయి. మేటి చిత్రకారుడు సయ్యద్ హైదర్ రజా మొదలుకొని అర్పితా సింగ్ వరకు చాలామంది చిత్రకారులు అమృతా స్ఫూర్తితోనే తమ కళకు మెరుగులు దిద్దుకున్నారు. ఆధునిక భారతీయ చిత్రకళా రంగంలో అమృతా షేర్‌గిల్‌ది ఒక చెరగని ముద్ర.
 
 తన కాలంలోని మహిళల స్థితిగతులు, గ్రామీణ జీవితం ప్రతిబింబించే ఆమె చిత్రాల్లో మహిళల బొమ్మలన్నీ దిగులుగా, భారమైన బతుకులు వెళ్లదీస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఆమె ఎంపిక చేసుకున్న రంగులు సైతం మహిళల మానసిక స్థితికి అద్దం పడతాయి.
 
 - పన్యాల జగన్నాథ దాస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement