ఆ కుంచె గొంతులోమళ్లీ అమృతం | Director Mira Nair announces painter Amrita Sher-Gil biopic Amri | Sakshi
Sakshi News home page

ఆ కుంచె గొంతులోమళ్లీ అమృతం

May 14 2026 5:39 AM | Updated on May 14 2026 5:39 AM

Director Mira Nair announces painter Amrita Sher-Gil biopic Amri

బయోపిక్‌

ఆమె మరణించి 85 ఏళ్లు అవుతున్నా భారతీయ కళారంగం తలుచుకుని అబ్బురపడుతూనే ఉంది. 28 ఏళ్లకే ఆమె చేతి కుంచెను మృత్యువు లాక్కున్నా ఆమె గీసిన చిత్రాన్ని 62 కోట్లు పెట్టి మరీ కొనుక్కుంటూనే ఉంది. అమృతా షేర్‌గిల్‌. భారతీయ అద్భుత చిత్రకారిణి. ఆమె బయోపిక్‌ త్వరలో రాబోతూ ఉంది. దర్శకురాలు మీరా నాయర్‌ దీని రూపకర్త. ఒక స్త్రీ మరో స్త్రీ జీవితాన్ని కెమెరా కేన్వాస్‌పై దించనుంది.  వివరాలు....

ఈ సినిమా కచ్చితంగా మీరా నాయర్‌ ఇంతకుముందు సినిమాల కంటే భిన్నమైనది. ఆమె ఇప్పటి వరకూ బయోపిక్స్‌ తీయలేదు. తీయాలనుకున్నది సామాన్యమైన వ్యక్తి గురించీ కాదు. ‘నేను సినిమాలు తీశానంటే అమృతా షేర్‌గిల్‌ గీసిన బొమ్మల ప్రభావం వల్లే. అందుకే ఆమె బయోపిక్‌ తీయడానికి ధైర్యం చేశా’ అంటారు మీరా నాయర్‌. 

అమృతా షేర్‌గిల్‌ పేరు భారతీయ చిత్రకళలో మరణం లేనిది. అమె గురించి తెలియడం, తెలియకపోవడం రెండూ కళాభిమానులను బాధించే విషయాలు. తెలిస్తే ‘అరె చిన్న వయసులో మరణించిందా’ అని బాధ. తెలియకపోతే ఇంత గొప్ప మనిషి తెలియకుండా పోయిందా... అనే బాధ. మన దేశంలో స్త్రీలు వంటిల్లు దాటడానికి కూడా భయపడిపోయే రోజుల్లో అమృతా షేర్‌గిల్‌ ΄్యారిస్‌కు వెళ్లి మరీ చిత్రకళ అభ్యసించింది. 

అక్కడి మహా చిత్రకారులతో భుజాలు రాసుకు తిరిగింది. తిరిగి భారతదేశానికి వచ్చి యూరోపియన్‌ వాసనలు లేకుండా తన కుంచె మెరుగుదనంతో భారతీయ సౌందర్యాన్ని చూపింది. అందుకే ఆమె కథ విశిష్టమైనది... ఆమె బొమ్మల్లానే. మీరా నాయర్‌ ఈ పాత్రకు తగిన నటి కోసం, రాయాల్సిన స్క్రిప్ట్‌ కోసం చాలా పరిశ్రమించింది. అమృత పాత్రకు త్రిప్తి డిమ్రి, తాన్య మణిక్తలా పేర్లు పరిశీలనకు వచ్చినా ‘బ్యాడ్‌ గర్ల్‌’ ఫేమ్‌ అంజలి శివరామన్ లోని భావగాఢత నచ్చి ఆమెను ఎంచుకుంది.

దిగ్గజ బృందం
తాను ఎవరి గురించి బయోపిక్‌ తీస్తున్నదో మీరాకు బాగా తెలుసు. భారతీయ ఆధునిక కళకు అమ్మగా, ‘పయొనీర్‌ ఆఫ్‌ మోడర్న్‌ ఇండియన్  ఆర్ట్‌’గా పిలువబడే షేర్‌గిల్‌ను తెర మీద సాక్షాత్కరించడం... సవాల్‌. తీశాక అభిమానులు, విమర్శకులు వేయికళ్లతో పరిశీలిస్తారు, పరీక్షిస్తారు. వారి అభిమానం కంటే తన అభిమానమే గొప్పదని నిరూపించుకోవడానికి పరీక్షకు సిద్ధమైంది మీరా నాయర్‌. అమృతా షేర్‌గిల్‌ను అందరూ ‘అమ్రి’ అని ముద్దుగా పిలుస్తారు. మీరా కూడా అలానే పిలుచుకుంటుంది. అదే టైటిల్‌ ‘అమ్రి’.

స్క్రిప్ట్‌ పనిలో ఫ్రెంచ్‌ స్క్రీన్ రైటర్‌ క్లారా రాయర్‌ సహాయం తీసుకుంది. ప్రియాంక చోప్రాను ముఖ్యపాత్ర వేయమని కోరడమే కాకుండా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా ఉండేలా మెప్పించింది. ఎమిలీ వాట్సన్ , జైదీప్‌ అహ్లావత్, జిమ్‌ సర్భ్, అంజనా వాసన్‌ మంచి ఆర్టిస్టులను ఇతర పాత్రలకు తీసుకుంది. ఇండియా, హంగేరీలలో షూటింగ్‌ చేసింది.

మృత్యువు గీసిన చివరి గీత
అమృతా షేర్‌గిల్‌ అనూహ్య ధోరణిలో ఎదిగింది. పురుష చిత్రకారులు దేవతల్ని గీస్తున్న రోజుల్లో అమృత గ్రామీణ స్త్రీల వేదనను గీసింది. పెళ్లి, ప్రేమ, సెక్స్‌– దేన్నీ దాచుకోలేదు. అందువల్ల స్కాండల్స్‌ వెంటాడినా పట్టించుకోలేదు. అందుకే ఆమెను ఎరిగినవాళ్లు ‘50 ఏళ్లు ముందు పుట్టింది’ అంటారు.‘ఆమె జీవితం ఒక సినిమా కన్నా నాటకీయం. ప్రతి ఫ్రేమ్‌లో పోరాటమే’ అని ఆమె జీవిత చరిత్రకారిణి యశోధర దాల్మియా వ్యాఖ్యానిస్తారు. 

ఇంత గొప్ప భవిష్యత్తు ఉన్న అమృత డిసెంబర్‌  5, 1941న లాహోర్‌లో మరణించడం పెద్ద షాక్‌. అప్పటికి వయసు కేవలం 28. మరణానికి కారణం డాక్టర్లు ‘పెరిటోనైటిస్‌’ అన్నారు... అంటే ΄÷ట్టలో ఇన్ఫెక్షన్‌. చరిత్రకారులేమో ‘ఫెయిల్డ్‌ అబార్షన్‌’ అన్నారు. తల్లి మాత్రం ‘నా కూతుర్ని మొగుడే చంపేశాడు’ అని ఏడ్చింది. ఏది నిజమో ఎవరికీ తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే– భారతీయ ఆధునిక కళ ఉచ్ఛస్థితికి చేరుకుంటున్న సమయంలో, ఆ కళకు అమ్మ లాంటి అమృత చేతిలోంచి కుంచె జారిపోయింది.

బయో పోయెమ్‌
‘సలామ్‌ బాంబే’,‘మాన్ సూన్‌ వెడ్డింగ్‌’, ‘ది నేమ్‌సేక్‌’ తీసిన మీరాకు ‘అమ్రి’ పర్సనల్‌ ఫిల్మ్‌. ప్రొడ్యూసర్‌ మైఖేల్‌ నోజిక్‌ మాటల్లో చె΄్పాలంటే ‘మీరా నాయర్‌ దర్శకత్వంతో అంజలి పెర్ఫార్మెన్ ్స అద్భుతంగా ఉండబోతోంది’. అమృతగా అంజలి ఫస్ట్‌లుక్‌కే ప్రశంసలు వస్తున్నాయి. అమృతలోని క్రాస్‌ కల్చరల్‌ ఐడెంటిటీ, కళాత్మకత, ధిక్కారం ఇవన్నీ మీరా నాయర్‌ కెమెరాలో ఒదిగితే ‘అమ్రి’ ఒక విజువల్‌ పోయెమ్‌ అవుతుంది. 85 ఏళ్ల తర్వాత అమృత మళ్లీ బతుకుతుంది. 

అమృతా షేర్‌గిల్‌ ఎవరు?
మీరా నాయర్‌నే కాదు ప్రపంచ కళాభిమానులను ఆకర్షించే అమృతా షేర్‌గిల్‌ది భిన్నమైన జీవితం. హంగేరీ తల్లి, పంజాబీ సిక్కు తండ్రికి 1913లోబుడాపెస్ట్‌లో జన్మించింది. పారిస్‌లోని ఆర్ట్‌ స్కూల్‌ ‘అకాడెమీ దె బోజార్‌’లో అతి చిన్న వయసులో చదువుకుంది. యూరోపియన్‌ టెక్నిక్‌తో భారతీయ గ్రామీణ స్త్రీల వేదన, ఒంటరితనం, దైనందిన జీవితాన్ని కాన్వాస్‌ పైకి తెచ్చింది.‘త్రీ గరల్స్‌’, ‘బ్రైడ్స్‌ టాయిలెట్‌’, ‘విలేజ్‌ సీన్‌’...  ఈ మూడు చిత్రాలతో  భారతీయ కళలో మోడర్నిజానికి తొలి అడుగులు వేసింది. అందుకే ఆమెను  ఆమె 1937లో గీసిన ‘ది స్టోరీ టెల్లర్‌’ పెయింటింగ్‌ 2023లో 61.8 కోట్లకు అమ్ముడుపోయిందంటే ఇక ఆలోచించండి ఆమె కళావైశిష్ట్యం.

– కె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement