breaking news
Ambati Brahmanaiah
-
ఉల్లిపాలెం వారధికి అంబటి బ్రాహ్మణయ్య పేరు
అవనిగడ్డ/కోడూరు: కృష్ణాజిల్లా ఉల్లిపాలెం–భవానీపురం వారధి ఇకమీదట అంబటి బ్రాహ్మణయ్య వారధిగా మారనుంది. ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేశారు. ఈ వారధికి అంబటి బ్రాహ్మణయ్య వారధిగా నామకరణం చేస్తూ రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు 10వ నంబరు జీవోని శుక్రవారం విడుదల చేశారు. 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా అవనిగడ్డ వంతెన సెంటర్లో జరిగిన బహిరంగసభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉల్లిపాలెం వారధికి దివంగత ఎంపీ అంబటి బ్రాహ్మణయ్య పేరు పెడతామని ప్రకటించారు. ఈ విషయాన్ని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వారధికి అంబటి పేరు పెట్టారు. ఇచ్చినమాటకు కట్టుబడి ముఖ్యమంత్రి ఈ వారధికి బ్రాహ్మణయ్య పేరు పెట్టడం పట్ల మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల ప్రజలు, ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారధికి బ్రాహ్మణయ్య పేరు పెట్టాలని ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరినా పట్టించుకోలేదు. దీంతో ఆయన టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఇచ్చినమాట ప్రకారం వారధికి బ్రాహ్మణయ్య పేరు పెట్టిన ముఖ్యమంత్రికి శ్రీహరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. వారధికి బ్రాహ్మణయ్య పేరు పెట్టడం ద్వారా ఆయన సేవలకు గుర్తింపు లభించినట్టయిందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. -
అవనిగడ్డ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
అవనిగడ్డ శాసనసభకు బుధవారం జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ శనివారం మచిలీపట్నంలోని హిందూకళాశాలలో ప్రారంభమైంది. ఇప్పటికి ఐదో రౌండ్ ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయింది. తెలుగుదేశంపార్టీ అభ్యర్థి అంబటి శ్రీహరి ప్రసాద్ (హరిబాబు) తన సమీప ప్రత్యర్థుల కంటే 15,502 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు అవనిగడ్డ నియోజకవర్గ శాసన సభ్యునిగా ఉన్న అంబటి బ్రాహ్మణయ్య తీవ్ర అనారోగ్యంతో ఈ ఏడాది మొదట్లో మరణించారు. దీంతో ఆ నియోజవర్గం ఖాళీ ఏర్పడింది. అయితే తెలుగుదేశంపార్టీ అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు హరిబాబును ఎన్నికల బరిలోకి దింపింది. కాగా ఆయనకు పోటీ నిలిపేందుకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు నిరాకరించాయి. దీంతో హరిబాబు అభ్యర్థిత్వం ఏకగ్రీవం అయ్యేది. అయితే ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీకి రంగంలోకి దిగటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. -
ఫలించని తంత్రం
సాక్షి ప్రతినిధి, విజయవాడ : అంబటి బ్రాహ్మణయ్య మృతితో ఖాళీ అయిన అవనిగడ్డ స్థానానికి అసలు ఉపఎన్నికే జరపకూడదని భావించిన కాంగ్రెస్‌కు, ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని ఆశపడిన తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. వారొకటి తలిస్తే.. వేరొకటైందిప్పుడు. ఉపఎన్నికకు పోరు తప్పని పరిస్థితి నెలకొంది. ప్రధాన పార్టీలు కరుణించినా స్వతంత్రులు మాత్రం ససేమిరా అన్నారు. సానుభూతి మంత్రంతో తెలుగుదేశం పార్టీకి అందివచ్చిందనుకున్న ఏకగ్రీవ ఫలం దక్కకుండాపోయింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో మిగిలిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులతో టీడీపీ అభ్యర్థి తలపడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అసలీ ఉపఎన్నిక తొలినుంచి ఉత్కంఠభరితంగానే మారింది. కేవలం ఎనిమిది మాసాల వ్యవధిలో ఎన్నిక ఎందుకనుకున్న అధికార పార్టీ సాచివేత ధోరణి అవలంభించిన విషయం తెలిసిందే. ఈ దశలో నియోజకవర్గానికి చెందిన ఇద్దరు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడంతో ఎన్నికల కమిషన్ స్పందించింది. హైకోర్టు సూచన మేరకు రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్ అవనిగడ్డకు ఉప ఎన్నిక నిర్వహించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తప్పదన్నట్టుగానే ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ దశలో తొలి నుంచి ఇక్కడ పోటీ లేకుండా సానుభూతి సాకుతో తిరిగి ఎమ్మెల్యే పదవిని దక్కించుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. ఎవరినీ పోటీకి పెట్టకుండా బ్రాహ్మణయ్య కుటుంబానికి చెందిన వారికే ఎమ్మెల్యే పదవి దక్కేలా సహకరించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు.. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా పార్టీలకు విజ్ఞాపన లేఖలు రాశారు. ఏకగ్రీవం విషయంలో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ద్వంద్వ వైఖరిని అనుసరించినప్పటికీ బ్రాహ్మణయ్య కుటుంబంపై సానుభూతితో వైఎస్సార్సీపీ పోటీలో ఉండకూడదని నిర్ణయించుకుంది. అయినా స్వతంత్ర అభ్యర్థుల బెడద తెలుగుదేశానికి తప్పలేదు. టీడీపీకి ముప్పుతిప్పలు ఏకగ్రీవం కోసం టీడీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా నామినేషన్ ఉపసంహరణ కోసం స్వతంత్ర అభ్యర్థులు వారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు అంబటి శ్రీహరిప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఆయనతో పాటు మరో 15 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన దశలో ఐదుగురి నామినేషన్లు తిరస్కరించగా.. మరో 11 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం సాయంత్రం మూడు గంటలతో ముగియడంతో వారి నామినేషన్లు ఉపసంహరించుకునేలా టీడీపీ నేతలు నానా పాట్లు పడ్డారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు, రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ తదితర నేతలు రాజీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడంలో వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్వతంత్ర అభ్యర్థుల్లో ఎనిమిది మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా, మరో ఇద్దరు మాత్రం ఒప్పుకోలేదు. ఒక దశలో చిలకలూరిపేటకు చెందిన రావు సుబ్రమణ్యం అందరూ ఉపసంహరించుకుంటే తాను కూడా పోటీ నుంచి తప్పుకొంటానని మెలిక పెట్టారు. మరో స్వతంత్ర అభ్యర్థి సైకం రాజశేఖర్ ఇదిగో వస్తున్నానంటూ కాలయాపన చేశారు. రాజశేఖర్ సమైక్యాంధ్ర ఉద్యమకారులు చేపట్టిన రాస్తారోకో వల్ల ట్రాఫిక్‌లో చిక్కుకున్నారని, ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నందున నామినేషన్ ఉపసంహరణకు గడువు ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. దీంతో మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినప్పటికీ మరో గంట పొడిగించి సాయంత్రం నాలుగు గంటల వరకు అవకాశం ఇచ్చారు. అయినా రాజశేఖర్ రాకపోవడంత్ధో సుబ్రమణ్యం కూడా పోటీ నుంచి నిష్ర్కమించబోనని ప్రకటించారు. చివరికి ఉపఎన్నిక తప్పనిసరైంది. బరిలో ముగ్గురు.. అవనిగడ్డ ఉప ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నట్టు రిటర్నింగ్ ఆఫీసర్ జి.రవి బుధవారం రాత్రి ప్రకటించారు. టీడీపీ అభ్యర్థిగా అంబటి శ్రీహరిప్రసాద్‌కు సైకిల్ గుర్తు ఖరారు చేశారు. స్వతంత్ర అభ్యర్థుల సైకం రాజశేఖర్‌కు కప్పు-సాసర్, రావు సుబ్రమణ్యానికి సీలింగ్ ఫ్యాన్ గుర్తులను కేటాయించారు. పోలింగ్ 21న జరగనుంది. ఈ నెల 24వ తేదీన ఫలితం ప్రకటిస్తారు. -
అవనిగడ్డ ఉపఎన్నిక అనివార్యం
అవనిగడ్డ ఉపఎన్నిక పోలింగ్ అనివార్యంగా మారింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమయింది. నామినేషన్ ఉపసంహరణ బుధవారంతో ముగిసింది. చివరకు టీడీపీ సహా ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. 21న అవనిగడ్డకు ఉప ఎన్నికలు జరగనుండగా, 24న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. టీడీపీ తరపున అంబటి బ్రాహ్మణయ్య తనయుడు అంబటి హరిప్రసాద్ పోటీ చేస్తున్నారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి అంబటి బ్రాహ్మణయ్య మృతితో ఖాళీ ఏర్పడింది. ఆయన చనిపోయిన నాటి నుంచి ఏకగ్రీవం కోసం టీడీపీ నాయకులు, అంబటి కుటుంబసభ్యులు ఇతర పార్టీల నేతలను కోరుతూ వచ్చారు. ఇదే విషయమై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాన పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు లేఖలు కూడా రాశారు. సానుభూతి కోణంలో చూసిన వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా, సీపీఎం, బీజేపీలు తాము అభ్యర్థులను పోటీకి పెట్టలేదు.