ఉల్లిపాలెం వారధికి అంబటి బ్రాహ్మణయ్య పేరు

Ambati Brahmanaiah name for Ullipalem bridge as cm jagan promised - Sakshi

ఇచ్చినమాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

అవనిగడ్డ/కోడూరు: కృష్ణాజిల్లా ఉల్లిపాలెం–భవానీపురం వారధి ఇకమీదట అంబటి బ్రాహ్మణయ్య వారధిగా మారనుంది. ఎన్నికల సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేశారు. ఈ వారధికి అంబటి బ్రాహ్మణయ్య వారధిగా నామకరణం చేస్తూ రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు 10వ నంబరు జీవోని శుక్రవారం విడుదల చేశారు. 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా అవనిగడ్డ వంతెన సెంటర్‌లో జరిగిన బహిరంగసభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉల్లిపాలెం వారధికి దివంగత ఎంపీ అంబటి బ్రాహ్మణయ్య పేరు పెడతామని ప్రకటించారు.

ఈ విషయాన్ని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వారధికి అంబటి పేరు పెట్టారు. ఇచ్చినమాటకు కట్టుబడి ముఖ్యమంత్రి ఈ వారధికి బ్రాహ్మణయ్య పేరు పెట్టడం పట్ల మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల ప్రజలు, ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారధికి బ్రాహ్మణయ్య పేరు పెట్టాలని ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్‌ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరినా  పట్టించుకోలేదు. దీంతో ఆయన టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇచ్చినమాట ప్రకారం వారధికి బ్రాహ్మణయ్య పేరు పెట్టిన ముఖ్యమంత్రికి శ్రీహరిప్రసాద్‌ కృతజ్ఞతలు తెలిపారు. వారధికి బ్రాహ్మణయ్య పేరు పెట్టడం ద్వారా ఆయన సేవలకు గుర్తింపు లభించినట్టయిందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top