breaking news
akkayyapalem
-
అలా గిన్నిస్ రికార్డు ‘అల్లు’కుపోయారు
‘మనందరికీ ప్రత్యేకమైన ప్రతిభ, నైపుణ్యం ఉంటాయి. ఆ దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఏ పనీ చిన్నదీ కాదు, పెద్దదీ కాదు. చిన్న సూది, దారంతో నా ప్రయాణం మొదలైంది. ఇదే ఇప్పుడు నా చుట్టుపక్కల వారి జీవితాలను మార్చింది. మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి. మీ అభిరుచిని అనుసరించండి. మీకు లభించే ప్రతి అవకాశాన్ని పొందండి. అపజయాలకు భయపడ కండి. అవి విజయానికి సోపానాలుగా భావించండి’ అంటున్నారు మాధవి. సీతంపేట (విశాఖ ఉత్తర): కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తే మహిళలు కూడా అద్భుతాలు సృష్టించగలరని, రికార్డులు క్రియేట్ చెయ్యగలరని నిరూపించారు అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీలో నివసిస్తున్న మాధవి సూరిభట్ల. మాధవి స్థాపించిన ‘మహిళా మనోవికాస్’ సంస్థ ద్వారా తన వద్ద ఆన్లైన్లో శిక్షణ పొందిన 200 మంది మహిళలతో కేవలం మూడు నెలల్లో ఊలుతో 4,686 క్రోచెట్ క్యాప్స్ చేతి అల్లికతో తయారు చేసి.. ‘లార్జెస్ట్ క్రోచెట్ హ్యాట్స్, క్యాప్స్’ ప్రదర్శనతో గిన్నిస్ రికార్డు సాధించారు. ఒక గృహిణి సారధ్యంలో మరో 200 మంది మహిళల భాగస్వామ్యంతో రికార్డు సాధించి గిన్నిస్‌బుక్‌లో విశాఖ నగరానికి ఒక పేజీ సృష్టించారు. ఆమె సాధించిన గిన్నిస్ రికార్డుపై ఎంతోమంది మహిళలు, ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. దీనికి ముందు మరో నాలుగు గిన్నిస్ రికార్డుల్లో మాధవి భాగస్వామ్యం కావడం విశేషం. అదే స్ఫూర్తితో తనెందుకు సొంతంగా గిన్నిస్ రికార్డు సాధించకూడదు అనే ఆలోచన విజయంవైపు నడిపించింది. రెండు పీజీలు చేసిన మాధవి వివాహం తర్వాత కొన్నాళ్లు హైదరా బాద్‌లో ఒక కంపెనీలో హెచ్ఆర్గా పనిచేశారు. భర్త వెంకట రామారావుకు ఆర్‌సీఎల్‌లో ఉద్యోగం కారణంగా పాతికేళ్ల క్రితం విశాఖలో స్థిరపడ్డారు. మాధవి దంపతులకు ముగ్గురు పిల్లలు. దీంతో కుటుంబ బాధ్యతలు చూసుకునేసరికే సమయం సరిపోయేది. అయినా తనలో ఉన్న ప్రతిభ తోటి మహిళలకు నేర్పాలన్న ఉద్దేశంతో మధు క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్ పేరిట 2014లో మాధవి సంస్థను స్థాపించారు. సంస్థ ద్వారా ఎంతో మందికి ఊలుతో క్యాప్స్, స్వెట్టర్స్, శాలువాలు, స్కార్ఫ్, పోంచోస్, అలాగే చాక్లెట్స్, కేక్స్ తయారీ, న్యూస్ పేపర్‌తో అలంకరణ (పేపర్ క్విల్లింగ్) వస్తువులు ఇలా ఎన్నో అంశాలలో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా పాండమిక్ సమయంలో మహిళా మనో వికాస్‌గా సంస్థ పేరును మార్చి ఆన్లైన్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఉదయం రెండు బ్యాచ్‌లు, సాయంత్రం రెండు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చేవారు. ఈ విధంగా దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది మహిళలు ఊలుతో పలు రకాల అల్లికలు నేర్చుకున్నారు. ఆ విధంగా సుమారు 350 మంది వరకు మనో వికాస్‌లో సభ్యులుగా చేరారు. నాలుగు గిన్నిస్ రికార్డుల్లో భాగస్వామ్యం... గతంలో నాలుగు గిన్నిస్ రికార్డుల సాధనలో మాధవి భాగస్వా మ్యం అయ్యారు. చెన్నైకు చెందిన సంస్థ ద్వారా 2017లో లార్జెస్ట్ స్కార్ఫ్ తయారీ, 2018లో స్ల్కప్చర్స్ తయారీ, 2019లో క్రిస్మస్ డెకరేషన్, 2020లో హనుమాన్ చాలీసా లక్ష గలార్చనలో ఆన్లైన్లో పాల్గొని గిన్నిస్ రికార్డులో భాగస్వామ్యం అయ్యారు. అదే స్ఫూర్తితో తనెందుకు రికార్డు సాధించకూడదు. నా వల్ల మరో నలుగురికి పేరు తేవాలన్న ఆలోచన కలిగింది. అదే తడువుగా మహిళా మనోవికాస్ సభ్యుల వద్ద తన ఆలోచన బయటపెట్టారు. దేశ విదేశాలలో తన వద్ద శిక్షణ పొందిన 200 మంది మహిళలు మాధవి ఆలోచనకు జత కలిశారు. గిన్నిస్ బుక్ ప్రతినిధిని మెయిల్ ద్వారా సంప్రదించారు. గిన్నిస్ రికార్డు సాధించాలంటే మూడు నెలల్లో వెయ్యి క్రోచెట్ క్యాప్స్(చేతితో అల్లిన ఊలు క్యాప్‌లు) తయారు చెయ్యాలని గిన్నిస్ ప్రతినిధులు జులై 2022లో లక్ష్యం నిర్దేశించారు. మూడు నెలల్లో 200 మంది మహిళలు ఏకంగా 4,686 క్రోచెట్ క్యాప్స్ తయారు చేసి ప్రదర్శనకు సిద్ధం చేశారు. సెప్టెంబర్ 18న అక్కయ్యపాలెం మెయిన్రోడ్లో ఒక ఫంక్షన్ హాల్లో 4,686 క్యాప్స్‌తో ‘లార్జెస్ట్ క్రోచెట్ క్యాప్స్ ’ ప్రదర్శించారు. గిన్నిస్ బుక్ ప్రతినిధి స్వప్నిల్ డంగారికర్ పరిశీలించి రికార్డును ధ్రువీకరించి మాధవితో పాటు, భాగస్వా మ్యులైన 200 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. 13 ఏళ్ల నుంచి 70 ఏళ్ళు పైబడిన మహిళలు సైతం ఈ రికార్డు సాధనలో పాలు పంచుకున్నారు. ఒక్కొక్కరు 5 నుంచి 20 వరకు క్యాప్స్ తయారు చేశారు. (చదవండి: చంద్రబాబు పేకలో పవన్‌కల్యాణ్ జోకర్) -
కన్నకొడుకుని హత్య చేసిన తల్లి
-
కన్నకొడుకుని హత్య చేసిన తల్లి
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని అక్కయ్యపాలెం మండలంలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. రోజు తాగి వచ్చి గొడవపడుతున్నాడన్న కారణంతో కన్నతల్లి కొడుకును దారుణంగా హతమార్చింది. వివరాలు.. అక్కయ్యపాలెం రామచంద్రనగర్‌కు చెందిన అశోక్ వర్మ తల్లి వరలక్ష్మీ, సోదరి శ్రీదేవి, బావ వెంకటేశ్వర రాజుతో కలిసి నివసిస్తున్నాడు. రాడ్ వెండర్‌గా పనిచేసే అశోక్ తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి తల్లి వరలక్ష్మీ, సోదరి శ్రదేవితో తరచూ గొడవపడుతుండేవాడు. శనివారం రాత్రి కూడా ఇదేవిధంగా తాగి వచ్చిన అశోక్ తల్లి, అక్క శ్రీదేవితో గొడవపడ్డాడు. దీంతో వేధింపులు భరించలేక వరలక్ష్మీ పక్కనే ఉన్న రోకలిబండను తీసుకొని అశోక్ వర్మ తలపై బలంగా కొట్టింది. దీంతో అశోక్ వర్మ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలిని సందర్శించారు. హత్యకు పాల్పడిని వరలక్ష్మీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
నగల కోసం వృద్ధురాలి పీకనొక్కారు
విశాఖపట్నం: కొందరు దుండగులు నగల కోసం ఓ వృద్ధురాలి పీక నొక్కి హత్య చేశారు. అక్కయ్యపాలెం అబిద్ నగర్లో ఈ ఘటన జరిగింది. కొందరు దుండగులు రిటైర్డ్ రైల్వే హెడ్ నర్సు ఆండాలమ్మ పీక నొక్కి హత్య చేసి, ఆమె మెడలోని నగలను తీసుకువెళ్లారు. విషయం తెలిసిన వెంటనే నాలుగవ టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. -
ఒక్క చోట గందరగోళం.. వీఆర్వో పరీక్ష ప్రశాంతం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఒక్కచోట మినహాయిస్తే నగరంలో వీఆర్వో పరీక్ష ప్రశాంతంగా, సాఫీగా ముగిసింది. ఏపీపీఎస్సీ నిర్వాకం కారణంగా నగరంలోని అక్కయ్యపాలెంలోగల జ్ఞాన నికేతన్ స్కూల్లో వీఆర్వో పరీక్ష ప్రారంభంలో గందరగోళం చోటు చేసుకుంది. అభ్యర్థులకు చెమటలు పట్టించింది. అధికారులను పరుగులు పెట్టించింది. అభ్యర్థుల సంఖ్య కన్నా తక్కువగా ప్రశ్నపత్రాలను పంపించడంతో ఈ కేంద్రంలో పరీక్ష ఆలస్యమైంది. అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అధికారులు హైరానా పడి ఇతర కేంద్రాల నుంచి ప్రశ్నపత్రాలను తీసుకువచ్చి పరీక్ష నిర్వహించారు. ఈ సంఘటన మినహా మిగిలిన కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 41 వీఆర్వో, 12 వీఆర్ఏ పోస్టులకు ఆదివారం 39 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వీఆర్వో పరీక్షకు మొత్తం 21,284 మంది దరఖాస్తు చేసుకోగా 19,160 మంది (90.1 శాతం) పరీక్షకు హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన వీఆర్ఏ పరీక్షకు 888 మంది అభ్యర్థులలో 738 మంది (83.1 శాతం) పరీక్ష రాశారు. కలెక్టర్ ఆరోఖ్య రాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్ పరీక్ష కేంద్రాలకు వెళ్లి నిర్వహణను పరిశీలించారు.