breaking news
Ahmedabad Municipal Corporation
-
ఒక్క గంటలో 3.61 లక్షల మొక్కలు
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. ఏఎంసీ ఆధ్వర్యంలో గంట వ్యవధిలో∙ఏకంగా 3.61 లక్షల మొక్కలు నాటి రికార్డ్ సృష్టించారు. 25 వేల మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జపాన్‌కు చెందిన మియావాకి విధానంలో ఈ మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. ఏఎంసీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం అభినందించారు. ప్రజల భాగస్వామ్యం, పటిష్టమైన ప్రణాళిక, పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజానికి ఉన్న నిబద్ధతకు ఇది ఒక అద్భుతమైన నిదర్శనమని పేర్కొన్నారు. దాదాపు 91,006 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. సుమారు 35 రకాల దేశీయ వృక్ష జాతులకు చెందిన 3.61 లక్షల మొక్కలను నాటారు. ఏక్ పేడ్ మా కే నామ్(తల్లి పేరిట ఒక మొక్క) కార్యక్రమం విస్తృత ప్రజాదరణ పొందుతోందని, సామూహిక ఉద్యమంగా మారుతోందని అమిత్ అన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా పచ్చదనం పెరుగుతోందన్నారు. భవిష్యత్ తరాల కోసం భూమిపై పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవడానికి అత్యంత కీలకమని సూచించారు. ఆదివారం అహ్మదాబాద్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కింద దేశంలో 1.26 కోట్ల మొక్కలు నాటినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
మూత్రానికి రూపాయి!
అహ్మదాబాద్: బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జనను నివారించడానికి అహమ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఒక ఐడియా వచ్చింది. అదే 'రూపీ ఫర్ పీ' స్కీం. గురువారం నుంచి ఈ పథకాన్ని దీన్ని అమలు చేసేందుకు సర్వం సిద్దం చేశారు. ఇక్కడ మూత్రం చెయ్యి.. రూపాయి కొట్టు అనే నినాదంతో నగరంలో అనేకచోట్ల కాంప్లెక్స్‌లు వెలిశాయి. దాదాపు 67 సెంటర్లలో వీటిని నిర్వహిస్తున్నారు. నగరంలోని పారిశుధ్య పరిస్థితులను మెరుగుపర్చేందకు ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిషన్ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారు. నగరంలో దాదాపు 300 పబ్లిక్ టాయిలెట్స్ సౌకర్యం ఉన్నా, బహిరంగ మూత్ర విసర్జన వల్ల నగరంలో 67 ప్రాంతాల్లోని పరిసరాలు దుర్గంధంగా, చాలా అనారోగ్యకరంగా తయారయ్యాయని స్టాండింగ్ కమిషన్ ఛైర్మన్ ప్రవీణ్ పటేల్ తెలిపారు. అందుకే ప్రజల ఆరోగ్యం సంరక్షణార్థం ఈ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిఫారసు చేశామనన్నారు. ప్రస్తుతానికి 67 సెంటర్లలో మాత్రమే మూత్రానికి రూపాయి స్కీమ్ అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. పబ్లిక్ టాయిలెట్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన తీసుకు రావాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టామని మున్సిపల్ సీనియర్ అధికారి తెలిపారు. చాలా వరకు స్లమ్ ఏరియాల్లో తమ స్కీమును ప్రవేశపెట్టామన్నారు. అందరూ విధిగా పబ్లిక్ టాయిలెట్‌ను వినియోగించాలన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు, జరిమానా విధిస్తామన్నారు. వ్యాపార ప్రకటనల ద్వారా దీనికి సంబంధించిన వనరులను సమకూర్చుకుంటామని అధికారులు తెలిపారు. కాగా ఇలాంటి పథకాన్ని నేపాల్ రాజధాని కఠ్మండులో విజయవంతంగా అమలు చేసినట్టు సమాచారం. అక్కడ దారేచౌక్ ప్రాంతంలో మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన ఈ స్కీమును జనం బాగా వాడుకున్నారట. కాగా ఏఎంసీ ప్రవేశపెట్టిన ఈ స్కీము సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


