నర్మెటలో భారీ అగ్నిప్రమాదం

fire accident in jangaon - Sakshi

రెండిళ్లు దగ్ధం

సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం

నర్మెట(జనగామ) :  ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించడంతో రెండు ఇళ్లు దగ్ధమైన సంఘటన సోమవారం మండల కేంద్రంలో సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు రూ. 20 లక్షల ఆస్తినష్టం వాటిల్లునట్లు బాధితులు తెలిపారు.  బాధితులు, చుట్టుపక్కల వారు తెలిపిన వివరాల ప్రకారం.. రైతు కందకట్ల చంద్రమౌళి భార్యతో కలిసి పండుగకు తన అత్తగారిల్లు అయిన వెల్దండకు వెళ్లాడు. మరో ఇంట్లో ఉన్న తల్లి లలిత తన పెద్ద కూతురుతో కలిసి గ్రామంలోనే ఉంటున్న చిన్న కూతురింటికి వెళ్లారు. అకస్మాత్తుగా ఇంట్లోంచి మంటలు రావడంతో గమనించిన చుట్టుపక్కల వారు మంటలార్పే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని యజమాని చంద్రమౌళికి, జనగామలోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

పెంకుటిళ్లల్లో నిల్వ ఉంచిన సుమారు 40 క్వింటాళ్ల పత్తి, ఇతర సామగ్రి అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో టీవీలు, రిఫ్రిజిరేటర్, కూలర్, ఫ్యాన్‌లు, ధాన్యం, మక్కలు అమ్మగా వచ్చిన బీరువాలోని నగదు రూ.3.70 లక్షలు, 5 తు లాల బంగారు ఆభరణాలు, 12 క్వింటాళ్ల బియ్యం బస్తాలు దగ్ధమయ్యాయి. సమారు రూ. 20 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితుడు రోదిస్తూ చెప్పాడు. విషయం తెలుసుకున్న ఏఎస్సై కాశిరెడ్డి సిబ్బందితో సోమవారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తహసీల్దార్‌ శ్రీపతి వెంకటేశం  పంచనామా నిర్వహించారు. మంగళవారం సంఘటనా స్థలానికి చేరుకున్న జనగామ ఏసీపీ బాపురెడ్డి, క్లూస్‌ టీం, తరిగొప్పుల ఎస్సై రాజేష్‌నాయక్‌ బాధితులు, చుట్టుపక్కల  వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుçపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ
సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్ర నష్టం వాటిల్లిన కందకట్ల చంద్రమౌళి,  లలిత, మాదాసు శ్రీలత కుటుంబాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేవీఎల్‌ఎన్‌.రెడ్డి మంగళవారం పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, తమవంతు సహకారం అందిస్తామని బాధితులకు తెలిపారు. ఆయన వెంట నాయకులు రవి, సంపత్, సాయి, కరుణాకర్‌రెడ్డి, అనిల్‌కుమార్,  ప్రసాద్,  చంద్రారెడ్డి,  శంకర్‌ తదితరులు ఉన్నారు.

Read latest Warangal News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top