డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు బ్రేక్‌..!

Break to Driving license - Sakshi

ఆర్‌సీలదీ అదే పరిస్థితి

ఐదు వేల మంది వాహన  దారులకు అందని కార్డులు 

విజయనగరం ఫోర్ట్‌: విజయనగరం మండలం కోరుకొండపాలెంనకు చెందిన కె. సతీష్‌ అక్టోబర్‌లో రవాణాశాఖ కార్యాలయంలో త్రీవీలర్‌ లైసెన్స్‌ టెస్ట్‌కు హాజరై పాసయ్యాడు. అయితే ఈ రోజు వరకు అతనికి  డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డు అందలేదు. అలాగే ఎస్‌.కోట మండలం కిల్తంపాలెం గ్రామానికి చెందిన కె.వంశీకృష్ణ ఆగస్టులో టూ వీలర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్ట్‌కు హాజరై ఉత్తీర్ణుడయ్యాడు. ఇతనికి కూడా ఇంతవరకు లైసెన్స్‌ కార్డు అందజేయలేదు. ఇది ఈ ఇద్దరి పరిస్థితే కాదు. జిల్లాలో వేలాదిమంది వాహనదారుల పరిస్థితి ఇలానే ఉంది.   నాలుగు నెలలుగా కార్డులు అందకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వాహనంతో రోడ్డుపైకి వెళ్లాలంటనే వాహనదారులు భయపడుతున్నారు. పోలీసులు, రవాణా శాఖాధికారులు ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు చేపడుతున్నారు. అన్ని అర్హతలున్నా డ్రైవింగ్‌ లైసెన్స్‌ చేతిలో లేక చాలామంది అపరాధ రుసుం చెల్లించక తప్పడం లేదు. ఎల్‌ఎల్‌ఆర్‌ వచ్చిన 30 రోజుల తర్వాత అన్ని పరీక్షలు పూర్తి చేస్తే అదే రోజు శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌ ముద్రిస్తారు. అనంతరం ముద్రించిన కార్డులను పోస్టు ద్వారా వాహనదారుడి ఇంటికి నాలుగు, ఐదు రోజుల్లో పంపించాలి. కాని నెలలు గడుస్తున్నా కార్డులు అందని పరిస్థితి నెలకొంది. డ్రైవింగ్‌ లైసెన్సులతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్‌ కార్డులు (ఆర్‌సీలు), లైసెన్స్‌ రెన్యూవల్‌ కార్డుల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. 

 ఐదు వేల మందికి..
 జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వేల మందికి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు అందాల్సి ఉంది. ఇందులో 2500 రిజిస్ట్రేషన్‌ కార్డులు, 2500 డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులు ఉన్నాయి. 

మూలకు చేరిన ప్రింటర్‌ 
జిల్లా కేంద్రంలో ఉపరవాణా కమిషనర్‌ కార్యాలయం ఉంది. అదేవిధంగా సాలురు, పార్వతీపురంల్లో వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయాలున్నాయి. అన్నింటికీ కార్డుల ముద్రణ విజయనగరంలో ఉన్న ఉపరవాణా కమిషనర్‌ కార్యాలయంలోనే జరుగుతుంది. అయితే జిల్లా కేంద్రంలో ఉన్న ఒకే ఒక్క ప్రింటర్‌ తరచూ మొరాయిస్తుండడంతో సమస్య నెలకొంటోంది. సుమారు పదిహేనేళ్ల కిందటి ప్రింటర్‌ కావడంతో ఎప్పటికప్పుడు సమస్యలు నెలకొంటున్నాయని సిబ్బంది చెబుతున్నారు. జిల్లా అవసరాలు బట్టి కనీసం మూడు ప్రింటర్లు ఉండాలి. ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చే శాఖలో రవాణాశాఖ ఒకటి అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉన్నతాధికారులకు తెలియజేశాం..
ప్రింటర్‌ పాడైన విషయం ఉన్నతాధికారులకు తెలియజేశాం. సుమారు ఐదు వేల వరకు డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్‌సీలు ప్రింట్‌ చేయాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
–  భువనగిరి కృష్ణవేణి, ఉపరవాణా కమిషనర్‌

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top