పండ్లతొక్కలే పరమౌషధం | Pandlatokkale paramausadham | Sakshi
Sakshi News home page

పండ్లతొక్కలే పరమౌషధం

Nov 2 2015 11:51 PM | Updated on Oct 1 2018 6:38 PM

పండ్లతొక్కలే పరమౌషధం - Sakshi

పండ్లతొక్కలే పరమౌషధం

రసాయనిక ఎరువులకు బదులు పండ్ల తొక్కల పొడిని, సారాన్ని సహజ ఎరువుగా పంటకు అందించి భూసారం, దిగుబడులను

రసాయనిక ఎరువులకు బదులు పండ్ల తొక్కల పొడిని, సారాన్ని సహజ ఎరువుగా పంటకు అందించి భూసారం, దిగుబడులను పెంచటంలో పరిశోధకులు విజయం సాధించారు. తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్తలు మెర్సి, ఎస్, ముబ్సిరాబాను, ఎస్., జెన్నిఫర్, ఐ. ల బృందం మెంతులు, కూరగాయల పంటల కు తక్కువ ఖర్చుతో పోషకాలను అందించి మంచి దిగుబడి సాధించింది. ఈ విధానంలో పెంచిన మొక్కలు రసాయనిక ఎరువులతో పెంచినవాటికన్నా మంచి పెరుగుదలతో, అధిక దిగుబడులనివ్వటం విశేషం.

 తమిళనాడులోని రామంతపూర్ జిల్లా, కిలకరాయ్ గ్రామంలో ఈ ప్రయోగం జరిగింది. అరటి, దానిమ్మ, కమలా, తీపి నిమ్మ పండ్ల తొక్కల ను సేకరించి వాటి నుంచి పౌడర్‌ను, సారాన్ని తయారుచేశారు. వాటిని నీటితో వివిధ నిష్పత్తులలో కలిపి మిశ్రమాన్ని తయారు చేశారు. 1 గ్రాము పొడిని 100 మి.లీ. నీటికి కలిపి ఎఫ్-1 గా, 3 గ్రాములు పొడిని 300 మి.లీ. నీటికి కలిపి ఎఫ్-2 గా, 6 గ్రాముల పొడిని 600 మి.లీ. నీటికి కలిపి ఎఫ్ -3 అనే మూడు మిశ్రమాలను తయారుచేశారు. వీటిని మూడు రోజులు నిల్వ ఉంచారు. మెంతుల విత్తనాలను ఒక్కో కుండలో వంద చొప్పున ఉంచి శుభ్రమైన నీటితో కలిపిన ఈ మిశ్రమాన్ని రోజూ అందించారు. 45 రోజుల తరువాత ఫలితాలను పరిశీలించారు.

 భూసారం, పోషకాల పెంపు సుసాధ్యం
 సేకరించిన మట్టిని పోర్ ప్లేట్ టెక్నాలజీ ద్వారా 24 గంటల పాటు ఇంక్యుబేటర్‌లో ఉంచి అనంతరం సూక్ష్మజీవులను లెక్కించారు. పొటాష్, అయాన్, జింక్ ,విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్, కొన్ని ఇతర మూలకాల సంఖ్య ఈ మట్టిలో బాగా పెరిగింది. నిమ్మ తొక్కలు రోగకారక, హాని చేసే శత్రుక్రిములను నిరోధిస్తాయని తేలింది. సూక్ష్మ పోషకాలను వినియోగించుకోవటంలో ఈపొడి మొక్కలకు సహాయ కారిగా పనిచేస్తుంది. ఈ మూడు సమ్మేళనాల వినియోగంతో మొక్కల పెరుగుదల, తద్వారా అధిక దిగుబడి సాధ్యమేనని ఫలితాలు నిరూపించాయి. రసాయన ఎరువులతో పెంచిన మొక్కలకు భిన్నంగా 15 రోజుల్లో క ణుపుల దశలోనే వీటిలో పెరుగుదలకు సంబంధించిన హార్మోన్లను గుర్తించారు. మొక్కలలో కొత్త కొమ్మలు, ఆకుల సంఖ్య పెరిగింది.

వేళ్ల వద్ద మట్టిని పరిశీలించగా నత్రజని, ఫాస్పరస్, పొటాషియంలు ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఈ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో వరి, ఆవాలు, కాయధాన్యాల పంటలపై, టిష్యూకల్చర్‌లోనూ ప్రయోగాలకు ఈ బృందం సిద్ధమవుతోంది. రసాయనిక ఎరువులకు బదులు చౌకైన, విషపూరితం కాని పండ్ల తొక్కల ఎరువులను వాడటం ద్వారా భూమి సారం కోల్పోవటాన్ని నిరోధించవచ్చు. రసాయనిక ఎరువుల వాడకం వల్ల నీటి కాలుష్యం, భూమి నిస్సార మవుతున్న ఈ తరుణంలో ఇలాంటి పరిశోధనల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ తరహా విధానాల దిశగా శాస్త్రీయ పద్ధతిలో మంచి ఫలితాలు రాబట్టిన మొదటి ప్రయోగం ఇదేకావటం విశేషం. భూసారం, దిగుబడులు పెంచే ఈ విధానం అందుబాటులోకి వస్తే రైతులకు మేలు జరుగుతుందనటంలో సందేహం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement