పాలు పితికే వేళ.. జాగ్రత్తలు పాటించాలి | Sakshi
Sakshi News home page

పాలు పితికే వేళ.. జాగ్రత్తలు పాటించాలి

Published Mon, Nov 3 2014 12:01 AM

must be care  when taking the milk

 కందుకూరు: పశువుల నుంచి పాలు పితికే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే అటు పశువుల ఆరోగ్యంతో పాటు ఇటు పాలను స్వచ్ఛంగా ఉంచవచ్చు. దీంతో ఎక్కువ సమయం పాలు చెడిపోకుండా ఉంటాయి. వీటి నుంచి తీసిన వెన్న, నెయ్యి, మంచి రుచి, వాసన కలిగి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

పాల శుభ్రత అనేది పశువుల ఆరోగ్య స్థితి, పశుశాలలు, పాలు పితికే మనిషి, పాలు నిల్వ ఉంచే పాత్రల శుభ్రత మీద ఆధారపడి ఉంటుందంటున్నారు మండల పశువైద్యాధికారి రవిచంద్ర . పాలు పితికే సమయంలో పాటించాల్సిన  పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఆయన పలు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.

 పశువుల ఆరోగ్య స్థితి...
 పాలిచ్చే పశువుల ఆరోగ్యం పట్ల రైతులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. అంటువ్యాధులతో బాధపడే పశువులను మంద నుంచి వేరు చేసి పశువైద్యుల సలహా మేరకు అవసరమైన చికిత్సను అందించాలి. పశువు శరీర భాగాలైన కడుపు, డొక్కలు, పొదుగు పాలు పితికే ముందు శుభ్రంగా కడిగి తడి బట్టతో తుడవాలి. డొక్కలకు పొదుగుకు మధ్య ఉండే వెంట్రుకలను పొడవు పెరగనీయకుండా కత్తిరించాలి. పొదుగును శుభ్రపరిచి పొడిబట్టతో తుడవాలి.

ఆ తర్వాత పాలు పితకాలి. పాలు తీయడం పూర్తయిన తర్వాత యాంటీసెప్టిక్ ద్రావణం (ఉదాహరణకు కోర్సలిన్ ద్రావణం లీటర్ నీటికి 2 మి.లీ కలపాలి)తో కడగాలి. అదే నీటితో పిండిన వ్యక్తి తన చేతులను కడుక్కోవాలి. పితికిన వెంటనే నేలపై పశువును అరగంట వరకు పడుకోనీయవద్దు. అప్పుడే పాలు పిండటంతో చను రంధ్రాలు తెరచుకోని ఉంటాయి. దీంతో ఒక వేళ పశువు పడుకుంటే ఆ రంధ్రాల నుంచి నేలపై ఉన్న బ్యాక్టీరియా త్వరగా పొదుగులోకి చేరి పొదుగు వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. పాలు పితికిన వెంటనే పశువు పడుకోకుండా ఉంచాలంటే వాటి ముందు గడ్డి కాని లేదా దాణా పెట్టాలి.
 
 పశువుల షెడ్‌లో...
 పశువుల షెడ్‌లను ఎత్తయిన, నీరు నిల్వ ఉండని ప్రాంతంలో నిర్మించుకోవాలి. దీంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. షెడ్ లోపలఙగడ్డి గాని లేదా ఇటీవల మార్కెట్లో ప్రత్యేకంగా వస్తున్న రబ్బర్ షీట్లను గాని పరుచుకోవచ్చు. షెడ్‌లో దోమలు, ఈగలు రాకుండా జాగ్రత్త వహించాలి. అవసరాన్ని బట్టి క్రిమి సంహారక మందులను పిచికారీ చేయాలి. దుమ్ము లేచే నేల అయితే పాలు తీసే ముందు కొద్దిగా నీరు చల్లాలి.

 పాలు తీసే వ్యక్తి...
 పశువుల నుంచి పాలు తీసే వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి. అంటువ్యాధులు, చర్మ వ్యాధులతో బాధపడేవారిని పాలు తీయడానికి ఉపయోగిం చవద్దు. పాలు తీసే వారి చేతి గోర్లు పెరగకుండా కత్తిరించుకునేలా చూడాలి. పాలు తీసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కుని పొడి గుడ్డతో తుడుచుకోవాలి. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకుని మరొక దాని పాలు తీయాలి. లేకపోతే ఆ పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. వేడినీటితో పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

Advertisement
Advertisement