
పుస్తక జ్ఞానంతోనే ప్రకృతి సేద్యం!
బతుకును పచ్చగా మార్చుకోవాలన్న సంకల్పం బలంగా ఉన్న పట్టభద్రుడైన ఒక యువ రైతు జగదీశ్వర్‌రెడ్డి కేవలం పుస్తకాలు చదివి,
బతుకును పచ్చగా మార్చుకోవాలన్న సంకల్పం బలంగా ఉన్న పట్టభద్రుడైన ఒక యువ రైతు జగదీశ్వర్‌రెడ్డి కేవలం పుస్తకాలు చదివి, వీడియోలు చూసి ప్రకృతి సేద్యాన్ని నేర్చుకున్నాడు. కుటుంబ సభ్యుల నుంచి తొలుత వ్యతిరేకత వచ్చినా దీక్షతో ముందడుగేసి.. వారితోనే శభాష్ అనిపించుకుంటున్నాడు. విద్యుత్ సంక్షోభాన్ని సౌర విద్యుత్ మోటారుతో అధిగమిస్తున్నాడు. తాను పండించిన బియ్యం,కూరగాయలను సొంత దుకాణం ద్వారా సహజాహార ప్రేమికులకు అమ్ముతున్నాడు. చక్కని ఆదాయాన్ని పొందుతూ
తోటి అన్నదాతలకు ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నాడు.
మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తపుంతలు తొక్కే గుణమే అన్నదాతలకు శ్రీరామరక్ష అని రుజువు చేస్తున్నాడు వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గడ్డం జగదీశ్వర్ రెడ్డి(41). కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండలం రాంపూర్‌లో పుట్టిన ఆయన బీఎస్సీ మ్యాథ్స్ పాసై.. కంప్యూటర్ శిక్షణ, సేల్స్, సర్వీసింగ్ రంగాలలో ఆరేడేళ్లపాటు కష్టపడినా ఫలితం లేకపోవడంతో వ్యవసాయంపైన దృష్టి పెట్టాడు.
పాలేకర్ పుస్తకాలు.. వీడియోలు..
పదెకరాల సొంత భూమిలో సాగుకు రసాయన ఎరువులు, పురుగుమందులకు ఏటా రూ. లక్ష వరకు ఖర్చయ్యేది. ఎంత జాగ్రత్తగా చేసినా చివరికి అప్పులే మిగులుతుండడంతో మూడేళ్ల క్రితం వ్యవసాయం మానేద్దామనుకున్నాడు. అటువంటి సమయంలో మహారాష్ట్రకు చెందిన సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి గురించి తెలిసింది. పాలేకర్ పుస్తకాలు తెప్పించుకొని నాలుగైదు సార్లు క్షుణ్ణంగా చదివి.. యూట్యూట్‌లో వీడియోలు చూసి వ్యవసాయంలో తాను చేస్తున్న తప్పులేమిటో.. చేయాల్సిందేమిటో తెలుసుకున్నాడు. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో క్రమంగా, దశలవారీగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు పరుస్తూ మూడేళ్లలో పూర్తిస్థాయి ప్రకృతి సేద్యంలోకి మారాడు. నాటు ఆవును కొని షెడ్డు వేసి, ఆవు మూత్రం ఒక పక్కకు వచ్చి నిలిచేలా ఏర్పాటు చేశాడు. ఆవు మూత్రంతో ఘన జీవామృతం, జీవామృతం తయారు చేసి పంటలకు వేస్తున్నాడు. ప్రకృతి వ్యవసాయం రైతుకు ఎంత లాభదాయకమో తెలుసుకున్న ఆయన తల్లితండ్రులతోపాటు, ఇతర రైతులూ ఆశ్చర్యపోతున్నారు.
జీవామృతం.. ఆవు మూత్రం
4 ఎకరాల్లో వరి పొలం, మూడెకరాల్లో పసుపు, మొక్కజొన్న, రెండెకరాల్లో పండ్ల తోటలు, ఎకరంలో కూరగాయలు, పూలను 2014 ఖరీఫ్ నుంచి పూర్తిగా ప్రకృతి సేద్యపద్ధతుల్లోనే సాగు చేస్తున్నాడు. పంట ఏదైనా దుక్కిలో యూరియా, డీఏపీకి బదులు ఎకరానికి క్వింటా చొప్పున ఘనజీవామృతం, వేపపిండి, ఆముదం పిండి వేస్తాడు. తర్వాత ప్రతి 15 రోజులకోసారి జీవామృతం సాగు నీటిలో కలిపి పంటలకు అందిస్తాడు. పురుగులేమైనా కనిపిస్తే 15 లీటర్ల నీటికి 2 లీటర్ల ఆవు మూత్రం కలిపి పిచికారీ చేస్తాడు. సాగు ఖర్చు సగానికి సగం తగ్గింది. పంటలు నిగ నిగలాడకపోయినా ఆరోగ్యంగా పండుతున్నాయి.
ఆదుకున్న సౌర విద్యుత్తు
బోర్లు, వ్యవసాయ బావులే ఆధారం. ఎకరం తడవడానికి సరిపోయేంత సిమెంటు తొట్టిని కట్టించి, నీటిని అందులోకి తోడి.. డ్రిప్, స్ప్రింక్లర్లు, కాలువల ద్వారా పంటలకు అందిస్తున్నాడు. విద్యుత్ కోతలతో మోటర్లు నడవక రెండెకరాల్లో వరి, కొంత పసుపు ఎండిపోయింది. మిగిలిన పంటలనైనా రక్షించుకోవాలంటే సౌర విద్యుత్తే దిక్కని సకాలంలో గుర్తించి.. అప్పుచేసి మరీ రూ.3.5 లక్షలతో 5 హెచ్‌పీ సోలార్ పంపును పెట్టించాడు. ఇప్పటికీ కరెంటు రోజు మార్చి రోజు ఇస్తున్నారని, సోలార్ పంపు లేకపోతే పంటేదీ చేతికొచ్చేది కాదని జగదీశ్వర్‌రెడ్డి చెప్పాడు.
మూడింతల నికరాదాయం
2014 ఖరీఫ్ సీజన్‌లో జై శ్రీరాం అనే సన్న రకం వరిని జగదీశ్వర్ రెడ్డి సాగు చేసాడు. నాలుగెకరాలకు విత్తనాలు, కూలీలు ఇతర ఖర్చుల రూపేణా రూ. 70 వేల వరకు ఖర్చు చేశాడు. కానీ, కరువుతో రెండెకరాల్లో వరి పంట ఎండిపోయింది. ధాన్యం మర పట్టిస్తే 30 క్వింటాళ్ల బియ్యం చేతికొచ్చాయి. నేరుగా వినియోగదారులకు అమ్మితేనే గిట్టుబాటు ధర వస్తుందని గ్రహించిన జగదీశ్వర్‌రెడ్డి సొంతంగా సహజాహార దుకాణం తెరిచాడు. జై శ్రీరాం బియ్యం క్వింటా ధర మార్కెట్లో రూ. 4 వేలుండగా రూ.6,500కు అమ్ముతున్నాడు. కిలో రూ.10-15 అధిక ధరకు కూరగాయలు అమ్ముతున్నాడు. తక్కువ ఖర్చుతో పండించడం, శ్రమకోర్చి నేరుగా తానే అమ్ముతున్నందున సాధారణ రైతులతో పోల్చితే ప్రతి పంటలోనూ మూడింతల నికరాదాయం పొందుతున్నాడు. తనంతట తానే నేర్చుకున్న ప్రకృతి సేద్యం జగదీశ్వర్‌రెడ్డికి ఆదాయ భద్రతను, వినియోగదారులకు ఆరోగ్య భద్రతను ఇస్తుండడం హర్షదాయకం.
- పన్నాల కమలాకర్ రెడ్డి,
జగిత్యాల అగ్రికల్చర్, కరీంనగర్ జిల్లా
ఖర్చంతా కూరగాయల ద్వారా రాబట్టాలి!
గత మూడేళ్లుగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా పంటలు పండిస్తున్నా. పెట్టుబడి ఎకరానికి రూ. 5 వేల వరకు తగ్గింది. ఇప్పుడిప్పుడే ఇతర రైతులూ ఈ వ్యవసాయం వైపు చూస్తున్నారు. మా బియ్యం, కూరగాయలు తిన్న వాళ్లు తేడా గుర్తిస్తున్నారు. మార్కెట్‌లో కొన్న కూరగాయలు వండినప్పుడు పురుగుమందు వాసన వస్తుంటే పారేశామని చెప్పినవాళ్లున్నారు. కూరగాయ పంటల ద్వారా ఖర్చులన్నీ రావాలి.. వరి, పసుపు తదితర ప్రధాన పంటలపై ఆదాయం నికరంగా మిగలాలి. వచ్చే ఏడాది నుంచి ఈ లక్ష్యం సాధిస్తా.
- గడ్డం జగదీశ్వర్‌రెడ్డి (93915 11076),
రాంపూర్, మల్యాల మండలం, కరీంనగర్ జిల్లా