వాట్సాప్లో దుష్ప్రచారం చేస్తే..

వాట్సాప్లో దుష్ప్రచారం చేస్తే.. - Sakshi

వారణాసి: సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు, వదంతుల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వారణాసి జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూపుల్లో వదంతులు, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తే సదరు గ్రూపు అడ్మినిస్ర్టేటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్లు వారణాసి జిల్లా మెజిస్ర్టేట్‌ యోగేశ్వర్‌ రామ్‌ మిశ్రా, సీనియర్‌ ఎస్పీ నితిన్‌ తివారీ ఉమ్మడి ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో పలు గ్రూపులు.. నిజనిర్ధారణ చేసుకోకుండా అసత్య, అనధికారిక సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొన్నారు.



దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మినిస్ర్టేటర్లకు, సభ్యులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమ గ్రూపులకు సదరు గ్రూపు అడ్మినే బాధ్యత వహించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. మతపరమైన అశాంతికి దారితీసే అసత్య ప్రకటనలు, వదంతులు గ్రూపులోని సభ్యులెవరైనా వ్యాప్తి చేస్తే సదరు గ్రూపు అడ్మిన్‌ దాన్ని తీసివేసి ఆ సభ్యుడిని గ్రూపు నుంచి తొలగించాలని ఆదేశించారు. వీటిని పాటించకపోతే ఆ గ్రూప్‌ అడ్మిన్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో భావ ప్రకటనా స్వేచ్ఛ ముఖ్యమేనని, అయితే అది బాధ్యతతో కూడి ఉండాలని పేర్కొన్నారు.



మత విశ్వాసాలను దెబ్బతీసే వ్యాఖ్యలను వ్యాప్తిచేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చర్యలు తీసుకునే ముందు సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల తీర్పులను పరిగణనలోకి తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా సరిహద్దులకే పరిమితం కాని సామాజిక మాధ్యమంపై ఈ ఆదేశాలను తీవ్ర సిబ్బంది కొరత ఎదుర్కొంటున్న వారణాసి పోలీసులు ఎలా అమలు చేస్తారో వేచి చూడాల్సి ఉంది.
Read latest Top Stories News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top