వైఎస్సార్‌సీపీ తరఫునే పోటీచేస్తా : సబ్బం హరి | will contest on Ysrcp ticket only, says Sabbam hari | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ తరఫునే పోటీచేస్తా : సబ్బం హరి

Sep 18 2013 2:05 AM | Updated on Jul 28 2018 6:26 PM

వైఎస్సార్‌సీపీ తరఫునే పోటీచేస్తా : సబ్బం హరి - Sakshi

వైఎస్సార్‌సీపీ తరఫునే పోటీచేస్తా : సబ్బం హరి

వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు అనకాపల్లి లోక్‌సభ సభ్యుడు సబ్బం హరి చెప్పారు.

సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు అనకాపల్లి లోక్‌సభ సభ్యుడు సబ్బం హరి చెప్పారు. ఆయన మంగళవారమిక్కడ చంచల్‌గూడ జైలులో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ మరణానంతరం తాను జగన్ వెంటే ఉన్నానన్నారు.
 
 తాను కాంగ్రెస్ పార్టీ దూతను కాదన్నారు. తాను జగన్‌ను చాలాసార్లు కలిసి పార్టీ విధివిధానాలు, వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సీబీఐ విచారణ సమయంలో తాను జగన్ వెంటే ఉన్నానన్నారు. జైలును రాజకీయ కేంద్రంగా మార్చారని ప్రతిపక్షాలు ఆరోపించటం సరికాదన్నారు. ములాఖత్‌లో జగన్‌ను ఎవరూ కలవకుండా ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయన్నారు. అయితే జైలు నిబంధన ప్రకారమే తాము నడుచుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించినందుకే జగన్‌ను జైలుపాలు చేశారని సబ్బం హరి ఆవేదన వ్యక్తంచేశారు. ఎవరెన్ని రాజకీయ కుతంత్రాలు చేసినా జనం జగన్ వెంటే ఉండటాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. నాలుగు నెలల్లోగా సీబీఐ విచారణ పూర్తిచేయాలని, ఆ తర్వాత జగన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని సుప్రీంకోర్టు గత మే నెలలో పేర్కొందని, ఆ గడువు పూర్తయిందని ఆయన చెప్పారు. జగన్‌ను ఇంకా ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు ఇకపై ఉండవన్నారు.
 
 జగన్‌ను విచారించేందుకు ఎంత సమయం పడుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ.. ఇప్పుడు కేసు విచారణను నాన్చుతోందన్నారు. సమైక్య రాష్ట్రం విషయంలో ఏ పార్టీ నాయకుడూ తీసుకోని సాహసోపేత నిర్ణయాన్ని జగన్ తీసుకోవటం అభినందనీయమన్నారు. రాజకీయ నష్టం జరుగుతోందని తెలిసినప్పటికీ ప్రజల సంక్షేమాన్నే జగన్ కోరుకున్నారని, ఆయన వెంట ఉన్నందుకు గర్విస్తున్నానని సబ్బం హరి చెప్పారు. ఇదిలా ఉండగా సమైక్య శంఖారావం పేరుతో 13 జిల్లాల్లో బస్సుయాత్ర పూర్తి చేసిన జగన్ సోదరి షర్మిల కూడా మంగళవారం చంచల్‌గూడ జైలులో ఆయన్ను కలిశారు. మంగళవారం జగన్‌ను కలిసిన వారిలో సతీమణి వైఎస్ భారతి, జక్కంపూడి రాజా కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement