ఫోక్స్ వ్యాగెన్ కు మరో ఎదురు దెబ్బ | Volkswagen hit with Australian lawsuit | Sakshi
Sakshi News home page

ఫోక్స్ వ్యాగెన్ కు మరో ఎదురు దెబ్బ

Nov 2 2015 10:19 AM | Updated on Aug 14 2018 3:25 PM

ఫోక్స్ వ్యాగెన్ కు మరో ఎదురు దెబ్బ - Sakshi

ఫోక్స్ వ్యాగెన్ కు మరో ఎదురు దెబ్బ

ఫోక్స్ వ్యాగన్ కంపెనీకి వ్యతిరేకంగా ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టులో లా సూట్ దాఖలైంది.

అసలే చిక్కుల్లో ఉన్న ఫోక్స్ వ్యాగన్ కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే సమస్యాత్మక ఈఏ టైప్ ఇంజన్లు ఉన్న కార్లను వెనక్కి తెప్పించుకుంటున్న ఈ ఆటో మొబైల్ దిగ్గజానికి వ్యతిరేకంగా తొలిసారి కోర్టులో దావా నమోదైంది. ఈ జర్మన్ కంపెనీపై ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టులో లా సూట్ వేశారు. నాణ్యత లేని పరికరాలతో కంపెనీ తమను మోసం చేసిందంటూ సోమవారం ఫెడరల్ కోర్టులో బ్యానిస్టర్ లా దాఖలైంది.

ఫోక్స్ వాగన్ కంపెనీ కాలుష్య నియంత్రణ విషయంలో వినియోగదారులను మోసం చేసిందని.. నాసిరకం పరికరాలు ఉన్న కార్లను అమ్మి కస్టమర్లను మోసం చేసిందని.. ఈ కార్ల కంపెనీపై రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ కేసులో ఫోక్స్ వ్యాగెన్ కి వ్యతిరేకంగా కేసు నిరూపితమైతే.. కస్టమర్లకు బిలియన్ డాలర్లు నష్ట పరిహారం కట్టాల్సి వస్తుంది. మిగిలిన కార్ల కన్నా కాలుష్యం తక్కువని ప్రచారం చేసిన కంపెనీ.. కార్లు విడుదల చేసే కాలుష్యం ఎక్కువ ఉన్నా, తక్కువగా చూపించే సాఫ్ట్ వేర్ వాడారన్నది కంపెనీపై కస్టమర్ల అభియోగం.


మరో వైపు ఆస్ట్రేలియన్ ప్రభుత్వం.. అధికారులు కూడా ఈ జర్మన్ కార్ల తయారీ దిగ్గజంపై గుర్రుగానే ఉన్నారు. ఆస్ట్రేలియాలోని కాలుష్య నియంత్రణ చట్టాలను మోసం చేసినందుకు గానూ భారీగా జరిమానా విధించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కంపెనీ ఉన్నతాధికారులతో ఆస్ట్రేలియా ప్రభుత్వ వర్గాలు చర్చలు జరిపాయి.

ఈ ఏడాది అక్టోబర్ లో ఫోక్స్ వాగన్ ప్రపంచ వ్యాప్తంగా 1.1 కోట్ల డీజిల్ కార్లకు ఒకే రకమైన సాఫ్ట్ వేర్ వాడి కస్టమర్లను మోసం చేసినట్లు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించి తయారు చేసిన 91,000 వేల ఫోక్స్ వాగన్, ఆడీ కార్లను వెనక్కి తెప్పించుంకుంది. వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉన్న కార్లన్నింటినీ రీకాల్ చేయాలని నిర్ణయించుకుంది. టైప్ ఈఏ 189 ఇంజన్లు ఉన్న కార్ల విక్రయాలను నిలిపేసింది.

Advertisement
 
Advertisement
Advertisement