అక్కడ ఆడపిల్ల పుడితే పండుగే | Villagers to celebrate girl child births like a festival | Sakshi
Sakshi News home page

అక్కడ ఆడపిల్ల పుడితే పండుగే

Jun 3 2015 3:51 PM | Updated on Sep 3 2017 3:10 AM

అక్కడ ఆడపిల్ల పుడితే పండుగే

అక్కడ ఆడపిల్ల పుడితే పండుగే

ఆ గ్రామంలో ఆడపిల్ల పుడితే పండుగలాంటి వాతావరణం కనిపిస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలంతా ఆనందంతో చిందేస్తారు.

ఆ గ్రామంలో ఆడపిల్ల పుడితే పండుగలాంటి వాతావరణం కనిపిస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలంతా ఆనందంతో చిందేస్తారు. పుట్టిన ఆడబిడ్డ పేరిట ఊరంతా కలిసి 111 పండ్ల మొక్కలను తీసుకొస్తారు. వాటిని బిడ్డ పుట్టిన ఇంటి లోపల, బయట నాటుతారు. ఆ మాత్రం స్థలం లేకపోతే ఊరుమ్మడి స్థలంలో నాటుతారు. ఆ చెట్లకు ఆ ఆడబిడ్డ పేరే పెడతారు. ఆడబిడ్డతోపాటు ఆ పండ్ల మొక్కలను కూడా అల్లారు ముద్దుగా పెంచాల్సిన బాధ్యత ఆ బిడ్డ తల్లిదండ్రులదే. కావాల్సిన సహాయం మాత్రం ఇరుగు, పొరుగు మహిళలు అందజేస్తారు. అంతేకాకుండా మొక్కలు నాటినప్పుడే ఆ మొక్కలకు పూజలు చేసి ఆ బిడ్డకు 18 ఏళ్ల వయస్సు వచ్చేవరకు చదివిస్తానని, ఆ తర్వాతనే పెళ్లి చేస్తానని బిడ్డ తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చేస్తారు.

ఏటా ఆ బిడ్డ పుట్టిన రోజునాడు ఆ చెట్ల వద్దకు వెళ్లి కంకణధారణతో ఆడ పిల్లలు పూజలు చేస్తారు. చెట్లు చల్లగా ఉంటూ తమను చల్లగా చూడాలని కోరుకుంటారు.ఆడబిడ్డ బతుకు భారం కాకూడదనే తలంపుతో ఆడబిడ్డ ప్రసవించిన రోజే ఊరంతా కలసి 21 వేల రూపాయలు సేకరిస్తారు. తల్లిదండ్రుల నుంచి మరో పదివేల రూపాయలు వసూలు చేసి మొత్తం 31 వేల రూపాయలను పుట్టిన బిడ్డ పేరిట డిపాజిట్ చేస్తారు. ఆ సొమ్మును ఆ బిడ్డ పెళ్లికే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ఊరుమ్మడి కట్టుబాటు.

2006లో మొదలైన ఈ కట్టుబాటు రాజస్థాన్ రాష్ట్రంలోని పిప్లాంత్రి గ్రామంలో నేటికి నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామంలో పుట్టిన ఆడ పిల్లల పేరుమీద 25 వేల రకరకాల పండ్ల మొక్కలను నాటారు. వాటి నుంచి వచ్చే పండ్లనే కాకుండా అలవీర మొక్కల నుంచి జూస్‌ను తయారు చేసి గ్రామ మహిళలు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అలా వచ్చిన సొమ్మును గ్రామంలోని అమ్మాయిల ఆరోగ్యం, చదువుకోసం ఖర్చు పెడుతున్నారు.

ఫలప్రదమైన ఈ ఆచారానికి 2006లో అప్పటి గ్రామ సర్పంచ్ శ్యామ్ సుందర్ పలవాల్ శ్రీకారం చుట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు కిరణ్ అనారోగ్యంతో మరణించడంతో గ్రామంలో ఎవరి కూతురు కూడా అనారోగ్యంతో చావకూడదని, ఆరోగ్య పరిరక్షణలో పండ్లు ఎంతగానో తోడ్పడతాయని పండ్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆడపిల్ల మైనస్, మగపిల్లాడు ప్లస్ అనే ఆర్థిక సూత్రం చెప్పే నేటి సమాజంలో అమ్మాయిల పెంపకం, చదువు, పెళ్లి భారం కాకూడదనే దూరాలోచనతో 31 వేల రూపాయల డిపాజిట్ పథకాన్ని కూడా తీసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement