నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన భారత ప్రధాని మన్మోహన్ సింగ్కు అక్కడి కోర్టు సమన్లు ఇచ్చింది.
అమెరికా పర్యటనకు భారత నాయకులు ఎవరు వెళ్లినా వాళ్లకు అక్కడి కోర్టుల నుంచి సమన్లు తప్పడంలేదు. తాజాగా, నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన భారత ప్రధాని మన్మోహన్ సింగ్కు అక్కడి కోర్టు సమన్లు ఇచ్చింది. 1990లలో పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాద నిరోధ ఆపరేషన్ల సందర్భంగా మానవహక్కుల ఉల్లంఘన జరిగిందంటూ.. దానికి సంబంధించి ఈ సమన్లు అందించింది. ఈ సమన్లను వైట్హౌస్ సిబ్బంది ద్వారా మన్మోహన్ సింగ్ భద్రతా సిబ్బందికి అందజేయాలని న్యూయార్క్లోని మానవహక్కుల సంస్థ 'సిఖ్ ఫర్ జస్టిస్' (ఎస్ఎఫ్జె) ప్రయత్నిస్తోంది.
గతంలో అమెరికాకు చికిత్స నిమిత్తం వెళ్లిన ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి కూడా ఇదే సంస్థ సమన్లు అందజేసింది. అయితే, వాటిని అందుకోకముందే ఆమె తిరిగి భారతదేశానికి వచ్చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో గురువారం సమావేశం కానున్నారు. అయితే, ఇప్పుడు మన్మోహన్ సింగ్కు సమన్లు అందించడం కూడా ఎస్ఎఫ్జెకు అంత సులభం కాకపోవచ్చన్నది సమాచారం. ఎస్ఎఫ్జె కేవలం ప్రచారం కోసమే ఇలా ప్రముఖులకు సమన్లు ఇస్తోందంటూ న్యూయార్క్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్న న్యాయవాది రవి బాత్రా ఓ కేసు దాఖలు చేశారు.