భారత వైమానిక రంగం కొద్ది రోజులుగా స్తంభించిపోయింది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నిర్వాకంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో వేల సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంటరీ కమిటీ త్వరలో ఇండిగోతో సహా దేశంలోని అన్ని విమానయాన సంస్థలకు సమన్లు జారీ చేయనుంది.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో చేసిన పని దేశవ్యాప్తంగా సంక్షోభాన్ని సృష్టించింది. పెద్దఎత్తున ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసినప్పటికీ వాటిసమాచారం సదరు ప్యాసింజర్స్ కి చేరవేయకపోవడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకొని తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలోనూ ఇండిగో ఘోరంగా విఫలమైంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం సీరియస్ అయ్యారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని విమానయాన సంస్థలతో పాటు డీజీసీఏకు పార్లమెంటరీ కమిటీ త్వరలో సమన్లు జారీ చేయనుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేవలం వివరణ అడగడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఏటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని పరిశీలించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
కమిటీ మెంబర్ మాట్లాడుతూ "భారత విమానయాన చరిత్రలో ప్రస్తుతం విపరీత పరిస్థితులు నెలకున్నాయి. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ జరగలేదు. ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏమిటో ఎయిర్ లైన్స్ తో పాటు రెగ్యులెటరీ అథారిటీ తెలపాలి. వాటిని ఎదుర్కొవడంలో వారు ఎందుకు విఫలమయ్యారో వివరించాలి" అని అన్నారు.
అదే విధంగా ప్రస్తుతం జరిగిన సంఘటన విమానయాన రంగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతుందని సిబ్బంది కొరత, నిర్వహణలో ఒత్తిడి, రెగ్యులెటరీ వ్యవస్థల మధ్య గ్యాప్ తదితర అంశాలను సూచిస్తుందని తెలిపారు. అంతేకాకుండా విమానాలు రద్దయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే ఇతర విమానాయాన సంస్థలు ఇదే అదనుగా భావించి టికెట్ ధరలను విపరీతంగా పెంచాయని ఈ అంశాలన్నింటినీ పార్లమెంటరీ కమిటీ చర్చిస్తుందని కమిటీ సభ్యుడు తెలిపారు. జేడీయూ నేత సంజయ్ కుమార్ జా ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.


