అనుమతిలేని ఏ ప్రాసిక్యూషన్ నిలబడదు

మద్రాస్ హైకోర్టు


 చెన్నై: నేరశిక్షా స్మృతిలో నిర్దేశించినట్లు తగిన అనుమతి తీసుకోకుండా, ప్రభుత్వ ఉద్యోగిపై ప్రారంభించే ఏ ప్రాసిక్యూషన్ చర్యా నిలబడదని మద్రాస్ హైకోర్టు శనివారం స్పష్టం చేసింది. తమిళనాడులోని వేలూరుకు చెందిన డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ కే మస్తాన్ రావు సహా, దక్షిణ రైల్వే అధికారులు కొందరిపై వేలూరుకే చెందిన ఫ్యాక్టరీల విభాగం ఇనస్పెక్టర్ దాఖలు చేసిన ఫిర్యాదును మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం కొట్టివేశారు. నేరశిక్షా స్మృతిలోని 197వ సెక్షన్ ప్రకారం తగిన అనుమతి తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా చేపట్టే ప్రాసిక్యూషన్ నిలువదని సుప్రీంకోర్టు పేర్కొందని, సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు సదరు ప్రాసిక్యూషన్ ప్రక్రియను కొట్టివేయవలసి ఉంటుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని అరక్కోణం రైల్వే ఇంజినీరింగ్ వర్క్‌షాప్‌లో, అగ్నిప్రమాద నిరోధక నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ అక్కడి అధికారులపై వేలూరు ఫ్యాక్టరీల విభాగం ఇనస్పెక్టర్ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే, చట్టప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకుండా కేంద్రప్రభుత్వ ఉద్యోగులైన తమపై ఫిర్యాదు చేయడాన్ని ప్రశ్నిస్తూ రైల్వే అధికారులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విషయంలో ఫిర్యాదీదారు వివేచనతో వ్యవహరించలేదని, లోపాలను సరిచేసుకునే అవకాశాన్ని అధికారులకు ఇవ్వలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. పైగా ప్రాసిక్యూషన్ తప్పదన్న బెదిరింపుతో వారికి నోటీసులు జారీ చేశారని, ఈ కారణంతోనే ఫిర్యాదును కొట్టివేయవచ్చని న్యాయమూర్తి స్పష్టంచేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top