దిగ్గజ బ్యాంకుల రుణ వడ్డీరేట్ల కోత | Sakshi
Sakshi News home page

దిగ్గజ బ్యాంకుల రుణ వడ్డీరేట్ల కోత

Published Sat, Oct 29 2016 3:06 PM

దిగ్గజ బ్యాంకుల రుణ వడ్డీరేట్ల కోత

ముంబై:  దేశంలోని టాప్ బ్యాంక్ లు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ, కార్పొరేషన్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం తీసుకున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) మార్గదర్శకాల మేరకు  వినియోగదారులకు రుణ వడ్డీ రేట్లలో కోత పెట్టాయి.  దీంతో గృహ రుణాలను మరింత చౌకగా  అందుబాటులోకి తీసుకొచ్చి  దీపావళి సందర్బంగా ప్రజలకు తీపి కబురు అందించాయి.  ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌  ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)వార్షిక లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.15 శాతం  తగ్గించింది. అలాగే అతిపెద్ద ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ 0.10 శాతం తగ్గింపును  ప్రకటించింది. కార్పొరేషన్‌ బ్యాంక్‌ కూడా ఎంసీఎల్‌ఆర్‌ రేటును 0.05 శాతం తగ్గించింది. ఇప్పటివరకు 9.50 శాతంగా ఉన్నవార్షిక రుణవడ్డీరేట్లను 9.45 కు తగ్గిస్తున్నట్టు  ప్రకటించింది. ఈ సవరించిన కొత్త రేట్లు నవంబర్‌1 నుంచీ అమల్లోకి రానున్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు శనివారం  ప్రకటించాయి. ఆర్థిక సంవత్సరం రెండో సగంలో కీలకమైన "బిజీ సీజన్"  దృష్టిలో పెట్టుకుని రుణగ్రహీతలకు తగ్గింపు రేట్లు అందుబాటులోకి తేవడం, తద్వారా ఆర్థికవృద్ధి కొంత ఊతమిచ్చే దిశగా  ఈ నిర్ణయం తీసుకున్నాయి.

సవరించిన రేట్ల ప్రకారం స్టేట్‌బ్యాంక్‌ గృహ రుణాల వడ్డీ రేటు 8.90 శాతానికి చేరనుండగా, ఐసీఐసీఐ రేటు 8.95 శాతంగా ఉండనుంది.  దేశ బ్యాంకింగ్‌ రంగంలో ఈ రెండూ అగ్రస్థానాల్లో ఉండటంతో అత్యధిక శాతం మంది ఖాతాదారులు లబ్ది పొందనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, ఇకపై వడ్డీ రేట్ల తగ్గింపునకు ఇవి మార్గం చూపగలవని బ్యాంకింగ్‌ వర్గాలు వ్యాఖ్యానించాయి.
అయితే రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గత కొంతకాలంగా రుణ రేట్లను తగ్గించాల్సిందిగా దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థకు సూచిస్తూ వస్తోంది. ఈమేరకు ఇటీవల ప్రవేశపెట్టి ఎంసీఎల్ ఆర్ పద్ధతి తరువాత  కూడా బ్యాంకులు సరిగా స్పందించకపోవడం  అసంతృప్తిని కూడా వ్యక్తం చేసింది.   అంతేకాదు ఈ నేపథ్యంలోనే తన వంతుగా రెపో రేటులో కోతపెడుతూ వచ్చింది కూడా. జనవరి 2015 నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఇటీవలి తగ్గింపుతో  సహా 175 బేసిస్ పాయింట్ల  రెపో రేటు తగ్గించగా,  ఇది 2011 తరువాత కనిష్ట రేటుగా నమోదైంది.  కాగా బ్యాంకులు కేవలం 60  బేస్ రేట్లు కోత పెట్టిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement