
ధోనీ ‘టీ20’ స్టామినాపై గంగూలీ డౌట్స్!
టాప్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
టాప్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ వన్డే క్రికెట్‌లో మాత్రమే చాంపియన్ అని, కానీ, టీ20లో అతను ఏమాత్రం రాణించగలడు అన్నది సందేహాస్పదమేనని చెప్పాడు.
’ధోనీ మంచి టీ20 ఆటగాడు అని నేను కచ్చితంగా చెప్పలేను. అతను వన్డే క్రికెట్‌లో చాంపియన్. కానీ, ట్వంటీ-20 క్రికెట్‌కు వచ్చేవరకు అతను గత పదేళ్లలో ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. అతనికి గొప్ప రికార్డు లేదు’ అని గంగూలీ ‘ఇండియాటుడే’తో అన్నాడు.
టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న మహేంద్రసింగ్ ధోనీని ఐపీఎల్‌లోనూ సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతను ఇప్పుడు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్టులో మామూలు ఆటగాడిలా ఆడుతున్నాడు. అయినా, ఇప్పటివరకు ధోనీ అంచనాల మేరకు రాణించలేదు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో 12 (నాటౌట్), 5, 11 పరుగులు మాత్రమే చేశాడు. అతను అంచనాల మేరకు రాణించకపోవడంతో జట్టు యాజమాన్యం నుంచి విమర్శలు సైతం ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీపై గంగూలీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. త్వరలో జరగనున్న చాంపియన్స్ ట్రోపీకి ధోనీని జట్టులోకి తీసుకుంటామని, కానీ అతను పరుగులు చేయాల్సి ఉంటుందని గంగూలీ అన్నాడు.