పాకిస్థాన్‌ జాతిపిత విషాద ప్రేమగాథ

మీసాలు తీసేస్తేనే మ్యారేజ్‌..


-మహ్మద్‌ ఆలీ జిన్నాకు ప్రి‍యురాలి కండిషన్‌

-సీనియర్‌ జర్నలిస్ట్‌ షీలా రెడ్డి రాసిన పుస్తకంలో ఆసక్తికర అంశాలు




న్యూఢిల్లీ:
‘పాకిస్తాన్‌ జాతిపిత మహ్మద్‌ ఆలీ జిన్నా 40వ ఏట.. ఓ టీనేజ్‌ యువతిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ యువతి జిన్నాకు ఒక కండిషన్‌ పెట్టింది. మీసాలు తీస్తేనే మ్యారేజ్‌ అని చెప్పింది. ఇందుకు అంగీకరించిన జిన్నా మీసాలు తీయడమే కాదు. తన హెయిర్‌స్టయిల్‌ కూడా మార్చేసుకున్నారు..’ జిన్నాకు సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను సీనియర్‌ జర్నలిస్ట్‌ షీలా రెడ్డి రచించిన ‘‘మిస్టర్‌ అండ్‌ మిస్ట్రెస్‌ జిన్నా- ది మ్యారేజ్‌ దట్‌ షుక్‌ ఇండియా’’ పుస్తకంలో వెల్లడించారు.



ఆ పార్సీ యువతి రుట్టీ పెటిట్‌ను జిన్నా పెళ్లి చేసుకోవడంలో ట్విస్ట్‌లను వివరించారు. ఒకానొక సందర్భంలో పెటిట్‌ తండ్రి దిన్షా మానెక్‌జీ పెటిట్‌తో మాటల సందర్భంగా.. మతాంతర వివాహాలపై మీ అభిప్రాయం ఏమిటని జిన్నా ప్రశ్నించారట. దానికి మానెక్‌జీ స్పందిస్తూ.. ఇది దేశ సమగ్రతకు ఎంతో సహకరిస్తుందని చెప్పారట. అప్పుడు జిన్నా.. అయితే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా’నని చెప్పారట. దాంతో ఆగ్రహించిన మానెక్‌జీ జిన్నాను బయటకు గెంటివేసి.. మళ్లీ జిన్నాతో మాట్లాడకపోయిన అంశాన్ని షీలా తన పుస్తకంలో ఆసక్తికరంగా మలిచారు.





రుట్టీకి 18 ఏళ్లు నిండిన తర్వాత ముంబైలోని జిన్నా హౌస్‌లో 1918లో ఆమెను జిన్నా పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి ఆమె తరఫు బంధువులెవరూ హాజరుకాలేదు. పెళ్లి తర్వాత ఇస్లాంలోకి మారిన రుట్టీ తన పేరును మరియం కింద మార్చుకున్నారని షీలా రెడ్డి వివరించారు. ఈ లవ్‌ స్టోరీలో విషాదం ఏంటంటే.. 1929లో రుట్టీ కేన్సర్‌తో మరణించారు. దేశ విభజన తర్వాత  భారత్‌ను వీడి పాక్‌కు తరలిపోయే సమయంలో జిన్నా.. రుట్టీ సమాధిని దర్శించి వెళ్లారని షీలా తెలిపారు.



ఈ పుస్తకాన్ని రాయడానికి గల కారణాలను కూడా షీలా వివరించారు. నెహ్రూ మెమోరియల్‌ లైబ్రరీలో ఖాళీ సమయంలో రుట్టీ.. సరోజినీ నాయుడు కుమార్తెలకు రాసిన లేఖలను పరిశీలించిన తర్వాత పుస్తకం రాసే నిర్ణయాని వచ్చానని పేర్కొన్నారు. దాని గురించి పాక్‌లో కూడా పర్యటన, అక్కడి జిన్నా ఫ్యామిలీ తిరస్కరించిన వైనాన్ని షీలా వివరించారు. జిన్నా ముంబైలోనే ఎక్కువ కాలం ఉండటంతో మళ్లీ ముంబై వచ్చి అక్కడ లభించిన సమాచారంతో జిన్నా జీవితంపై ఈ పుస్తకాన్ని షీలా వెలువరించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top