ఇంధన వనరుల సంస్థ (టెరి) మాజీ డైరెక్టర్ ఆర్కే పచౌరిపై లైంగిక వేధింపుల కేసు నమోదుచేసిన మహిళా పరిశోధక నిపుణురాలు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు
న్యూఢిల్లీ: ఇంధన వనరుల సంస్థ (టెరి) మాజీ డైరెక్టర్ ఆర్కే పచౌరిపై లైంగిక వేధింపుల కేసు నమోదుచేసిన మహిళా పరిశోధక నిపుణురాలు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. టెరి సంస్థ తనపట్ల అత్యంత ఘోరంగా ప్రవర్తించిందని, అందుకే సంస్థకు రాజీనామా చేస్తున్నానని 29 ఏళ్ల ఆమె రాజీనామా లేఖలో తెలిపారు. ఒక ఉద్యోగిగా తన ప్రయోజనాలకు టెరి మద్దతుగా నిలువలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
టెరి డైరెక్టర్‌గా ఆర్కే పచౌరి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గత ఫిబ్రవరి 13న ఆమె ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 354, 354 (ఏ), 354 (డీ) (వేధింపులు), 506 (క్రిమినల్ బెదిరింపులు) కింద అభియోగాలు మోపారు. దీంతో ఆర్కే పచౌరిని తొలగించి.. ఆయన స్థానంలో డాక్టర్ అజయ్ మధుర్‌ను సంస్థ డైరెక్టర్ జనరల్‌గా టెరి గవర్నర్ కౌన్సిల్ నియమించింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆర్కే పచౌరి ఐక్యరాజ్యసమితికి చెందిన ఐపీసీసీ నుంచి, వాతావరణ మార్పులపై ప్రధానమంత్రి మండలి నుంచి వైదొలిగారు.