‘కార్గిల్’ వీరులకు సెల్యూట్ | Sakshi
Sakshi News home page

‘కార్గిల్’ వీరులకు సెల్యూట్

Published Sun, Jul 27 2014 12:55 AM

‘కార్గిల్’ వీరులకు సెల్యూట్

న్యూఢిల్లీ: ‘విజయ్ దివస్’ సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ‘మన సైనిక దళాల అజేయ, అద్భుత ధైర్య సాహసాలు, వారి త్యాగ నిరతిని ఈ విజయ్ దివస్ సందర్భంగా గుర్తు చేసుకుందాం. దేశం ఆ సాహస అమరవీరులకు సెల్యూట్ చేస్తోంది’ అని శనివారం మోడీ ట్వీట్ చేశారు. 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ గెలుపును పురస్కరించుకుని ఏటా జూలై 26వ తేదీని విజయ్ దివస్‌గా జరుపుకుంటారు.
 
 ఢిల్లీలో త్వరలో అమరవీరులకు స్మారక స్తూపం: జైట్లీ


 కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు స్థారక స్తూపాన్ని నిర్మించేందుకు  దేశ రాజధానిలో స్థలాన్ని త్వరలో ఖరారు చేస్తామని శనివారం రక్షణశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియా గేట్ సమీపంలోని విశాలమైన ప్రిన్సెస్ పార్క్, ఆ పరిసర ప్రాంతాలే దీనికి అనువైనవని భావిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో  త్రివిధ దళాధిపతులతో కలసి ప్రిన్సెస్ పార్క్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. స్మారక స్తూపంపై అమరవీరుల పేర్లను పొందుపరుస్తామన్నారు. దీని నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. సాయుధ బలగాల ఆధునీకరణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.


 

Advertisement
Advertisement