శత్రు పీచమణచే రుద్ర! | Army Chief announces Rudra brigade, Bhairav battalion on 26th Kargil Vijay Diwas | Sakshi
Sakshi News home page

శత్రు పీచమణచే రుద్ర!

Jul 27 2025 5:19 AM | Updated on Jul 27 2025 5:19 AM

Army Chief announces Rudra brigade, Bhairav battalion on 26th Kargil Vijay Diwas

సరికొత్త స్పెషల్‌ ఫోర్స్‌ బ్రిగేడ్‌ 

భైరవ్‌ బెటాలియన్‌ సైతం.. 

అతి శక్తిమంతమైన సైనిక విభాగాలు 

కేంద్రం పచ్చజెండా: ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది ప్రకటన

ద్రాస్‌(కార్గిల్‌): మన సైన్యం మరింత శక్తిసామర్థ్యాలు సంతరించుకోబోతోంది. బహుముఖ అవసరాలను తీర్చేలా అత్యాధునిక పూర్తిస్థాయి సాయుధ దళా (బ్రిగేడ్‌) లను ఏర్పాటు చేసుకోనుంది. ఈ స్పెషల్‌ ఫోర్స్‌ యూనిట్లకు ‘రుద్ర’గా నామకరణం చేసినట్టు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. అలాగే సరిహద్దుల వద్ద  శత్రువులకు కోలుకోలేని షాకిచ్చే ‘భైరవ్‌’లైట్‌ కమెండో బెటాలియన్లు కూడా రానున్నట్టు తెలిపారు.

 కార్గిల్‌ యుద్ధంలో పాక్‌ పీచమణచిన చరిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా జరుపుకుంటున్న విజయ్‌ దివస్‌కు 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ద్రాస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ‘‘భావి అవసరాలకు దీటుగా ఎదిగే తిరుగులేని శక్తిగా సైన్యం బలోపేతం అవుతోంది. రుద్ర బ్రిగేడ్ల ఏర్పాటు అందులో భాగమే’’అని తెలిపారు. ఇందుకు శుక్రవారమే కేంద్రం నుంచి అనుమతులు లభించినట్టు వెల్లడించారు. ‘‘అలాగే ప్రతి పదాతి బెటాలియన్‌లోనూ డ్రోన్‌ ప్లటూన్లు ఏర్పాటు కానున్నాయి. 

ఆర్టీలరీ విభాగాల విధ్వంసక శక్తిని ‘దివ్యాస్త్ర’, లాయిటర్‌ మ్యునిషన్‌ బ్యాటరీలతో మరింతగా బలోపేతం చేశాం. పూర్తిగా దేశీయంగా తయారు చేసిన గగనతల రక్షణ వ్యవస్థలతో వాయుసేనను దురి్నరీక్ష్యంగా తీర్చిదిద్దుతున్నాం. ఇది మన సైనిక పాటవాన్ని చెప్పలేనంతగా పెంచేస్తోంది’’అని పేర్కొన్నారు. 1999లో కిరాయి మూకల ముసుగులో పాక్‌ సైన్యం కశ్మీర్‌లో సరిహద్దుల గుండా చొచ్చుకొచ్చి మన భూభాగంలో పాగా వేయడం తెలిసిందే. మంచుకొండల్లోని తోలోలింగ్, టైగర్‌హిల్స్‌ వంటి శిఖరాలపై అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో మూడు నెలల పాటు జరిపిన ముమ్మర పోరులో పాక్‌ మూకలను మన సైన్యం తిప్పికొట్టడం తెలిసిందే. అందుకు గుర్తుగా ఏటా జూలై 26న విజయ్‌ దివస్‌ జరుపుకుంటూ వస్తున్నాం. 

ఏమిటీ ‘రుద్ర’? 
ఆర్మీ చీఫ్‌ ప్రకటించిన రుద్ర బ్రిగేడ్‌ అత్యాధునిక యుద్ధ విభాగం (బ్రిగేడ్‌). దీని విశేషాలు అన్నీ 
ఇన్నీ కావు... 
→ ఇది త్రివిధ దళాలతో కూడిన బ్రిగేడ్‌ 
→ ఇందులో పదాతి, సాయుధ విభాగాలు, ఆర్టిలరీ, స్పెషల్‌ ఫోర్సెస్, మానవ రహిత యుద్ధ విమాన వ్యవస్థలు తదితరాలు ఉంటాయి. 
→ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సాయుధ, మద్దతు వ్యవస్థలు వీటికి వెన్నుదన్నుగా నిలుస్తాయి.  
→ రెండు సైనిక పదాతి దళ విభాగాలను ఇప్పటికే రుద్ర బ్రిగేడ్లుగా ఆధునీకరించారు. మరిన్ని బ్రిగేడ్ల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. 
→ ఇప్పటిదాకా సైనిక బ్రిగేడ్లు ఏక తరహా వ్యక్తిగత ఆయుధాలతో కూడినవిగా మాత్రమే ఉన్నాయి.

కార్గిల్‌ వీరగాథలు విన్పించే ‘ఇ–శ్రద్ధాంజలి’ యాప్‌
 బతాలిక్‌ సెక్టర్‌లో ఇండస్‌ వ్యూ పాయింట్‌  
కార్గిల్‌ వీరుల గౌరవార్థం మూడు ప్రాజెక్టులు 
కార్గిల్‌ యుద్ధ అమరవీరులను గౌరవార్థం మూడు కొత్త ప్రాజెక్టులను ఆర్మీ చీఫ్‌ ప్రకటించారు. ‘ఇ–శ్రద్ధాంజలి’పేరుతో డిజిటల్‌ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశారు. దీని ద్వారా కార్గిల్‌ వీరులకు పౌరులు శ్రద్ధాంజలి తెలపవచ్చు. అలాగే ఓ ఈ క్యూఆర్‌ ఆధారిత ఆడియో గేట్‌వే యాప్‌ కూడా రూపొందించారు. ఇది కార్గిల్‌ యుద్ధానికి సంబంధించిన రోమాంఛిత గాథలను వినిపిస్తుంది. దీన్ని అమరవీరులకు అంకితమిచ్చారు. 

అలాగే నియంత్రణ రేఖ సమీపంలోని బతాలిక్‌ సెక్టర్‌ను సందర్శించే వారి కోసం వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఇది కార్గిల్, ఇండస్‌ లేహ్, బల్టిస్తాన్‌ మధ్య భాగంలో 10 వేల అడుగుల ఎత్తున ఉండే కీలక వ్యూహాత్మక పాయింట్‌. అక్కడ విధులు నిర్వహించే సైనికుల జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసి అర్థం చేసుకునేందుకు ఈ వ్యూ పాయింట్‌ వీలు కలి్పస్తుంది. ‘‘ఇది మ్యూజియంల వంటి కాన్సెప్టు. ఇయర్‌ఫోన్స్‌ ద్వారా ఆడియో ద్వారా కార్గిల్‌ యుద్ధ విశేషాలను వినవచ్చు. మన సైనికుల శౌర్యం, ధైర్యస్థైర్యాలు, త్యాగాలను తెలుసుకుని పొంగిపోవచ్చు’’అని సైనికాధికారి ఒకరు వివరించారు.

ఉగ్ర భూతాన్ని సహించేదే లేదు 
‘సిందూర్‌’తో పాక్‌కు హెచ్చరిక
దాయాదికి ఆర్మీ చీఫ్‌ చురకలు

‘‘ఉగ్ర భూతానికి దన్నుగా నిలిచే దుష్టశక్తులను భారత్‌ ఏ మాత్రమూ సహించే ప్రసక్తే లేదు. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా మన త్రివిధ దళాలు తిరుగులేని సమన్వయంతో జరిపిన పెను దాడులు పాకిస్తాన్‌కు పంపిన తిరుగులేని హెచ్చరిక సంకేతాలవే. అంతమాత్రమే కాదు, దేశం హృదయానికి తీరని గాయం చేసిన పహల్గాం ఉగ్ర దాడికి మన సమష్టి ప్రతిస్పందన కూడా. గత ఉగ్ర దాడుల మాదిరిగా ఈసారి మన దేశం కేవలం శోకించి సరిపెట్టుకోలేదు. అలాంటి ఘాతుకాలకు మన స్పందన నిర్ణయాత్మకంగా, ప్రత్యర్థి కోలుకోలేని రీతిలో ఉంటుందని నిరూపించాం. 

తద్వారా అలాంటి మతిలేని ఉగ్రోన్మాదానికి, దానికి దన్నుగా నిలిచే ధూర్త దేశాలకు మన స్పందన విషయంలో సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించాం’’అని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది అన్నారు. 1999లో కార్గిల్‌ యుద్ధంలో పాక్‌పై మన విజయానికి ప్రతీకగా జరుపుకుంటున్న విజయ్‌ దివస్‌కు శనివారంతో 26 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని ద్రాస్‌లో కార్గిల్‌ యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. అక్కడి సైనిక సిబ్బంది తదితరులను ఉద్దేశించి మాట్లాడారు. 

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మే 7న పర్యాటకులపై పాక్‌ ప్రేరేపిత జైషే ఉగ్ర సంస్థకు చెందిన ముష్కరులు విచక్షణారహిత కాల్పులకు తెగబడి 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. అందుకు ప్రతిగా ఆపరేషన్‌ సైన్యంపై దేశ ప్రజలు చూపిన తిరుగులేని విశ్వాసం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ వల్లే ఉన్మాదానికి తిరుగులేని రీతిలో సమాధానం చెప్పగలిగాం. మన దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి, ప్రజలకు హాని తలపెట్టే ముష్కర శక్తులకు తగిన సమాధానం ఇస్తామని నిరూపించాం’’అని ప్రకటించారు. 

సిందూర్‌ ఆపరేషన్‌లో పాక్‌ గడ్డపై స్వేచ్ఛగా చెలరేగుతున్న 9 మంది అత్యున్నత స్థాయి ఉగ్రవాదులను మట్టుబెట్టిందని గుర్తు చేశారు. మనకు అణుమాత్రం కూడా నష్టం కలగకుండా పని పూర్తి చేశామన్నారు. ‘‘పీఓకే, పాక్‌లోని ఉగ్ర స్థావరాలను అత్యంత కచి్చతత్వంతో నేలమట్టం చేశాం. తద్వారా దాయాదిపై నిర్ణాయక విజయం సాధించాం. వాటిపై మన బాంబు, క్షిపణి దాడులను అడ్డుకునేందుకు పాక్‌ చేసిన ప్రయత్నాలను పూర్తిస్థాయిలో అడ్డుకున్నాం. 

ప్రతిగా మే 8, 9 తేదీల్లో పాక్‌ సైన్యం మన సైనిక స్థావరాలు, పౌర ఆవాసాలపై తలపెట్టిన దాడులకు మర్చిపోలేని రీతిలో బదులిచ్చాం. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనేలా చూసేందుకు ప్రయత్నం చేశాం. కానీ పాక్‌ మాత్రం ఎప్పట్లాగే ఉగ్ర మూకలను ప్రేరేపించడం ద్వారా మరోసారి పిరికిపంద చర్యకు దిగింది. మన గగనతల రక్షణ వ్యవస్థ దుర్భేద్యమైన కవచంలా నిలిచి కాపాడింది. ఒక్క క్షిపణి, డ్రోన్‌ కూడా సరిహద్దులు దాటి చొచ్చుకురాకుండా అడ్డుకుంది’’అని ఆర్మీ చీఫ్‌ గుర్తు చేశారు. భారత సైన్యం ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా ఎదుగుతోందన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement