వేడి.. ఒత్తి‘ఢీ’! | Excessive Heat Eroding Livability | Sakshi
Sakshi News home page

వేడి.. ఒత్తి‘ఢీ’!

Mar 21 2026 5:30 AM | Updated on Mar 21 2026 5:30 AM

Excessive Heat Eroding Livability

‘జీవనయోగ్యత’ను హరిస్తున్న అధిక వేడి 

ఆరుబయట సురక్షితంగా రోజువారీ పనులను చేసుకునే సౌలభ్యం తగ్గిపోతోంది 

ప్రపంచ దేశాలతో పోల్చితే భారతీయులకే అత్యధిక నష్టం  

గత 75 ఏళ్లలో భారతీయ వృద్ధులు లక్ష కోట్ల గంటలు,యువత 10 వేల కోట్ల గంటలపాటు వేడి బాధలు పడ్డారు 

అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఆరుబయట శరీరాన్ని ఒక మోస్తరుగా కదిలించే చిన్నా చితకా పనులు చెయ్యడం, నడక వంటి వ్యాపకాలు ఆరోగ్యదాయకమని అందరికీ తెలిసిందే. ఈ జీవనయోగ్యతకు అధిక వేడి విఘాతం కలిగిస్తోంది. ఎంత సమయం మేరకు ఇలా హరించుకుపోతోందో అమెరికా పరిశోధకులు తాజాగా లెక్కగట్టారు. వృద్ధులే కాకుండా యువత కూడా బోల్డన్ని ‘జీవనయోగ్యమైన గంటల’సమయాన్ని కోల్పోతున్నారో శాస్త్రీయంగా పరిశోధించారు. మిగతా దేశాల్లో కన్నా మన దేశంలోనే జీవనయోగ్యత తగ్గిపోతోందంటున్నారు. 

భూమి వేడెక్కుతున్న కొద్దీ, తీవ్రమైన వేడి మానవ ఆరోగ్యానికి, ముఖ్యంగా వృద్ధులకు, పేద ప్రజలకు తీవ్రమైన ముప్పుగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న వేడితో జీవన సౌలభ్యం తగ్గిపోతోంది. మానవుల పనుల వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల జీవనానందాన్ని హరిస్తున్నాయి. అమెరికా నిపుణుల తాజా అధ్యయనంలో ఆశ్చర్యకరమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్‌ ల్యూక్‌ అలెగ్జాండర్‌ పార్సన్స్‌ నేతృత్వంలో పలు అమెరికా విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. 

‘ఎన్విరాన్‌మెంటల్‌ రీసెర్చ్‌:హెల్త్‌ జర్నల్‌’లో ఇటీవల ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. నడవడం లేదా రోజువారీ తేలికపాటి ఇంటి పనులను సురక్షితంగా చేసుకునే సామర్థ్యాన్ని వేడి ఎలా ప్రభావితం చేస్తున్నదో అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గంటల వారీ ఉష్ణోగ్రత, తేమకు సంబంధించిన డేటాను (1950–2024) విశ్లేషించారు. ఆరోగ్యవంతులైన యువకులు (18–40 సంవత్సరాలు), వృద్ధుల(65 ఏళ్లు పైబడినవారు) పై దృష్టి కేంద్రీకరించారు.  

‘జీవనయోగ్యత’అంటే?
ప్రజలు వేడి వలన శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరంగా పెరగకుండా.. తేలికపాటి నుంచి ఒక మోస్తరు శారీరక శ్రమను కలిగించే రోజువారీ (కూర్చోవడం, నడవడం, తేలికపాటి ఇంటిపనులు) పనులను సుర­క్షితంగా, సౌకర్యవంతంగా చెయ్యగలిగే సానుకూల వాతావరణ పరిస్థి­తు­లను ‘జీవనయోగ్యమైన’(లివబుల్‌) కాలంగా చెప్పు­కోవ­చ్చు. అయి­తే, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఈ సౌలభ్యం తగ్గిపోతోంది. అనుదినం విలువైన ‘జీవనయోగ్యమైన సమయం’అంతకంతకూ తగ్గిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ నానాటికీ ఇది కుంచించుకోపోతోందని అధ్యయనంలో వెల్లడైంది.  

ఉద్గారాలు తగ్గించాల్సిందే..
జనసాంద్రత ఎక్కువగా ఉండే దేశాల్లో, ముఖ్యంగా మన దేశంలో, ప్రజలకు వేడి బాధలు ఎక్కువని కూడా ఈ అధ్యయనం తేల్చింది. భారతీయ యువత 10 వేల కోట్ల గంటలు, వృద్ధులు లక్ష కోట్ల గంటలకు పైగా హాయిగా గడిపే ‘జీవనయోగ్యమైన’సమయాన్ని కోల్పోయారని చెబుతోంది. వేడి ఒత్తిడిని తట్టుకోవటంలో వృద్ధులకు తక్కువ సామర్థ్యం ఉంటుంది కాబట్టి వీరికి ఎక్కువ గంటలు అసౌకర్యం కలుగుతోందని గుర్తించారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, వేడిని తట్టుకోవటానికి మరింత గట్టి చర్యలు తీసుకోకపోతే, ఈ ముప్పు మరింతగా పెరుగుతూనే ఉంటుందని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది.

వృద్ధుల్లో 78%,యువతలో 35% బాధితులు
గత 75 సంవత్సరాలుగా వేడి ప్రాంతాలలో ప్రజలు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఆరుబ­యట గడపగలిగే గంటల సంఖ్య తగ్గిపోయిందని, తద్వారా జీవనయోగ్యత కూడా తగ్గిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో, అల్పా­దాయ ప్రాంతాల్లో ప్రజలు చాలా వేడి సమ­యా­న్ని అనుభవిస్తున్నారు. ప్రతి సంవత్సరం వందల నుంచి వేల గంటలను వేడి వాతావరణంలో గడు­పు­తున్నారు. 

వృద్ధులు ముఖ్యంగా ప్రమాదంలో ఉన్నారు. కొన్ని నివాస ప్రాంతాల్లో సంవత్సరానికి 3,000 గంటల వరకు సురక్షితం కాని స్థాయి­లో వేడి ఒత్తిడిని అనుభవిస్తున్నారు. కలిగిన కుటుంబా­ల్లోని వృద్ధులు నీడ పట్టున లేదా ఏసీ గదుల్లో గడుపుతుంటే.. పేద వృద్ధులు బయట పనులు ఎక్కువ సేపు చెయ్యలేక తక్కువ సంపాదనతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

వృద్ధులకే ఎక్కువ ఇబ్బంది 
వృద్ధులకు వేడి వలన కలిగే ఇబ్బంది యువతతో పోల్చితే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఏటా సగటున 900 గంటల పాటు వీరు వేడి వల్ల తీవ్ర అసౌకర్యంగా జీవిస్తున్నారు. 1950లలో ఇది సంవత్సరానికి 600 గంటలే. దీని అర్థం ఏమంటే, సంవత్సరంలో సుమారు 10 శాతం కాలం పాటు, తీవ్రమైన వేడి కారణంగా వృద్ధులు ఆరుబయట తేలికపాటి పనులు చేయటం కూడా సురక్షితం కాదు. 

ఆ మేరకు వారు ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం పెరుగుతుంది. ఒకే రకమైన పరిసర ఉష్ణోగ్రత, తేమ ఉన్నప్పటికీ యుక్తవయసు్కల శరీరాలు చెమటను విడుదల చేయడం ద్వారా తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడం లేదా చల్లబరచుకోవడం జరుగుతుంది. అయితే, వృద్ధుల శరీరాలు ఈ పనిని అంత సమర్థవంతంగా చేయలేవని పరిశోధకులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement