వృద్ధాప్యం భారం కాకూడదు: రోశయ్య | roshaiha comments on old age | Sakshi
Sakshi News home page

వృద్ధాప్యం భారం కాకూడదు: రోశయ్య

Oct 16 2016 7:46 PM | Updated on Sep 4 2017 5:25 PM

వృద్ధాప్యం భారం కాకూడదు: రోశయ్య

వృద్ధాప్యం భారం కాకూడదు: రోశయ్య

పెద్దలను, తల్లిదండ్రులను ప్రేమించని వారు సమాజాన్ని ప్రేమించలేరని కొణిజేటి రోశయ్య అన్నారు.

నాగోలు: పెద్దలను, తల్లిదండ్రులను ప్రేమించని వారు సమాజాన్ని ప్రేమించలేరని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. వృద్ధాప్యం ఎవరికీ భారం కావొద్దని పేర్కొన్నారు. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రా, తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా ఆధ్వర్యంలో ఆదివారం ఎల్‌బీనగర్ నాగోలులో 264 జంటలకు సామూహిక షష్టిపూర్తి మహోత్సవం, వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోశయ్య మాట్లాడుతూ 60 సంవత్సరాల షష్టిపూర్తి చేసుకున్న వారు వంద సంవత్సరాలు హాయిగా జీవించాలని ఆకాంక్షించారు. ఇంత పెద్ద ఎత్తున సామూహిక షష్టిపూర్తి మహోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిలు మాట్లాడుతూ వైశ్యులు సేవారంగంలో ఎప్పుడూ ముందుంటారని, గ్రామాలలో ఏ ఒక్కరికీ ఇబ్బందులు వచ్చినా మొదటగా వెళ్లేది వైశ్యుల దగ్గరికేనని అన్నారు. ప్రభుత్వం తరపున వైశ్యులకు సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు. రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వృద్ధులు సమాజ దిక్సూచిలాంటి వారని, వారి దగ్గరి నుంచి సలహాలు తీసుకుని ముందుకు సాగాలన్నారు. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డ వైశ్యులను అంతా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు.

264 మంది జంటలు షష్టిపూర్తి మహోత్సవంలో పాల్గొనగా, 21 మంది అనాథ జంటలకు కూడా ఈ ఉత్సవంలో అవకాశం కల్పించారు. అనంతరం తులాభారం నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. 264 మందికి ఒకేసారి షష్టిపూర్తి నిర్వహించడంతో ఇంటర్నేషనల్ వరల్డ్‌ బుక్‌లో స్థానం లభించిందని ఆ సంస్థ ఇండియా కో ఆర్డినేటర్ బింగి నరేందర్‌గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైశ్య ఫెడరేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడు గంజి రాజమౌళిగుప్తా, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ఎంపీ మల్లారెడ్డి, నిజామాబాద్, గోషామహల్ ఎమ్మెల్యేలు గణేష్‌గుప్తా, రాజాసింగ్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement