వారికి గుడ్‌ న్యూస్‌ అందించిన రిలయన్స్‌ | Sakshi
Sakshi News home page

వారికి గుడ్‌ న్యూస్‌ అందించిన రిలయన్స్‌

Published Mon, Apr 17 2017 4:46 PM

వారికి గుడ్‌ న్యూస్‌ అందించిన రిలయన్స్‌

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన  మహిళా ఉద్యోగులకు  తీపి కబురు అందించింది. అద్దె గర్భం,దత్తత ద్వారా తల్లులయ్యే మహిళలకు వేతనంతో కూడిన 12 వారాలు సెలవుదినాలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల  పార్లమెంట్‌ ఆమోదం పొందిన ప్రసూతి ప్రయోజనాల సవరణ బిల్లు-2016 ప్రకారం  వీరికి 12 వారాల పెయిడ్‌లీవ్‌ కు  అనుమతిస్తున్నట్టు  ప్రకటించింది.  కొత్త ప్రసూతి చట్టం నిబంధనల  ప్రకారం  దీన్ని  28 రోజుల  నుంచి 12 వారాలకు  పెంచినట్టు  వెల్లడించింది. 

ఏప్రిల్‌ 1, 2017నుంచి దీన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది. అలాగే రెగ్యులర్‌ ఉ‍ద్యోగుల మెటర్నిటీ లీవ్‌ను 26 వారాలకు పొడిగించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్టు  ఉద్యోగులకు అందించిన నోటీసులో  కంపెనీ హెచ్‌ఆర్‌ ప్రతినిధి  ప్రకటించారు.  మూడు నెలల లోపు బిడ్డను దత్తత తీసుకున్న మహిళలకు కూడా ఈ నిబంధనలను వర్తింపచేయనుంది. దత్తత తేదీ నుంచి  ఈ లీవ్‌ను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. 28 రోజుల నుంచి 12 వారాలకు పెంచినట్టు ఆర్ఐఎల్ తెలిపింది. బిడ్డను దత్తత స్వీకరించిన ‍ మహిళ / సింగిల్ ఫాదర్‌కు  దత్తతు సెలవు వర్తిస్తుందని తెలిపింది.

కాగా  మెటర్నిటీ   బెనిఫిట్‌ బిల్లు 2016 ప్రకారం కనీసం 10 మంది పనిచేస్తున్న సంస్థల్లో ఈ కొత్త చట్టాన్ని అమలుచేయాల్సి ఉంటుంది. చట్ట ప్రకారం మూడు నెలల కన్నా తక్కువ వయసున్న చిన్నారిని దత్తత తీసుకునే, అద్దె గర్భం ద్వారా తల్లయ్యే మహిళలకు 12 వారాల ప్రసూతి సెలవులు ఇస్తారు. సుమారు 18 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలిగేలా పార్లమెంట్‌లో ఈ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement