Sakshi News home page

మెట్రోపాలిటన్‌ సిటీలో రూ.10కే భోజనం

Published Wed, Aug 16 2017 12:44 PM

మెట్రోపాలిటన్‌ సిటీలో రూ.10కే భోజనం

- బెంగళూరు మహానగరంలో ఇందిర క్యాంటీన్లు
- రూ.5కే అల్పాహారం..  ప్రారంభించిన రాహుల్‌ గాంధీ

బెంగళూరు:
మెట్రోపాలిటన్‌ నగరమైన బెంగళూరులో ఇక రూ.10కే భోజనం, రూ.5కు అల్పాహారం లభించనుంది. తక్కువ ధరకే పేదలకు రుచికరమైన భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘ఇందిర క్యాంటీన్‌’లను కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం ప్రారంభించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) బెంగళూరు నగరంలో మొత్తం 101 క్యాంటీన్లను నిర్మించింది. జయనగర్‌లోని కనకనపాల్య వద్ద ఏర్పాటుచేసిన క్యాంటీన్‌ను ప్రారంభించిన రాహుల్‌ వెంట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు, బెంగళూరు మేయర్‌ సహా పలువురు నేతలు ఉన్నారు. రిబ్బన్‌ కట్‌ చేసిన అనంతరం లోపలికి వెళ్లిన రాహుల్‌.. క్యాంటిన్‌లో కలియతిరిగి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.

సీఎం సిద్ధరామయ్య మార్చి నాటి బడ్జెట్‌ సమావేశాల్లో.. ఆగస్టు 15 నాటికి ఇందిర క్యాంటీన్లను ఏర్పాటుచేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఆ మేరకు బెంగళూరు సిటీలో 198 క్యాంటీన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసిన బీబీఎంపీ.. నిర్ణీత గడువులోగా 101 క్యాంటీన్లను మాత్రమే పూర్తిచేసింది. ఉదయం 7:30 నుంచి రాత్రి 7:30 వరకూ తెరిచి ఉండే ‘ఇందిర క్యాంటీన్‌’లలో రూ.5కే అల్పాహారం, రూ.10కే భోజనాన్ని అందిస్తారు. గతంలో ఉత్తరాఖండ్‌లోనూ నాటి కాంగ్రెస్‌ సీఎం హరీశ్‌ రావత్‌ ‘ఇందిర భోజనశాల’ పేరుతో ఈ తరహా క్యాంటీన్లను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.

Advertisement

What’s your opinion

Advertisement