పెదవి విప్పిన ఫవాద్ ఖాన్
ఉడీ ఘటన అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మొదటిసారి నటుడు ఫవాద్ ఖాన్ స్పందించాడు.
లాహోర్ : ఉడీ ఘటన అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మొదటిసారి పాక్ నటుడు ఫవాద్ ఖాన్ స్పందించాడు. మరింత శాంతియుత ప్రపంచాన్ని నిర్మించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. ఇద్దరు పిల్లలకు తండ్రిగా, అందరూ కోరుకుంటున్నట్టే తాను కోరుకుంటానని, మరింత శాంతియుత ప్రపంచాన్ని నిర్మించి అందులో జీవించగలగాలి అని తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నాడు. భవిష్యత్తుకు రూపమిచ్చే మన పిల్లల కోసం మనం ఈ పనిచేయగలమని విశ్వసిస్తున్నట్టు చెప్పాడు.
గత వారాలుగా సాగుతున్న విచారకర సంఘటనలపై స్పందన తెలియజేయాలని మీడియా, తన ఫ్యాన్స్ కోరుతున్నారని ఫవాద్ ఖాన్ తెలిపారు. పాక్ నటులు దేశం విడిచి వెళ్లాలని, లేదంటే తామే గెంటేస్తామంటూ మహారాష్ట్ర నవ నిర్మాణసే(ఎంఎస్ఎన్) హెచ్చరించిన నేపథ్యంలో నటుడు ఫవాద్ ఖాన్(34) భారత్ నుంచి రహస్యంగా పాక్ చేరుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పందించని ఫవాద్ ఖాన్ తాజాగా స్పందించాడు.
పాకిస్తానీ నటులపై భారత్లో నిషేధం విధిస్తున్న నేపథ్యంలో అతను దేశం విడిచి వెళ్లాడని రిపోర్టులు వచ్చాయి. కానీ తాను జూలైలోనే భారత్ విడిచి లాహోర్ కు వెళ్లానని, ఎటువంటి బెదిరింపులకు మాత్రం భయపడి వెళ్లలేదన్నాడు. తన భార్య రెండో సంతానానికి జన్మనివ్వబోతున్న క్రమంలో తాను లాహోర్ వెళ్లానని, ఈ వారం మొదట్లో భార్య సదాఫ్కు కూతురు పుట్టినట్టు ఫేస్బుక్లో తెలిపాడు. భారత్‌కు వ్యతిరేకంగా తాను మాట్లాడినట్టు వస్తున్న వార్తలను ఫవాద్ ఖండించాడు. తాను మొట్టమొదటిసారి ఈ విషయంపై స్పందిస్తున్నానని వివరించాడు. తనకు మద్దతుగా నిలిచిన తన ఫ్యాన్స్కు, పాకిస్తాన్, భారత్ వంటి ఇతర దేశాల నటులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఫేస్బుక్లో పోస్టు చేశాడు.
19 మంది జవాన్లను ఉడి ఘటనలో పాకిస్తాన్ టెర్రర్లు పొట్టనపెట్టుకోవడంపై ఫవాద్ స్పందించకపోవడంతో పలు విమర్శలను ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్ నుంచి వచ్చి భారత్ సినిమాల్లో నటిస్తున్న పాక్ నటులపై నిర్మాత మండలి గత నెల నిషేధం విధించింది. తాజాగా సల్మాన్ అగ వంటి పాకిస్తాన్ ప్రముఖ సంగీతకారులు ఉడి ఘటనను ఖండించారు. ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొన్నాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.