
మార్పునకు వారధులవ్వండి
సివిల్ సర్వెంట్లు ఎవరికి వారు కాకుండా కలసికట్టుగా పనిచేయాలని, ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధికి వారధుల్లా నిలవాలని...
ప్రయోగాలు చేయకుంటే మార్పు సాధ్యం కాదు
* ‘సివిల్ సర్వీసెస్ డే’ సదస్సులో ప్రధాని మోదీ
* అలసట వీడి ఉత్సాహంగా పనిచేయాలని అధికారులకు సూచన
న్యూఢిల్లీ: సివిల్ సర్వెంట్లు ఎవరికి వారు కాకుండా కలసికట్టుగా పనిచేయాలని, ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధికి వారధుల్లా నిలవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ‘సివిల్ సర్వీసెస్ డే’ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై పనిచేస్తూ.. ఉత్తమఫలితాలు రాబట్టేలా ప్రయోగాలు చేయాలని పిలుపునిచ్చారు.
‘మొదట్లో సివిల్ సర్వెంట్ రెగ్యులేటర్‌గా ఉండేవారు. మారుతున్న పరిస్థితులతో ఆయన ఓ నిర్వాహకుడిగా, మేనేజర్‌గా మారాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ మూడు విధులు నిర్వహించినా సరిపోవటం లేదు. వీటితోపాటు వ్యవస్థలో మార్పునకు ఓ వారథిగానూ నిలవాల్సిన అవసరం ఉంది’ అని మోదీ అన్నారు. కూర్చుని పనిచేస్తున్నపుడు ప్రయోగాలు చేయలేమని.. ప్రయోగాలు చేయకుండా మార్పు ఎలా సాధ్యమవుతుందని ప్రధాని ప్రశ్నించారు. ప్రత్యేకమైన పనులు చేయటం ద్వారా ఉద్యోగంలో సంతృప్తి కలుగుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘అలసటను దరిచేయనీయకండి. ఉత్సాహంగా ఉండండి’ అని మోదీ సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే పనులు విజయవంతమవుతాయని ప్రధాని తెలిపారు.
అనంతనాగ్‌కు స్వచ్ఛ అవార్డు
ఎప్పుడూ అనిశ్చితితో ఉండే దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాకు ప్రధాని ‘స్వచ్ఛ విద్యాలయ’ అవార్డు దక్కింది. ఈ జిల్లాలో ఉన్న 1,555 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించారు. ఏపీలోని అనంతపురం జిల్లా కూడా ఇదే కేటగిరీలో అవార్డుకు ఎంపికైంది. ప్రధాని చేతుల మీదుగా అనంతపురం జిల్లా కలెక్టర్ కె. శశిధర్ ఈ అవార్డును అందుకున్నారు. స్వచ్ఛభారత్, జన్‌ధన్ యోజన అమలుతీరు, భూసార కార్డుల పంపిణీ వంటి వివిధ అంశాల్లోనూ పురోగతి చూపిన జిల్లాల అధికారులకు ప్రధాని అవార్డులు అందజేశారు. నీటి సంరక్షణ కార్యక్రమాలకు ఉపాధిహామీ పథకం నిధులను వినియోగించుకోవాలని మోదీ సూచించారు.
‘లెఫ్ట్’ కన్నా చీకటి పాలన
బసీరత్: మమతబెనర్జీ హయాంలో పశ్చిబెంగాల్‌లో వామపక్ష కాలం కంటే చీకటి పాలనకొనసాగిందని ప్రధాని మోదీ విమర్శించారు. 24పరగణాల జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొన్నారు. ‘2011 ప్రచారంలో మమత ‘పరివర్తన్’ నినాదాన్ని ఎత్తుకుంటే మార్పు వస్తుందనుకున్నారు. కానీ.. ఆమే పూర్తిగా మారిపోయి రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చేసింది’ అని మోదీ ఎద్దేవా చేశారు.