
కొల్లు రవీంద్రకు ఛాలెంజ్ చేస్తున్నా...: పేర్ని నాని
మచిలీపట్నం శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పేర్ని నాని నిప్పులు చెరిగారు.
మచిలీపట్నం : మచిలీపట్నం శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పేర్ని నాని నిప్పులు చెరిగారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామంలో 18 మంది చనిపోవడానికి వివిధ కారణాలు తప్ప, విషజ్వరాలు కారణం కాదంటూ కొల్లి రవీంద్ర చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
కొత్తమాజేరు బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మచిలీపట్నంలోని కృష్ణాజిల్లా కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ... 'మంత్రి కొల్లు రవి ...తనతో పాటు కొత్తమాజేరు రా... విష జ్వరాలతో చనిపోయిన 18మంది ఇళ్లకు వెళదాం, వాళ్లని అడుగుదాం...మామూలుగా చనిపోయారా? లేక కలుషిత నీళ్లు తాగి, జ్వరాలతో చనిపోయారో అడుగుదాం' అంటూ మంత్రి కొల్లు రవీంద్రకు బహిరంగ సవాల్ విసిరారు.
అధికారంలో ఉన్నామని అవాకులు, చెవాకులు పేలటం కాదని... ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలని అంటారని.. కానీ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం నోటికి వచ్చింది మాట్లాడుతూ ఊరికి ఏమీ చేయకుండా అధికార మదంతో విర్రవీగుతున్నారని పేర్ని నాని ధ్వజమెత్తారు. ప్రభుత్వం అలసత్వం కారణంగానే కొత్తమాజేరులో 18 మంది చనిపోయారన్నారు.
మచిలీపట్నం నియోజకవర్గంలో తాగడానికి నీళ్లు లేకపోయినా... ఇంటి పక్కన బడ్డీ కొట్టులో మాత్రం బ్రాందీ మాత్రం ఫుల్గా దొరుకుతుందని ప్రజలు వాపోతున్నారని పేర్ని నాని తెలిపారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అంటూ ఇంటింటికి, గడపగడప ఎక్కి ఓట్లు అడిగిన కొల్లు రవి.... ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండరని విమర్శించారు. మూడు శాఖలను చేతిలో పెట్టుకున్న కొల్లు రవి బందరుకు చేసింది ఏమీ లేదని పేర్ని నాని ఆరోపించారు.