ఉద్యోగాలు కావాలా? ఆయన పిలుస్తున్నారు!
కంపెనీల పునరుద్ధరణతో ఉద్యోగాలు కోల్పోతున్న వారికి పేటీఎం ఓ అనూహ్య ఆఫర్ ప్రకటించింది.
న్యూఢిల్లీ : కంపెనీల పునరుద్ధరణతో ఉద్యోగాలు కోల్పోతున్న వారికి పేటీఎం ఓ అనూహ్య ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగాలు కావాలనుకునే వారికి తాము ఆహ్వానం పలుకుతున్నట్టు పేర్కొంది. ఇటీవలే స్నాప్డీల్ తన ఉద్యోగుల్లో 600 మందిని తీసివేస్తున్నట్టు ప్రకటించగా.. స్టేజిల్లా మొత్తానికే తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు తెలిపింది. దీంతో ఈ కంపెనీల్లో పనిచేసే చాలామంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. మరోవైపు కంపెనీలు తీసుకునే ఈ నిర్ణయాలపై ఉద్యోగులు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో స్నాప్ డీల్, స్టేజిల్లా ఉద్యోగులకు పేటీఎం ఈ బంపర్ ఆఫర్ను అందించబోతోంది. శుక్రవారం ఉదయం పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు.'' హలో ఢిల్లీ, జాతీయ రాజధాని పరిశ్రమలోని టెక్,ప్రొడక్ట్ ఉద్యోగులారా, వ్యాపార పునరుద్ధరణతో చాలా అసంతృప్తితో ఉన్నారా? అయితే పేటీఎం, పేటీఎం మాల్ మీకు వెల్కమ్ చెబుతోంది'' అంటూ ఓ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్లో ఎలాంటి కంపెనీ పేరును శర్మ ప్రస్తావించనప్పటికీ, ఇటీవల స్టార్టప్లో ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఈ ఆఫర్ అందించనున్నట్టు తెలుస్తోంది. పేటీఎం తన ఈ-కామర్స్ వ్యాపారాలను విస్తరిస్తుందని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. తమ మార్కెట్ప్లేస్, బ్యాంకులో కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నామని, ట్రైన్డ్, డొమైన్ ఎక్స్పర్ట్లకు వెల్కమ్ చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ స్టార్టప్లో పనిచేసేవారందరూ మంచి వ్యక్తులేనని తాము నమ్ముతున్నట్టు, వారు తమ కల్చర్కు సరిపడతారని అధికార ప్రతినిధి చెప్పారు. లింక్డ్ ఇన్ పోస్టుల ద్వారా కూడా ఉద్యోగాలు కోల్పోతున్న వారికి పేటీఎం ఉద్యోగాలు ఆఫర్ చేస్తోంది.