పాక్ తప్పుడు పాలసీలే అందుకు కారణం:ముషార్రఫ్

పాక్ తప్పుడు పాలసీలే అందుకు కారణం:ముషార్రఫ్ - Sakshi


న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రదాడి చేసింది పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులేనని భారత్ చేస్తున్న కామెంట్లకు ప్రపంచదేశాలు మద్దతు ఇవ్వడంపై పాకిస్తాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషార్రఫ్ మాట్లాడారు. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం తెచ్చిన పాలసీలే ఇందుకు కారణమని ఆరోపించారు. ఓ వైపు పాక్ ప్రపంచదృష్టిని ఆకర్షిస్తుంటే.. భారత్ నియంత్రణ రేఖ(ఎల్వోసీ)ని దాటి చేసిన నిర్దేశిత దాడి తర్వాత షరీఫ్ మాత్రం దేశంపై ఎలాంటి ప్రేమ లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు.



పాక్ లో జరగాల్సిన సార్క్ సమావేశాల రద్దుకు కారణం కూడా షరీఫ్ అసమర్ధతేనని ఎద్దేవా చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో పైస్ధాయిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని చెప్పారు. 35 బిలియన్ డాలర్ల లోన్ ను తీసుకున్న పాక్ ప్రభుత్వం ఒక్క మెగా ప్రాజెక్టును కూడా ప్రారంభించకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. భారత్ కు హెచ్చరికలు చేయడం మాత్రమే తెలుసునని అన్న ముషార్రఫ్, పాక్ సైన్యం దాడులు చేసినప్పుడు అసలు సత్తా తెలుస్తుందని చెప్పారు.



పాకిస్తాన్ భూటాన్ లాంటి దేశం కాదని భారత్ తెలుసుకోవాలని అన్నారు. తమ భూభాగం ఉగ్రదాడులు జరిగిన ప్రతిసారీ పాక్ పై ఆరోపణలు గుప్పించడం భారత్ కు అలవాటుగా మారిందని, ఇకనైనా పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. ప్రస్తుతం వెన్నెముకకు చికిత్స తీసుకుంటున్న ఆయన తిరిగి పాక్ కు వచ్చి పరిస్ధితులను చక్కదిద్దడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే, తాను పాక్ కు తిరిగి వచ్చినా పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చని, తన మాటను గౌరవించరని అన్నారు. తనపై ఉన్న కేసులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే పాక్ కు వస్తానని చెప్పారు. 2018 ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top